జయహో… ఇస్రో!

‘ఇస్రో…నీకు నూటనాలుగు వందనాలు!’ “””

ఒకటి… రెండు… మూడు… పది… వంద… మొత్తం నూటనాలుగు!

- ఇదేదో కార్పొరేట్‌ కాలేజీల ర్యాంకుల ప్రకటన కాదు, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) నింగికి పంపనున్న ఉపగ్రహాల సంఖ్య. ఒక్క రాకెట్టుతో నూటనాలుగింటిని కక్ష్యలో ప్రవేశపెట్టేందుకు ఇస్రో సర్వసిద్ధమైంది. ఇప్పటిదాకా ఆ సంస్థకు… మూకుమ్మడిగా ఇరవై ఉపగ్రహాలను పంపిన అనుభవమే ఉంది. అది కూడా గత ఏడాదే సాధ్యమైంది.

అంతర్జాతీయంగా, ఒక్క రష్యా మాత్రమే 37 ఉపగ్రహాలను ఒకే అంతరిక్ష నౌక ద్వారా గగనానికి పంపింది. అమెరికా అంతరిక్ష సంస్థ నాసా అయితే, 29 ఉపగ్రహాలకే తటపటాయించింది. దిగ్గజాల రికార్డుల్నీ తోసిరాజంటూ… ఇస్రో శ్రీహరికోట నుంచి పీఎస్‌ఎల్‌వీ-సి37 ద్వారా మొత్తం నూటనాలుగు ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపబోతోంది. అంతరిక్ష రంగంలో ఇదో మైలురాయి! అందులో నూటొక్క ఉపగ్రహాలు విదేశాలవే. అమెరికా, ఇజ్రాయెల్‌, స్విట్జర్లాండ్‌, కజకిస్థాన్‌, నెదర్లాండ్స్‌ తదితర దేశాలు మన సాంకేతిక సాయం తీసుకుంటున్నాయి. అపార అనుభవమూ, అత్యంత చవకైన సేవలు… ఇస్రో ప్రత్యేకత. మిగతా మూడూ — కార్టోశాట్‌-2డి, ఐఎన్‌ఎస్‌-1ఎ, ఐఎన్‌ఎస్‌-1బి… అచ్చంగా మనవే! కార్టోశాట్‌-2డి అత్యాధునిక కెమెరాలతో భూమికి సంబంధించిన అత్యంత కీలక సమాచారాన్ని అందించనుంది. దీనిబరువు ఏడువందలా ముప్పై కిలోలు. మిగతారెండూ నేవిగేషన్‌ వ్యవస్థకు సాయపడే నానో — ఉపగ్రహాలు. ఒక్కొక్కటీ, పదిహేను కిలోల బరువు ఉంటాయంతే!

