సాష్టాంగము

--

తెలుగు తల్లి, భూదేవి కలిసి పన్నిన కుట్ర

(ప్రపంచ తెలుగు సాహితీ సదస్సులో ప్రసంగ రూపంలో. వీడియో కింద )

“To revive the literature of a language was an arduous task, and he a foreigner.” — CP Brown

“నిలువ నీడ లేకుండా పోయిన తెలుగు సరస్వతిని ఆహ్వానించి, తన బంగళాలో ఒక సాహిత్య పర్ణశాల ఏర్పరచి, ఆ వాగ్దేవిని నిండు ముత్తైదువ లాగా నడయాడేటట్లు చేయగలిగాడు బ్రౌన్” — ప్రముఖ పరిశోధకుడు బంగోరె

తెలుగు భాషాభిమానులను పక్కకు పెడితే, చాల్స్ బ్రౌన్ గారి గురించి ఎక్కువ మందికి దురదృష్ట వసాత్తూ తెలియదు. నిజానికి, ఆయన లేకపోతే ఈ బ్లాగే ఉండదు.

2014 నవంబరులో నేను బార్సెలోనాలో చదువుకునే వాడిని. అనుకోకుండా నాలుగు రోజులు సెలవు రావడంతో మిత్రులను కలవడానికి లండన్ వెళ్ళాను. అక్కడి కెన్సాల్ గ్రీన్ స్మసానంలో బ్రౌన్ సమాధిని యునైటడ్ కింగ్డమ్ తెలుగు అసోసియేషన్ (యూక్త) వారు పునరుద్ధరించారని విని, గూగుల్ మ్యాప్స్ సహాయంతో ఆ సమాధిని చూడడానికి బయలు దేరాను. చలి దేశాల వాతావరణం నాకు ఎప్పుడూ ఇబ్బందికరమే. తగ్గుతున్న ఉష్ణోగ్రత, నవెంబరు చల్ల గాలి, నెరిసిన లండన్ మబ్బులతో Harrow Road కాస్త harrowingగా (“అతివ్యాకులకరంగా”, బ్రౌన్ దొర అనువాదం) అనిపించింది.

కెన్సాల్ గ్రీన్ స్మసానం సువిశాలమైనది. ప్రవేశం ఎక్కడో తెలియక ఆఫీసులో అడుగు పెట్టాను. ఆఫీసులో కంప్యూటర్లు, ప్రింటర్ల మధ్య ఒకే ఒక ఉద్యోగి ఉన్నారు. “పేరు ఇవ్వండి, సమాధి నంబరు చెప్పుతాను”, అని చెప్పి, పేపరు, పెన్ను నాకు ఇచ్చారు. బ్రౌన్ గారి పేరు, పుట్టిన, నిర్యాయణము అయిన సంవత్సరాలు రాసి ఇచ్చాను. ఆయాన లోపలికి వెళ్ళి పోయారు.

కెన్సాల్ గ్రీన్ ముఖ ద్వారము. వాళ్ళ ఆఫీసు కుడి పక్క కనిపిస్తుంది.

చాల్స్ బ్రౌన్ క్రీ.శ. 1798 కలకత్తాలో జన్మించి, తండ్రి మరణం తరువాత ఇంగ్లాండు కెళ్ళి, అక్కడ అలనాటి East India Company College లో విద్యాభ్యాసం పూర్తి చేసి, క్రీ.శ. 1817 కల్లా మద్రాసుకు వచ్చారు. క్రీ.శ. 1820లో అప్పటి మద్రాసు సంస్థానం గవర్నరు, థోమస్ మున్రో, ఈస్ట్ ఇండియా కంపనీ ఉద్యోగులు అందరూ స్థానీయ భాష నేర్చుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. నేడు తెలుగు రాష్ట్రాలలో పని చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు తెలుగు నేర్చుకోవాలని నియమం లేదు, వాళ్ళు నెగ్గాల్సిన తెలుగు పరీక్ష లేదు. గమనించగలరు.¹

