దేశ దేశాల ఉగాది: మోరిష్యస్ రేడియోలో ప్రసంగం

Le Nouvel An Telugu, avec des explications en français (Pour Radio Maurice)

--

(మోరిష్యస్ రేడియోలో 14 మార్చి 2023 నాడు ఇచ్చిన తెలుగు-ఫ్రెంచి ద్విభాష ప్రసంగం. Discours bilingue prononcé le 14 mars 2023 sur Radio Mauritius.)

Namaste et salutations à mes chers amis de l’île Maurice. Je m’appelle Akshayé. Je vous parle d’une autre île tropicale, mais située en Asie : Singapour. Je parle cinq langues, l’anglais, le français, un peu d’ourdou, un peu d’espagnol… mais aujourd’hui, je veux vous parler dans ma langue maternelle, le télougou. Chaque printemps, nous, les Telugus du monde entier, célébrons le festival du nouvel an : l’ugadi.

మోరిష్యస్ దేశములో సహృదయులు, స్నేహితులు, శ్రోతలకు నమస్కారము. నా పేరు అక్షయ్. చైత్ర శుద్ధ పాడ్యమి నాడు నూతన తెలుగు సంవత్సరము మొదలు అవుతుంది అని మన పూర్వీకులు చెప్పారు. హిందూ మహా సముద్రమునకు అవతలి తీరము అయిన సింగపూర్లో ఈ పండుగ ఎలా జరుపుకుంటామో మీకు వివరిస్తాను.

ఉగాది అంటే యుగమునకు ఆది. ఫాల్గుణ అమావాస్యతో శుభకృతు నామ సంవత్సరము ముగిసి, చైత్ర సుద్ధ పాడ్యమితో శోభకృతు నామ సంవత్సరము మొదలు అవుతుంది అని పంచాంగము చెపుతున్నది. తెలుగు సంవత్సరాలు 60, ప్రతీ సంవత్సరానికి ఒక పేరు. శ్రోతలు గుణింతాన్ని గుర్తించగలరు. ముంగించే సంవత్సరము శుభకృతు — అనగా, శుభాన్ని కలిగించేది, ప్రజలు శుభముగా ఉండే సంవత్సరము. రాబోయే సంవత్సరము శోభకృతు — శోభను కలిగించేది, ప్రజలు శుఖంగా ఉండు సంవత్సరము.

కాలాన్నే దైవంగా భావించి పూజించే జాతి మనది. Nous considérons le passage du temps comme étant divin. ఎందుకంటే:

సముద్రాద్ అర్ణవాద్ అధి సంవత్సరో అజయాత
అహో రాత్రాణి విదధద్ విశ్వస్య మిషతో వశీ
సూర్యా చంద్రమసో ధాతా యథాపూర్వం అకల్పయత్
దివం చ ప్రథివీంచ అంతరిక్షం ఆతో స్వాహః

రాత్రింపవళ్ళు మన ఇంద్రియాలను పాలించేది కాలం. విశాలమైన కడలి నుండి కాలం ఆవిర్భము అయ్యాకే, సూర్య చంద్ర నక్షత్ర అంతరిక్ష ఇత్యాదులు సృష్టింపబడినవి అని ఋగ్ వేదం దశమ మండలం, 190 సూక్తంలో పేర్కొన్నారు.

ఉగాది అంటే శుభ కార్యములకు ఆది. ఉగాది నాడు ఎన్నో శుభ కార్యములను మొదలు పెట్టడం తెలుగు వారి ఆనవాయతి. వాణిజ్య వేత్తలు వారి వారి ప్రణాళికలను ఉగాది నాడు మొదలు పెట్టుతారు. ఇక్కడి తెలుగు బడిలో పాఠాలను ఉగాది నాడు మొదలు పెట్టుతారు. గృహస్తులు కూడా వారి వారి గృహాలలో కొత్త కార్యాలను తలపెట్టుతారు.