జనం కోసం..
ఇస్రో సంధించిన వాటిలో, దాదాపు ముప్పై అయిదు ఉపగ్రహాలు అంతరిక్షం నుంచీ మనకు అండదండలు అందిస్తున్నాయి. ప్రతి ఉపగ్రహానికీ ఓ కచ్చితమైన లక్ష్యం ఉంటుంది. నూటపాతిక కోట్ల పైచిలుకు జనాభా కలిగిన దేశంలో, అందులోనూ డెబ్భైశాతం ప్రజలు పల్లెల్లోనే బతుకుతున్న సమాజంలో — ఇబ్బందులకు కొదవేం ఉంటుంది. ఇక పట్టణాల రుగ్మతలు పట్టణాలకున్నాయి. వ్యవసాయం, పరిశ్రమలు, పర్యావరణం… అది ఏ రంగమైనా కావచ్చు. ఇస్రో తనదైన సాంకేతికతతో కచ్చితమైన పరిష్కారాలు చూపుతోంది. ఉపగ్రహ సమాచారంతో… ఎక్కడ ఏ మేరకు జలసిరులు ఉన్నదీ కచ్చితంగా గుర్తిస్తున్నాం. సముద్రంలో ఏమూలన చేపలు విరివిగా దొరుకుతాయన్నదీ మత్స్యకారులకు చేరవేస్తున్నాం. నేల స్వభావాన్నీ తూకమేసినట్టు అంచనా వేస్తున్నాం. ఏ ప్రాంతం ఎలాంటి పంటలకు అనువైందో శాస్త్రీయంగా నిర్ధరించడమూ సాధ్యం అవుతోంది. ఎక్కడ బూడిద తెగులు పంటల్ని బూడిద చేస్తోందో, ఎక్కడ ఆకు తొలిచేపురుగు రైతు కష్టాన్ని పీల్చి పిప్పిచేస్తోందో ఉపగ్రహాలు లెక్కలేసి చెబుతున్నాయి. చాలా సందర్భాల్లో సర్కారీ అంకెలకూ, క్షేత్రస్థాయి వాస్తవాలకూ పొంతన ఉండదు. అడవుల విస్తీర్ణం విషయంలో ఆ తేడా ఇంకా ఎక్కువ. రికార్డుల్లో ‘దట్టమైన అటవీప్రాంతం’ అని రాసున్నచోట ముళ్లకంపలు కూడా కనిపించకపోవచ్చు. ఉపగ్రహ ఛాయాచిత్రాలు ఆ తేడాల్ని సాక్ష్యాలతో అందిస్తాయి. అంతరించిపోతున్న జీవరాశిని గుర్తించి, రక్షించుకోడానికి కూడా ఉపగ్రహ సమాచారమే దిక్కు. కార్టోశాట్‌-2సి లాంటి ఉపగ్రహాలు సరిహద్దుల్లో శత్రువుల కదలికల్ని పసిగట్టి హెచ్చరికలూ చేయగలవు. పురావస్తు తవ్వకాల్లోనూ ఉపగ్రహ టెక్నాలజీ అండగా నిలుస్తోంది. ప్రతిష్ఠాత్మక ‘జాతీయ తాగునీటి పథకం’ పనితీరును కూడా ఉపగ్రహాల సాయంతోనే పర్యవేక్షిస్తోంది కేంద్రం. ఉపాధి హామీ పథకం పేరు చెప్పి… కోట్లకు కోట్లు మింగేసిన ఘనులున్నారు. ఉపగ్రహ ఛాయాచిత్రాలతో వేసిన రోడ్లెన్నో, తవ్విన చెరువులెన్నో, నాటిన మొక్కలెన్నో పక్కాగా లెక్కచూడ్డమూ సాధ్యం అవుతోంది. ఎప్పుడో బ్రిటిష్‌కాలం నాటి భూ రికార్డుల్ని కూడా ఉపగ్రహాల ఆసరాతో సర్వసమగ్రం చేస్తున్నారు.

మరిన్ని ఘనతల వైపు…

భారతీయులంతా మరో శుభవార్త వినడానికి సిద్ధంగా ఉండాలి! ఇప్పటిదాకా మనుషుల్ని అంతరిక్షంలోకి పంపిన అనుభవం లేదు మనకు. ఆ లోటూ త్వరలోనే తీరనుంది. మానవసహిత అంతరిక్ష కార్యక్రమాల కోసం వ్యోమగాముల ఎంపిక ప్రక్రియా మొదలైపోయింది. ఇస్రో, భారత వైమానిక దళం సంయుక్తంగా చేపట్టిన ప్రతిష్ఠాత్మక కార్యక్రమం ఇది. ఈ ప్రాజెక్టుతో రష్యా, అమెరికా, చైనాల సరసన మనమూ చేరనున్నాం. ప్రయోగించే ప్రతి ఉపగ్రహానికీ ఒక వాహక నౌకను తయారు చేసుకోవడం అంటే, వేలకోట్ల రూపాయల వ్యవహారం. అది కూడా ఒక్కసారికే పనికొస్తుంది. అదే నౌకను వెనక్కి రప్పించుకుని, మళ్లీ మళ్లీ ఉపయోగిస్తే — బొక్కసానికి భారం తగ్గుతుంది. అంతరిక్ష ప్రయోగాల వ్యయమూ ఎనభైశాతం మేర పడిపోతుంది. ఆ ఆలోచనతోనే… ఇస్రో పునర్వినియోగ వాహక నౌకను రూపొందించింది. ప్రయోగాత్మకంగా శ్రీహరికోట నుంచీ 65 కిలోమీటర్ల ఎత్తు వరకూ పంపి, మళ్లీ వెనక్కి తెప్పించింది. ఆ ఉత్సాహంతోనే ఈసారి ఇంకో అడుగు ముందుకేయబోతోంది.