ఎంత సేపు ఆగినా రాకపోయే సరికి నేను కెన్సాల్ గ్రీన్ స్మశానం యొక్క గేటు వెంపు వెళ్ళడం మొదలు పెట్టాను. స్మశాన ప్రవేశ ద్వారం ఆఫీసు భవనం పక్కనే. గేటులోకి అడుగు పెట్టంగానే, “మ్యాప్ లేకుండా ఎక్కడికి వెళ్ళుతున్నారు? తప్పిపోతారండోయి!”, అని నవ్వుతూ స్కాటిష్ యాసలో ఆ ఉద్యోగే మళ్ళీ పిలిచారు. ఉద్యోగి, ఉద్యోగి అని అంటున్నాను; ఆరు యేళ్లు అయినది, ఆయన పేరు మరచిపోయాను. ప్రస్తుతం ఆయన పేరు మాథ్యూ అనుకుందాం. మాథ్యూ మళ్ళీ ఆఫీసు లోపలికి పిలిచి చెప్పారు: “మీరు ఈయన పూర్తి పేరు సరిగ్గా ఇవ్వలేదు. అందుకే నేను సుదీర్ఘంగా కంప్యూటర్లో సోధించాల్సి వచ్చింది. ఈయన పేరు Charles Pierce Brown కాదు, Charles Phillip Brown. ఆయాన పుట్టిన రోజు ఇవ్వాళ. ఇదిగో ఆయన సమాధి యొక్క నంబరు.”

బ్రౌన్ దొర జననం, మరణం, సమాధి నంబరు

ఓహో!

కడపలో డెప్యూటీ collectorగా (a revenue collector: పన్ను రూకలు వసూలు చేసేవాడు; A book collector: గ్రంధములు సంగ్రహించేవాడు) నియమింపబడ్డ బ్రౌన్, అప్పటికే ఫార్సీ, హిందుస్తానీ భాషలు నేర్చుకున్నా, తెలుగుని కూడా తప్పనిసరిగా నేర్చుకోవాల్సి వచ్చింది. అప్పటి కడప కలెక్టరు, జోన్ హ్యాన్బరీకి తెలుగు వచ్చు. భాష ఎలాగోల నేర్చుకోవాలి. కానీ, అప్పటి పండితులకు ఇంగ్లీషు రాదు. అప్పటి తెలుగు విద్యాభ్యాసం తెలుగేతరులను ఉద్దేశించింది కాదు. తెలుగు నేర్చుకోవడానికి చాలా కష్టపడ్డారని కథనం.

“బ్రౌన్ గారి సమాధికి వెళ్ళాలంటే మీరు ఇదిగో ఈ దారి పట్టుకోవాలి”, అని ఎఱ్ఱ రంగులో మేథ్యూ పటం దిద్దారు. “మీరు ఈ బ్లాక్ కి ముందు వెళ్ళాలి, ఆ తరువాత… ఆగండి”, అని ఇంకో పటం ఫోటోకాపీ చేయడానికి లోపలికి వెళ్ళారు.

