Photo by Jenny Huey, licensed under the Creative Commons Attribution 2.0 Generic license

సింహాసనంపై వెలసిన తెలుగు శాసనం

--

సింగపూర్ లో 200 యేళ్ళగా వస్తున్న తెలుగు ఘోష

ఉపోద్ఘాతం

భావ ప్రకాశ శక్తులను ప్రసాదించునది తెలుగు భాష. శంకరంబాడి సుందరాచారి గారి గేయంతో తెలుగు భాషని, తెలుగు వారి చరిత్రను మల్లె పూదండలతో, మంగళ హారతిలతో తెలుగు తల్లిగా గౌరవించడం విరివిగా వస్తున్న తెలుగు సంప్రదాయం. మరి ఆ తల్లి:

ఎక్కడ కలదే క్రియన్ ఏ చక్కటిన్ వర్తించున్ ఎట్టి జాడనున్ వచ్చున్? మాట్లాడదెన్.¹

అనే ప్రశ్న తెలుగు వారికి, ఔత్సాహులకి వస్తుంది. అందుకు సింగపూర్ నుంచి మా యొక్క చిరు జవాబు:

ఇందుగలదందు లేదని సందేహము వలదు. ఎందెందు వెతికిన అందందే తెలుగు తల్లి కలదు²

తెలుగు ప్రపంచ భాషా కాదా అన్న అంశం డైయాస్పోరా వేదికలలో విరివిగా వచ్చే ప్రశ్న. అందుకు సింగపూర్ నుంచి వస్తున్న జవాబు: తెలుగు ప్రపంచ భాషే కాదు, ఆధునిక సింగపూర్ నగరం స్థాపనతో ఆ ప్రపంచీకరణ అయినది సరిగ్గా 200 యేళ్ళ క్రితం. అప్పటి నుంచే తెలుగు వారు సింగపూర్లో నివసించడమే కాదు, ఉన్నత పదవులు చేపట్టి, సింగపూర్ దేశ చరిత్రలో చిరస్మరణీయులు అయ్యారు. వారు తెలుగు వారే అన్న విషయం చాలా మందికి తెలియదు.

అధినివేశ విషయక (బ్రిటీషు పాలిత) సింగపూర్ ని క్రీ.శ. 1819లో స్థాపించగా, క్రీ.శ. 1822 కల్లానే తెలుగు మాట్లాడే వారు. ఇది ఆ కాలం నాటి ప్రభుత్వ రికార్డులు, శిలాశాసనాలతో తెలుస్తోంది. 1950 ముందు భారతీయ ప్రముఖులు ఎందరో తెలుగు మాట్లాడేవారు. వారిని ఇప్పుడు దేశ వ్యవస్థాపకులుగా గౌరవిస్తున్నారు. సింగపూర్ జాతీయ గ్రంథాలయంలో (Singapore National Archives) భద్రపరిచిన రికార్డులు, మౌఖిక వృత్తాంతములు (oral histories) చెప్పుతున్నాయి. అలాగే, 1950లలో పోలీసులు తెలుగు మాట్లాడేవారు, ఉపాధ్యాయులు నేర్పే వారు. ఇందుకు ప్రభుత్వ రికార్డులు ఉన్నాయి. అందులో కొన్ని అంశాలను ఈ వ్యాసం విశ్లేషిస్తుంది.

సింగపూర్ స్థాపన: స్థాపించిన నూతన నగరమే సింహాసనం

బ్రిటీషు కాలం ముందు చరిత్ర

ఇప్పుడు సింగపూర్ చరిత్ర కాస్త తెలుసుకుందాం. 1299లలో పలెంబాంగ్ (ఇండోనేసియా) నుంచి వెలి వేయబడ్డ రాజవంశీయుడు మలయా ద్వీపకల్పం చివరి భాగంలోని దీవిలో తన రాజ్యాన్ని ఏర్పరచు కొన్నారు. స్థాపించిన కొత్త రాజ్యమే తన సింహాసనమని ఘోషించిన రాజు, దీవికి సింగపురమని సంస్కృత పేరు పెట్టారు³. కాలక్రమేణా ఆ రాజ్యం అంతరించి, ముందు మలాక సంస్థానంలోనూ, ఆ తరువాత జోహోర్ సంస్థానంలోనూ విలీనం అయ్యినది. ద్వీపం మధ్యలో పులులతో కూడిన కారడవులు ఉండగా, తీర ప్రాంతాలలో మత్స్యకారుల గ్రామాలు ఉండేవి. ద్వీపం యొక్క దక్షిణంలో వ్యాపారులకు ఓడరేవు ఉండేది.