జగమంత కుటుంబం…

ఇస్రో పద్దెనిమిదివేల మంది సభ్యులున్న అతిపెద్ద కుటుంబం. అందులో పదిహేను వేలమంది ఇంజినీర్లూ శాస్త్రవేత్తలే. ఇస్రో ప్రధాన కార్యాలయం బెంగళూరులో ఉంది. మిగతా విభాగాలు దేశమంతా విస్తరించి ఉన్నాయి. శ్రీహరికోటలో సతీష్‌ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌), తిరువనంతపురంలో విక్రంసారాభాయ్‌ స్పేస్‌ సెంటర్‌ ఉన్నాయి. తిరువనంతపురం కేంద్రంగానే ఉపగ్రహ తయారీ కేంద్రం, ఇతర కీలక విభాగాలూ పనిచేస్తున్నాయి. హసన్‌లోని ఉపగ్రహ నియంత్రణ కేంద్రమూ, లఖ్‌నవూ, మారిషస్‌లలోని భూ కేంద్రాలూ ఐఆర్‌ఎస్‌ ఉపగ్రహాల కదలికల్ని గమనిస్తూ తగిన సూచనలు పంపుతాయి. హసన్‌, భోపాల్‌లలో రాకెట్లను నియంత్రించే మాస్టర్‌ కంట్రోల్‌ కేంద్రం ఉంది. హైదరాబాద్‌ సమీపంలోని నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ ఏజెన్సీకి చెందిన డేటా రిసెప్షన్‌ స్టేషన్‌ అయితే, ఓ ఉపగ్రహ గణాంకనిధి. విక్రమ్‌ సారాభాయ్‌, సతీష్‌ ధావన్‌, యు.ఆర్‌.రావు, కస్తూరిరంగన్‌ తదితర దిగ్గజాల నిర్దేశకత్వంలో ఇస్రో ఇంతింతై… అన్నట్టుగా ఎదిగింది. ప్రస్తుత ఛైర్మన్‌గా ఎ.ఎస్‌.కిరణ్‌కుమార్‌ వ్యవహరిస్తున్నారు.

విజయ పరంపర…

ఆర్యభట్టతో ఇస్రో తన ప్రయోగాల పరంపరను ప్రారంభించింది.

1962లో కేరళలోని తుంబ రాకెట్‌ ప్రయోగకేంద్రంతో అంతరిక్ష పరిశోధనలో తొలి అడుగుపడింది. ముందుగా, వాతావరణ పరిస్థితుల అధ్యయనానికి ఉపకరించే మూడు అడుగుల చిన్న సౌండ్‌ రాకెట్లను (ఆర్‌హెచ్‌-75) అంతరిక్షానికి పంపింది.

1975లో రష్యా సాయంతో మన తొలి ఉపగ్రహం ఆర్యభట్టను చేరవేసింది. అనంతరం

1979లో, శ్రీహరికోట కేంద్రం నుంచి ఎస్‌ఎల్‌వీ రాకెట్‌ను నింగి మీదికి సంధించింది. ప్రయత్నం విఫలమైనా, ఆ అనుభవం నుంచి నేర్చుకున్న పాఠాలతో…

1980లో ఎస్‌ఎల్‌వీ రాకెట్‌ (రోహిణి)ను విజయవంతంగా గగనానికి చేర్చింది.