ఉగాది అంటే ఆనందోత్సాహములు. ఉగాది పర్వ దినము నాడు ప్రాతః కాలమే లేచి, తలంటి స్నానము చేసి, కొత్త బట్టలు ధరించి, పిండి వంటలు చేసుకుని తినడం తెలుగు వారి సంప్రదాయం. సింగపూర్ దేవాలయంలో పొద్దున్నా, సాయంత్రం కార్యక్రమాలు ఉండనే వుంటాయి, వారంతము సామాజిక కార్యాక్రమాలు, కళా ప్రదర్శనులు ఉంటాయి. కానీ, అన్నింటి కంటే ముందు ముఖ్యమైన అంశము ఒకటి వున్నది.

ఉగాది అంటే షడ్రుచుల ఉగాది పచ్చడి. ఉగాది పచ్చడి లేనిదే ఉగాది కాదు. షడ్రుచులు అంటే ఆరు రుచులు — six saveurs — మీకు తెలిసినవే — తీపి, పులుపు, ఉప్పు, కారం, చేదు, వగరు. ఆరు రుచుల కలియికే ఉగాది పచ్చడి, నవ రసాల మిశ్రమమే జీవితం. ముగిసిన సంవత్సరంలో చేదు అనుభవాలు ఉండి ఉండవచ్చు, కానీ అది కాలచక్ర కదలికలో ఒక రుచి మాత్రమే. చేదు రుచితో పాటు, కొంచం ఖారం, కొంచం వగరు, మరెన్నో తీపి అనుభవాలు తప్పక వస్తాయి అన్నది ఈ సాంప్రదాయం యొక్క సారంశం.

ఉగాది పచ్చడి ఉగాదికి, తెలుగు వారికే ప్రత్యేకం. ఒకే గిన్నెలో నుంచి పచ్చడి తీసుకున్నా, అందరికీ ఒకే లాగా రుచి చేయకపోవచ్చు. కొందరికి ఎక్కువ చేదుగానూ, మరి కొందరికి ఎక్కువ పుల్లగానూ, మరొకరికి కాస్త ఖారంగానూ అనిపించచ్చు. నిజానికి ఇది ప్రసాదం రూపంలో ఉన్న చిత్రదర్శిని — c’est un kaléidoscope delectable — మన కోరికలు, ఆకాంక్షలు మనకే ప్రదిబింబగలిగిన అరచేతి పట్టకం.

తీపి బెల్లం నుంచి, ఉప్పు ఉప్పునుంచి, ఖారం పచ్చిమెరప నుంచి, పులుపు చింతకాయ నుంచి, వగరు (En Francais, «la saveur astringent») మామిడి కాయ నుంచి, మరి చేదు వేపాకుల నుంచి వస్తాయి. సింగపూర్లో అన్నీ దొరుకుతాయి కానీ వేపాకులు మాత్రం దొరకవు. అందుకే ఇక్కడి తెలుగు సమాజం వారు ఇంటింటా తెలుగువారికి వేపాకులు పంపిణీ చేస్తారు. అలాగే, సమోహికంగా సమాజం సభ్యులు ఉగాది పచ్చడిని తయారు చేసి, ఇక్కడి శ్రీనివాసా పెరుమాళ్లు కోవెలలో పంపిణీ చేస్తారు.

ఉగాది అంటే తెలుగు వారు. ఎక్కడ శ్రీనివాసుడు వెలశాడో అక్కడ తెలుగు వారు ఉన్నారు అన్నది నాంది. సింగపూర్లో కూడా ఇదే పరిస్థితి — 1850లలో కట్టిన శ్రీనివాస పెరుమాళ్ళ గుడి తెలుగు వారి సాంసృతిక, ఆధ్యాత్మక కార్యక్రమాలకి నిలయం. అక్కడి పూచారులు కొంత మంది తెలుగు మాట్లాడుతారు, పూజలు, వ్రతములను తమిళంలోనూ, తెలుగులోనూ సమిష్టిగా చెపడుతూ ఉంటారు.