1819 — బ్రిటీషు వారి నౌకాశ్రయం

1828లో బ్రిటిష్ వారి పురనిర్మాణ పటము, జేక్సన్ ప్లాన్. మూలం

1819లో జోహోర్ సుల్తాన్ ఒప్పందముతో ఆధునిక రేవుపట్టణాన్ని సింగపూర్ ద్వీపంలో బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపనీ వారు స్థాపించారు. సింగపూర్లో వాణిజ్య కేంద్రం ఏర్పరచవచ్చని పలువురు పేరొందిన వర్తకులను ఆహ్వానించారు. ఆ కోవకు చెందినవారిలోనే ఒకరు, నారాయణ పిళ్ళై — సింగపూర్లో అడుగుపెట్టిన ప్రప్రథమ భారతీయుడు. 1819లో నగర జనాభా 1000 మంది⁴ కాగా, జనవరి 1824లో మొదటి జనాభా లెక్కలలో ఆ జనాభా 10,683 మందికి పెరిగింది. అందులో 4,580 మలేయి, 3,317 చైనీస్ జాతీయులతో పాటు 756 మంది భారతీయులు కూడా ఉండేవారని పత్రికా రికార్డులు చెప్పుతున్నాయి⁵.

బ్రిటీషు వారి పురనిర్మాణ ప్రణాళికనే రేఫల్స్ టౌన్ ప్లాన్, లేదా జ్యాక్సన్ ప్లాన్ గా వ్యవహరిస్తారు⁶. ఆ నాటి పురనిర్మాణ సూచనల ప్రాయంగా కాబోయే నగరాన్ని వివిధ జాతులకు వేరు వేరు పేటలు ఏర్పరిచారు. కేంద్ర భాగాన్ని మాత్రం ప్రభుత్వ కార్యాలయాలకు విడిచారు. సింగపూర్ అంచులలో మత్స్యకారుల కుగ్రామాలు, ద్వీపం నుడి భాగంలో బ్రిటీషు వారి రేవుపట్టణం, ఆ రేవుపట్టణం మధ్యలో ప్రభుత్వ భవనాలకు చోటు అంతా పక్కనున్న మానచిత్రంలో చూడగలరు.

జ్యాక్సన్ ప్లాన్ ప్రతిపాదించిన నెల్లూరు వీధి

ఈ పటంలో చులియా స్ట్రీట్, (ఇప్పటికి అంతరించి పోయిన) సుంగేయి క్వాయియా నది మధ్య భాగాన్ని చులియా కాంపోంగ్ (కాంపోంగ్ అనగా గ్రామం) అని వ్యవహరించేవారు. చోళ రాజ్యం నుంచి వచ్చిన వారైన దక్షిణ భారతీయులను చులియా ప్రజలు అని ప్రాచీన మలేయిలో పిలిచేవారు⁷. అనగా, చులియా గ్రామం అంటే భారతీయుల పేట అని అర్థం. భారతీయుల పేట నడుమ నెల్లురు వీధి వ్యవస్థాపించాలన్నది ఆనాటి బ్రిటిషు పాలకుల ప్రతిపాదన. అయితే, కొద్ది కాలంలోనే జనభా విరివిగా పెరగడంతో జ్యాక్సన్ ప్లాన్ ని పూర్తిగా అమలు చేయలేకపోయారు. అందువల్ల “నెల్లురు వీధి” అన్న పేరుతో సింగపూర్లో ఎన్నడూ రోడ్డు లేదు. అయితే, బ్రిటిషు పాలకులే స్థాపించబడే నూతన నగరానికి తెలుగు నాట ఊళ్ళ పేర్లతో విధులు రూపొందించడం గమనార్హం.