1979–81 మధ్యలో భాస్కర ప్రయోగం మరో ముందడుగు. సామాన్యులకు శాస్త్ర, సాంకేతిక ఫలితాలను చేరువ చేసేందుకు సమాచార ఉపగ్రహ ప్రయోగాలనూ చేపట్టింది.

1975–76లో ‘శాటిలైట్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ టెలివిజన్‌ ఎక్స్‌పరిమెంట్‌’ ద్వారా… సమాచార ఉపగ్రహాన్ని విద్యా బోధన సాధనంగా ఎలా ఉపయోగించుకోవచ్చో కూడా నిరూపించింది.

1979లో ఆపిల్‌ సమాచార ఉపగ్రహాన్ని పంపింది.

1982–90 మధ్యకాలంలో విదేశీ రాకెట్ల సాయంతో ఇన్సాట్‌-1ను నింగికి చేరవేసింది. ఇది ఆకాశవాణి, దూరదర్శన్‌ కేంద్రాలను అనుసంధానం చేసి వినోద, విజ్ఞానాలతోపాటు విద్యావ్యాప్తికి దోహదపడింది. ఆతర్వాత చంద్రయాన్‌, మంగళ్‌యాన్‌ తదితర ప్రతిష్ఠాత్మక కార్యక్రమాలకూ శ్రీకారం చుట్టింది. అందులోనూ గత ఏడాది…మొతం తొమ్మిది ప్రయోగాలు చేపట్టింది. అన్నీ విజయవంతం అయ్యాయి. ఒక రాకెట్‌ ద్వారా వేర్వేరు కక్ష్యల్లో ఉపగ్రహాలు ప్రవేశపెట్టడం. పీఎస్‌ఎల్‌వీ-సి36 పీఎస్‌4లో (నాల్గో దశలో) రిమోట్‌ కంట్రోల్‌ సిస్టమ్‌తో ద్రవ ఇంధనం నింపడం, నావిక్‌ వ్యవస్థ ద్వారా రాకెట్‌ పర్యవేక్షణ, ప్రతికూల వాతావరణంలోనూ రాకెట్‌ అనుసంధానం, మేక్‌ ఇన్‌ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఉపగ్రహంలోని పెలోడ్స్‌ను మనమే అభివృద్ధి చేసుకోవడం… ఇలా అన్నీ విజయాలే.

నాలుగు దశాబ్దాల క్రితం… ఆర్యభట్ట ఉపగ్రహాన్ని నింగికి చేర్చడానికి ఇస్రో ఎన్ని కష్టాలు పడిందీ! సాంకేతిక సంపన్న దేశాల చుట్టూ ఎన్ని ప్రదక్షిణలు చేసిందీ!

కొన్ని వైఫల్యాలు మంచే చేస్తాయి.

గెలిచితీరాలన్న తపనను రగిలిస్తాయి.

అదే జరిగిందిక్కడ. ఒక్కో పరిమితినీ దాటుతూ, ఒక్కో అవరోధాన్నీ అధిగమిస్తూ, ఒక్కో అడుగూ ముందుకేస్తూ, ఒక్కో మైలురాయినీ వెనక్కితోస్తూ, ఒక్కో ప్రయోగాన్నీ పూర్తిచేసుకుంటూ శతాధిక లక్ష్యాలతో దూసుకెళ్తొంది ఇస్రో. 
ఒకప్పుడు, ప్రపంచం వైపు మనం చూశాం. 
ఇప్పుడు, ప్రపంచమే మనవైపు చూస్తోంది. 
నిప్పులు చిమ్ముతూ నింగికెగురుతున్నది…ఉపగ్రహాలే కాదు
- మన ఘనతా, మన సత్తా!

‘ఇస్రో…నీకు నూటనాలుగు వందనాలు!’

Reference : http://www.eenadu.net/magazines/sunday-magazine/sunday-magazineinner.aspx?catfullstory=10613