ఉగాది పర్వ దినము నాడు ప్రాతః కాలమే స్వామి వారికి సుప్రభాత సేవలు మొదలు అవుతాయి. ప్రత్యేక సేవలతో కూడి శ్రీ వారి కళ్యాణము కూడా జరుపుతారు. మహమ్మారి (en Francais, «pandémie») వల్ల రెండేళ్ళ సుదీర్ఘ విరమామం దురదృష్ట వసాత్తూ వచ్చింది. ఆ తరువాత కిందటి ఉగాది నాడు జరిపిన స్వామి వారి కళ్యాణము కనుల విందుగా జరిగినది. కొవిల ప్రాంగణంలోనే స్వామి వారి ఊరేగింపు, పవళింపు సేవ ఇత్యాది పూజ కార్యక్రమాలు జరుపుతారు. ఆ తరువాత, ఉగాది పచ్చడి విస్తారణతో కూడి, పంచాంగ శ్రవణము, సాంస్కృతిక కార్యక్రమాలు జరుపుతారు.

ఉగాది అంటే తరతరాల తెలుగు వారు. మోరిష్యస్ లాగే సింగపూర్ లో కూడా భారతీయ-సంతతి గలవారు, ముఖ్యంగా తెలుగు వారు, కనీసం రెండు వంద యేళ్ళ బట్టి నివస్తున్నారు. కూరం గెట్టసెట్టి అనే వ్యక్తి సింగపూర్లో ప్రప్రథమ తెలుగు వారు. క్రీ.శ. 1822లో ఇక్కడ భూములు కొన్నారని ప్రభుత్వ దాఖలాలు చెప్పుతున్నాయి.

అదే విధంగా, సింగపూర్లో అతి పురాతనమైన గుడి అయిన మారియమ్మ కోవెలలో క్రీ.శ. 1829 నాటి తెలుగు శిలాశాసనాలు కనిపిస్తాయి.

ఉగాది అంటే వసుదైవ కుటుంబకం. తెలుగు వారే కాదు, కన్నడ, తుళు జాతి వారు కూడా ఉగాది జరుపుకుంటారు. మరాఠీ వారు ఈ పండుగను గుది పడవగా జరుపుకుంటారు. గుది అనగా ధ్వజమునకు అలంకరించిన పతాకము. ఇళ్ళ ముందు ఈ పతకాములను ఎత్తడం మరాఠీయుల అనవాయతి. శాలివాహనుడు పైఠాన్ కి తిరిగి రావడమును స్మరిస్తారు అని చెపుతారు.

అదే విధంగా, ఉగాది నాడు మణిపూర్లో సజిబు నంగ్మ పన్బ పండుగ జరుపుకుంటారు. ఈ పర్వ దినము నాడు మైతేయిల ఇష్ట దేవత లైనింగ్ తు సనమాహికి పళ్ళు, కూరగాయలు, బియ్యం అర్పిస్తారు. ఆ తరువాత ఆడవారు కూరగాయలు తరిగి, మగవారు విందు భోజనం వండుట వారి ఆనవాయతి.

అలాగే, సింధీయులు ఈ పండుగనే చేటి చాంద్ గా జరుపుకుంటారు. సింధీయులది నదీతీర సంస్కృతి — les sindhis sont une culture fluviale. వారు వరుణ దేవుడిని zinda peer — సజీవ దేవుడైన ఝూలేలాల్ గా చేటి చాంద్ నాడు పూజిస్తారు. తెలుగు వారి లాగే, సింధీయులు కూడా సింగపూర్లో ఎన్నో శతాబ్దాల నుంచి నివశిస్తున్నారు. కిందటి ఏడాది చేటి చాంద్ సంబరాలకు మా ప్రథాని శ్రీ లీ సియేన్ లూంగ్ గారు ముఖ్య అతిధిగా విచ్చేసారు.

సింగపూర్ దక్షిణాన ఇండోనీశియా దేశంలో బాలీ ద్వీపం సనాతన ధర్మానికి కేంద్రం. ఈ సారి వారి సంవత్సరాది, న్యేపి, ఉగాది నాడు జరపుకోవడం విశేషం. న్యేపి నాడు వారు ఉపవాసము చేసి, ధ్యానం చేయడం వారి సాంప్రదాయం. ధ్యానానికి భంగం వాటిల్ల కుండా ౨౪ గంటలపాటు, ఇంటాబయట దీపాలను తదితర విద్యుత్ పరికరాలను ఆపి, జనసంచారమును నిలిపి వేయడం వారి సాంప్రదాయం. ౨౪ గంటల తరువాత ఇళ్ళ నుండి బయటకు వచ్చి ఉత్సవాలను జరుపుకుంటారు.