కెన్సాల్ గ్రీన్ పటం

ఆగస్టు 13, 1817 ముందు తెలుగు భాష గురించే వినలేదని బ్రౌన్ గారి వ్యాఖ్యానం². వెలగపూడి కోందండరామ పంతులు నుంచి తెలుగు చదవడం వ్రాయడం నేర్చుకొని, 1820లో తెలుగు పరీక్షలలో ఉత్తీర్ణత పొంది, జాన్ హన్బరీకి డెప్యూటీగా నీయమింపబడ్డారు. సజీవ భాషను పుస్తకాల నుంచి కంటే, వాడుక భాష నేర్చుకోవడమే మేలని హ్యాన్బరీ గారి నుంచి, స్థానికల నుంచీ తెలుగు ఉచ్చారణ నేర్చుకోవడం మొదలు పెట్టారు. భారతం, భాగవతం వంటి కష్టమైన గ్రంథాలు చదవడం కంటే, సులువుగా వాడుక భాషలో పుస్తకాలు, అలాగే తెలుగు వ్యాకరణం విశ్లేషించే పుస్తకాలు ఉంటే, రాబోయే తరాలకు ఉపయోగ పడుతుంది అన్నది ఆయన ఆలోచన. చిట్టచివరికి 1824లో వేమన శతకం యొక్క ఫ్రెంచి అనువాదం దొరకడంతో తెలుగులో సాహిత్య సేవలు మొదలు పెట్టారు. అలా 30 యేళ్ళు సేవలు అందిస్తూ వచ్చారు³.

ఇంతలోనే మాథ్యూ మళ్ళీ వెనక్కి వచ్చి, ఇదిగో, ఈ పటం ఇచ్చారు. ఆయన చెప్పింది నిజమే: ఈ కొద్ది సామాధులలలోనే రండు, మూడు “బ్రౌన్”లు కనిపించాయి. “ఇదిగో, మీ బ్రొన్ ఇక్కడ: సమాధి నంబరు 29,517”, అని ఎఱ్ఱ సిరాతో చూపించారు.

ఫ్రెంచి జెస్యూయిట్ missionary (“ఖ్రిష్టు మతమును బోధించడానకై పంపడబ్డవాడు”) ల గాక్ (Le Gac) వేమన శతాకాన్ని, అసలు తెలుగు సాహిత్యాన్ని, చదివిన ప్రప్రథమ European (“యూరోపుదేశస్థుడు). సంస్కృతంలో వేదాలు, తమిళంలో కంభన్ రామాయణము, తెలుగులో వేమన శతకాలు, భర్తృహరి సుభాషితాల తెలుగు అనువాదము (ఏనుగు లక్ష్మణ కవి విరచినది?) లూయిస్ XIV కొలువుకి పంపారట. అలా పంపిన వేమన శతకాన్ని దొడ్డ స్వామి అని పిలవబడే జ్వాఁ ఆన్తోన్ దూబ్వా ఫ్రెంచిలోకి అనువదించారట.⁴

దూబ్వా గారి వేమన శతకం యొక్క ఫ్రెంచి అనువాదం మొదలు, బ్రౌన్ తాళపత్ర గ్రంథాలను సేకరించడం, కొనుగోలు చేయడం మొదలు పెట్టారు. అలా సేకరించిన గ్రంథాలను పండితులు, నిపుణులకు చూపించి, దిద్దించి, నిపుణుల వ్యాఖ్యలను record చేసి (“జ్ఞాపకార్థము వ్రాసి”) వచనాన్ని ప్రచురించడం మొదలు పెట్టారు. ఉద్యోగరిత్యా వచ్చే బదిలీల వల్ల పనికి ఆటంకం రాకూడదని, కడపలో బంగళా కొని, ఇలా నిపుణలకు జీతాలు ఇస్తూ, తాళప్రత గ్రంథాలు కొనుగోలు చేస్తూ వచ్చారు. అలా చేయడంతో ఆర్థిక అవస్థలు పాలయ్యి, అప్పులు కూడా చేయవలసి వచ్చిందట.⁵

స్మశాన పటములు పట్టుకొని నేను బ్రౌన్ సమాధి వెంపు నడవడం మొదలు పెట్టాను. అసలే రెండు వందల యేళ్ళల్లో పూర్తిగా నిండిన స్మశానము. అందులోనూ వెలుతురు లేని సీతా కాలం. అందులోనూ కుమ్ము కుంటున్న మబ్బులు. సన్నట్టి చిణుకులు, వాన వల్ల బురద, మడుగులుగా మారిన రోడ్డు, lawn (“పసరికబయలు). రెండు పక్కలా సిధిలాలో ఉన్న సమాధులు, విగ్రహాలు. “ఇంతకీ, ఈయన, మిస్టర్ బ్రౌన్, మీకు ఏమవుతారు? మీ బంధువా?”, అని మేథ్యు అడిగిన ప్రశ్న ఇంకా నా మదిలో ఇంకా మోగుతోంది.