గెట్టిసెట్టి గారి భూములు, జ్యాక్సన్ ప్లాన్ పటంలో

భారతీయుల పేటలో నెల్లూరు వీధి ప్రతిపాదించగా, అలనాటి బ్రిటీషు ప్రభుత్వ కార్యాలయాలు సింగపూరు నదికి అవతల కట్టారు. ఆ “civic district”లోని St Andrews Road, Hill Street సింగపూర్లో అతి పురాతనమైన వీధులు. ప్రభుత్వ కార్యాలయాలు, ప్రముఖ విక్రయ కేంద్రాలు ఇప్పటికీ ఉన్నాయి. ఆ వీధులను ఆనుకుని భూములను కురం గెట్టసెట్టి (“Kuram Gettachetty”) అనే వ్యక్తి 2 డిసెంబరు 1822లో కొన్నారని భూమి రికార్డులు చెప్పుతున్నాయి. ఆయనే సింగపూర్ లో ప్రప్రథమ తెలుగు వారని సింగపూర్ జాతీయ ఆర్ఖైవ్స్ దాఖలాలు చెప్పుతున్నాయి⁸.

1831 — వలసపాలకుల బహుత్వవాద సమాజం (“Colonial Plural Society”)

ఆ కాలంలో ఆగ్నేయ ఆసియాలో పలు దేశాలు వలసపాలకుల (colonial) పాలనలో ఉండేవి. ఆయా దేశలలో రెండు మూడు సమాజిక వర్గాలు కలవకుండా, పక్కపక్కనే నివశించేవారు కాబట్టి, ఆ దేశాలను “Plural Societies” (“బహుత్వవాద సమాజాలు”)గా జి. ఎస్. ఫుర్నివాల్ పేరు పెట్టారు⁹. వారు, భారతీయులు, మలేయి వారు, ఐరోపా జాతీయుల మధ్య ఎక్కువ కలియక లేకుండా పక్కపక్కనే వారి వారి జీవన శ్రవంతులను కొనసాగించేవారు కాబట్టి అలనాటి సింగపూర్ కూడా వలసపాలనలోని బహుత్వవాద సమాజంగా (“colonial plural society”) వర్గీకరించాలి.

1827 కల్లా చైనీస్ వర్తకుల, వాణిజ్య కేంద్రము నడుమ భారతీయ కోవెల వెల ఇదే: చైనీస్ జాతీయులకు కేటాయించిన పేట, అప్పటి కాంపోంగ్ చీనా (“చైనీయుల గ్రామం”) నడుమ, సౌత్ బ్రిడ్జ్ రోడ్డ్పై మారియమ్మ అని పిలవబడే దేవతకు గుడిని అప్పటి భారతీయులు కట్టారు. ఆ కొవెలయే సింగపూర్లో అతి పురాతనమైన గుడిగా, తద్వారా జాతీయ పురావస్తువు (“national monument”)గా ఇప్పడు గుర్తింపు వచ్చింది. 1831 లో ఈ కోవెల ప్రాంగణాన్ని పొడిగిస్తూ, ఆరు భాషలలో శిలాశాసనాన్ని గుడిలో అమర్చారు. ఇందులో ప్రస్తుతం సింగపూర్లో అధికారిక భాషలైన తమిళం, ఇంగ్లీషు, మలేయి, చైనీస్ లతో పాటు తెలుగు కూడా కనిపిస్తుంది. ఇదే సింగపూర్లో అతి పురాతన తెలుగు ఆకృతి, సింహాసనంపై వెలసిన తెలుగు శాసనం. ఇక్కడ ఒక విషయం గమనార్హం. తెలుగులోనే కాదు, చైనీస్ లో కూడా ఇది అతి పురాతనమైన అక్షరాలు కావచ్చు. ఎందుకంటే, సింగపూర్లో అతి పురాతనమైన చైనీస్ గుడి అయిన త్యేన్ హోక్ కెంగ్ గుడిలో ఇప్పటికి మిగిలిన కట్టడాలు క్రీ.శ. 1842లో కట్టారు కాబట్టి¹⁰ మారియమ్మన్ గుడిలో ఈ శిలాకృతులు చెక్కిన ఎనిమిది యేళ్ళ తరువాత.