మోరిష్యస్ లాగా సింగపూర్ కూడా ఓ వలసపాలన-ఆంతర సమాజము. Singapour est une société post-coloniale. భారతీయలతో పాటు, చైనీయులు, మలయియులు, ఇతర జాతులు సామరస్యముతో, ఐకమత్యముతో కలిసి జీవిస్తున్నాయి. ఈ యేడాది ఉగాది నాడే ముస్లిం సోదరులకు అతి పవిత్రమైన రంజాన్ నెల మొదలు అవుతుంది. చైనీయ సంవత్సరములో మూడో నెల మొదలు ఫాల్గుణ అమావాస్య, ఆ తరువాత తిథి ఉగాది అని చాలా మందికి తెలియదు.

ఉగాది అంటే మోరిష్యస్లో సోదరులు, సోదరీమణులు. ఆల్ ఇండియా రేడియో, సింగపూర్, మలేశియా రేడియోల కంటే ముందు మోరిష్యస్ రేడియోలో తెలుగు పాటలు, కార్యక్రమాలు వచ్చేవని మా నాన్నగారు చెప్పారు. మన ఉమ్మడి సంస్కృతి, తెలుగు మీద, తెలుగు వారి మీద మోరిష్యస్ ప్రజల మమకారమునకు ఇది నిదర్శనం. అంతే కాదు. ఎన్నో తరాల తరువాత కూడా తెలుగు భాష మీద ఆప్యయాతతో ఎనలేని సేవలు అందించిన ఆప్తులు సంజీవా అప్పడు గారికి Order of the Star and Key of the Indian Ocean (OSK) ఇచ్చారంటే తెలుగుపైన, ఆయన సేవలపైన మోరిష్యస్ దేశపు గౌరవం ఎంతో మనము చెప్పచ్చు. మీ బాటయే మాకు ఆదర్శము.

ఉగాది అంటే మా కుటుంబము. మాది బహు సంస్కృతీ కుటుంబం. La nôtre est une famille multiculturelle. నా మాతృ భాష తెలుగు, మా ఆవిడది చైనీస్. ఉగాది నాడు మా పుత్రికారత్నము పుట్టినది. అంటే ఉగాది మా ఇంట పండగే కాదు, జన్మదిన వేడుకలు కూడా. చైనీయ సంవత్సరాది నాడు అందరికీ మేము తెలుగు, చైనీస్ లలో శుభాకాంక్షలు చెపుతాము. ఉదాహరణకు ఈ సంవత్సరము శశము నామ సంవత్సర శుభాకాంక్షలు అని చెప్పాము, ఎందుకంటే చైనీస్ వారు ఈ ఏడాదికి శశము అనగా «కుందేలు» అనే పేరు పెట్టారు. C’est l’année chinoise du lapin. Le mot télougou pour « lapin » est « kundélu » ou « śaśamu ».

అలాగే, ఉగాది నాడు శోభకృతు నామ సంవత్సర శుభాకాంక్షలు అని చెప్పడమే కాక, ఇలా కూడా అంటాము: 泰卢固语新年快乐 (Tài lú gù yǔ xīnnián kuàilè)

--

--

కాశీ మజిలీ కథలు
కాశీ మజిలీ కథలు

Published in కాశీ మజిలీ కథలు

తెలుగులో యాత్రా చరిత్రలు (“travelogues”). 1838లో ఏనుగుల వీరాస్వామి గారు ప్రచురించిన కాశీ యాత్ర చరిత్ర అడుగుజాడలలో.

Akshay Regulagedda
Akshay Regulagedda

Written by Akshay Regulagedda

Speaks strategy, data, and design. Occasional forays into history and travel. Blogs in 2 languages.

No responses yet