అలా 1164 వేమన పద్యాలను సేకరించి బ్రౌన్ దొర చివరికి 1839 ప్రచురించారు. 1832–33లో వచ్చిన డొక్కల కరువులో బ్రౌన్ సేవలు ప్రశంసలందాయి అని వాక్కు. డొక్కల కరువుని కొరతగా రాయాలని అధికారులు చెప్పినా, కరువుగా పేర్కొనడంతో వారి అసంతృప్తిని ఎదుర్కొన్నారు అని తెలుగు వికీలో వ్రాశారు⁶. న్యాయ రంగ controversy (“వివాదము, వ్యాజ్యము, జగడము పోట్లాట”) ఎదురుకొని, perjury (“అసత్యము, అప్రమాణము, తప్పుసత్యము”), forgery (“మరచుట, మరిచిపోవుట, ఉపేక్షచేసుట”) కేసులలో ఇరుక్కుని, కలెక్టరు ఉద్యోగము విడవవలసి వచ్చి మూడు యేళ్ళు ఇంగ్లాండులో absentee (“లేనివాడు, ఉండనివాడు”) allowance (“భరణము, బత్తెము, వర్తన, గ్రాసము”) పొందారని సి.పి. బ్రౌన్ లైబ్రరీ వారి కథనం⁷. ఏది ఏమైనా, ఆ మూడేళ్లలో ఇంగ్లాండులో ఉంటూ, తెలుగు వ్యాకరణమే కాదు, తెలుగులో ప్రప్రథమ నిఘంటువు వ్రాయడం మొదలు పెట్టారు.

1839 కల్లా మళ్ళీ తెలుగు నాట విచ్చేసి, ఈస్ట్ ఇండియా కంపనీలో అనువాదకులుగా, తెలుగు భాష భాషోద్ధారకునిగగా సేవలు పునఃప్రారంభించారు. 1830లలో మొదలు పెట్టిన నిఘంటువు 1851లో ప్రచురించారు.

నా వంటి millennial (బ్రౌణ్య నిఘంటువులో పదం లేదు)కి బ్రౌన్ దొర ఏమవుతారో చెప్పడం చాలా కష్టం. మా ముందు తరం వాళ్ళు బ్రౌణ్య నిఘంటువుని తెలుగు ఆలోచనలను ఇంగ్లీషులోకి తర్జుమా చేయడానికి వాడితే, మా తరం, అలాగే డయాస్పోరా వారు, ఇంగ్లీషు ఆలోచనలను తెలుగులోకి తర్జుమా చేయడానికి వాడడం మొదలు పెట్టరు. వేమూరి గారి నిఘంటువు, ఆంధ్ర భారతి వారి నిఘంటువు వచ్చే వరకూ అంతర్జాలంలో బ్రౌణ్య నిఘంటువు మాత్రమే ఉండేది. ఇంకో విధంగా చెప్పాలంటే: 21వ శతాబ్దములో, అంతర్జాలము వంటి అధునాతన సాంకేతిక మాధ్యమాలు వాడుతూ, మతృ భాషలో కొత్త పదాలు నేర్చుకోవడానికి 18వ శతాబ్దములో నివశించిన పరదేశీయుని సహకారం తీసుకోవాల్సి వస్తోంది.

బ్రౌణ్య నిఘంటువు ఆధునిక తెలుగు ఇంగ్లీషు భాషలకి outdated (కాల దోషం పట్టిన”, బ్రౌణ్య నిఘంటువులో అర్థం లేదు) అయిపోయింది. కానీ, ఇరు భాషలనూ పూర్తిగా అర్థం చేసుకోవడానికి బ్రౌణ్య నిఘంటువును మొదలు పటించి, ఆ తరువాతే ఇంకే నఘంటువుని చూడాలి. వినాయకుని పూజ తరువాతే సరస్వతీ దేవి పూజ.