మారియమ్మ కోవెలలో 1831 నాటి తెలుగు, తదితర భాషలలో శిలాశాసనం

అవతరించిన తెలుగు శాసనం

ఈ శిలపై కాస్త వ్యాకోచించగా, మనకు ఇంగ్లీషు, తమిళం అక్షరాలను మళ్ళీ దిద్దారని కనిపిస్తుంది. ఆంగ్ల వికీపీడియా కథనం ప్రకారం ఇంగ్లీషులో ఇలా వ్రాశారు:

The grant N:075 With its building transferred for charity sake to Cothunda Ramasamy by Sashasalapillay son of Cuddalore Amicarapoatrapillay Singapore March 1831¹¹

కాలక్రమేణా ఇతర భాషల ఆకృతుల స్పష్టత దురదృష్ట వసాత్తూ తగ్గింది. అయితే, కనిపిస్తున్న అక్షరాల ప్రకారం తెలుగు వచనం ఇలా ఉండవచ్చు:

ॐ [i] రామజయ శింగపూరు[ii] కోదండరామస్వామికి ॥గు॥ అ॥[iii] శెషాచల పిళాయి [iv] [??][v] ధర్మాధకంగా యిచ్చిన[vi] భవనము

ఇది ఎంతో ఆసక్తికరమైన చిరు వచనం, ప్రశ్నలు ఎన్నో. కొన్ని విషయాలు గమనార్హం:

i. ఓంకారనికి తెలుగు అక్షరం బదులు దేవనాగరి లిపి వాడారు

ii. “సింగపూరు” వర్ణక్రమము గమనార్హం

iii. ॥గు॥ అ॥ అంటే ఏమిటో తెలియదు, పాఠకులే సూచనలు ఇవ్వాలి

iv. ఆధునిక తెలుగులో “పిళ్ళై” అని మనము వ్రాస్తాము

v. “పిళాయి” పదం తరువాత అక్షరం స్పష్టంగా లేదు

vi. “యిచ్చిన” పదం తరువాత ఏమి వ్రాశారో తెలియట్లేదు

సింగపురియన్స్ ముందే సింగపూరు వాసులు

మరి ఈ వచనం యొక్క విశ్లేషణ ఇంకా ఆసక్తికరం. ఖచ్చితంగా ఇంగ్లీషు వచనం మొదటిది కాదు, తమిళంలోనో, తెలుగులోనో వ్రాసి ఇంగ్లీషులోకి తర్జుమా చేయబడినది. ఎందుకనగా, “transferred for charity’s sake” అన్న నుడికారం ఇంగ్లీషులో ఎక్కువ వాడరు. అయితే, , “ధర్మాధకంగా ఇచ్చిన” అన్న నుడికారం భారతీయ భాషలలో వాడుకలో ఉండనే ఉన్నది.

అదే విధంగా, ఇంగ్లీషు వచనానికి, తెలుగు వచనానికి మధ్య తేడా గమనార్హం. కాదలూరు అమిచరపుత్ర పిళై (“Cuddalore Amicarapoatrapillay”) మాట తెలుగులోనే లేదు! అలాగే, కోదండరామస్వామి గారిని “శింగపూరు కోదండరామస్వామి” అని తెలుగులో వచనీకరించారు (సింగపూర్ వర్ణక్రమములో శకారం వాడుక ఇప్పటికే గమనించాము). ఈ భూదానం సింగపూరులో జరిగిందని వ్రాశారా, లేక కోదండరామస్వామి గారు సింగపూరు వాసులని వ్రాశారా? ఎందుకంటే, ఖచ్చితంగా అమిచరపుత్ర పిళ్ళై గారు కాదలోరు వాసులే.