బ్రౌన్ దొర సమాధి

ఎంతో దూరం నడవగా నడవగా, మాథ్యూ చెప్పిన సెక్షన్ని రెండు మూడు సార్లు ప్రదక్షిణం చేసిన తరువాత, చిట్ట చివరికి బ్రౌన్ దొర సమాధి దర్శనమిచ్చింది. బాగా అలసి పోగా, అదిగో, సమాధి వెనకాల ఉన్న కుర్చీలో కూర్చోబోయాను.

ఆ తరువాత జరిగిన సంఘటనకు నేను మాథ్యూ, వారి బృందాన్ని తప్పు పట్టట్లేదు. అప్పటికే నాకు ఎంతో సహకరించారు. రెండు వందల యేళ్ళ సిధిలాను సరి చూసుకోవడం మాటలా! లండన్ వాతావరణంలో చెక్కలు బద్దలు అవడం సహజం.

కూర్చోబోయిన కుర్చి ముక్కలుగా విరిగి, నేను కిందకు పడడం, తెలుగు తల్లి, భూమాతలు కలిపి పన్నిన కుట్ర. ఎందుకంటే, మహానుభావుని కొలువులో కూర్చోబోయి, నేల మీద పడి, అష్ట అంగాలతో సాగిలబడి దండము పెట్టడాన్ని సాష్టాంగము అని అంటారని బ్రౌణ్య నిఘంటువులో పేర్కొన్నారు.

s-āshṭ-āngamu

[Skt.] n.

Prostrate adoration. Literally, touching the ground with (స) the eight (అష్ట) limbs (అంగ), i.e. , the hands, knees, shoulders, breast and forehead. సాగిలబడి దండము పెట్టడము.

సాష్టాంగదండ ప్రణామముచేయు to do homage.

సాష్టాంగదండము or సాష్టాంగ నమస్కారము prostrate homage.

“కరయుగములు చరణంబులు, నురములలాటస్థంబు నున్నతభుజముల్. సరిధరణిమోపిమ్రొక్కిన, బరువడిసాష్టాంగమండ్రు పరమమునీంద్రుల్.”

ఈ వ్యాసం 8వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సులో ప్రసంగం రూపంలో.

1C. P. Brown, the Savior of Telugu Culture”, Vepachedu Educational Foundation. Accessed 21 Feb 2021.

2 Sitaramayya Ari, Sreenivas Paruchuri, “Charles Philip Brown” Accessed 21 Feb 2021.

3 Ibid.

4 రెండు వంద యేళ్ళ తరువాత లాంగ్ ఓ ప్రొఫెసర్, మిత్రులు, డా. డానియల్ నెగ్గర్స్ మళ్ళీ వేమన శతకాన్ని ఫ్రెంచిలోకి అనువదిస్తున్నారు.

5 Sitaramayya, Ari, Sreenivas Paruchuri.

6 చార్లస్ ఫిలిప్ బ్రౌన్. తె వికీ.

7 CP Brown Library, “CP Brown: An Introduction”. Accessed 21 Feb 2021.

--

--

కాశీ మజిలీ కథలు
కాశీ మజిలీ కథలు

Published in కాశీ మజిలీ కథలు

తెలుగులో యాత్రా చరిత్రలు (“travelogues”). 1838లో ఏనుగుల వీరాస్వామి గారు ప్రచురించిన కాశీ యాత్ర చరిత్ర అడుగుజాడలలో.

Akshay Regulagedda
Akshay Regulagedda

Written by Akshay Regulagedda

Speaks strategy, data, and design. Occasional forays into history and travel. Blogs in 2 languages.

No responses yet