సింగపూర్ పౌరులు సింగపురియన్ (“Singaporean”) అనే పిలుపు 1930ల వరకూ ఇంగ్లీషులో రాలేదు.. జూన్ 1919లో యురేసియన్ జాతీయులు తమ సంఘం ఏర్పరచ బోయి, యురేసియన్ (“Eurasian”) అనే పదం బదులు సింగపూరియన్ అనే పదం వాడవలెనని తమలో తాము చర్చించుకున్నారు. సింగపురియన్ అనే పదం యొక్క వాడుక, అపహాస్య యుక్తమైనది, నిష్ఫలమైనదని ప్రముఖ ఆంగ్ల దినపత్రిక, స్ట్రేట్స్ టైమ్స్, అప్పట్లో వ్యాఖ్యానించింది¹². సింగపూర్లో నివసించేవారు సింగపూరు వాసులు/ పౌరులు అన్న భావన ఇంగ్లీషు ముందు తెలుగులో కనిపిస్తోందా?

లిటిల్ ఇండియా ప్రాంతములో వీరస్వామి రోడ్డు

ఆ తరువాత సింగపూర్లో తెలుగు వారి చరిత్ర ఎంతో సుదీర్ఘమైనది. ప్రముఖ డాక్టర్లు, వ్యాపారవేత్తలు, లాయర్లు, సమాజ ప్రముఖలుగా ఎంతో మంది ఫలితాలను సాధించారు. ఉదాహరణకు, సింగపూర్లో ప్రప్రథమ భారతీయ వైద్యులు, వీరస్వామి నాయుడు గారు (1865–1926). ఆయన తెలుగు వారే. 40 యేళ్ళు ప్రస్తుతం లిటిల్ ఇండియా ప్రాంతంలో వైద్యం చేశాక, మున్సిపల్ కమీష్నరుగా, న్యాయాధిపతిగా (“Justice of Peace”) నియమించబడ్డారు. భారతీయ సమాజం ప్రముఖులుగా 1914లో దీపావళి అధికారిక సెలవుగా ప్రకటించడానికి దోహదం చేశారు. అప్పటి ఆయన వైద్య శిబిరం దగ్గరి రోడ్డుని ఇప్పటికీ వీరస్వామి రోడ్డు అని పిలుస్తారు.

కోవన్ ప్రాంతములో వీరగూ క్లోస్

ఇంకొన్ని ఉదాహరణలు: ప్రఖ్యాత వ్యాపారవేత్త, గూనా వీరగు నాయుడు గారి పేరుతో ప్రస్తుతం కోవన్ ప్రాంతంలో రోడ్డు ఉన్నది. అలాగే, గోవిందసామి చెట్టియార్ గారు: సింగపూర్ నౌకాశ్రయం స్థాపన, నిర్వహణలో ఎంతో దోహదం చేసి, న్యాయాధిపతిగా (“Justice of Peace”) పదవీ బాధ్యతలను నెరవేర్చారు. వారి కుమార్తె కోమలవల్లి గారు, సింగపూర్ తెలుగు సమాజం మాజీ అధ్యక్షులు. కోమలవల్లిగారి భర్త, ఎస్. ఎల్. పెరుమాళ్ గారు ప్రముఖ వ్యాపారవేత్త. సింగపూర్‌లోని ప్రఖ్యాత గుళ్ల వ్యవస్థాపన, నియంత్రణకు ఎంతో కృషి చేశారు. సింగపూర్ తెలుగు సమాజం మాజీ అధ్యక్షులుగా కూడా బాధ్యతలు నెరవేర్చారు. చివరి ఉదాహరణగా, ఎన్. ఎస్. సౌందరరాజన్ గారు: సింగపూర్ పార్లమెంటులో ప్రప్రథమ తమిళ్ అనువాదకులు, సింగపూర్ సీ.ఏ.డీలో స్పెషల్ ఆఫీసరు బాధ్యతలను నెరవేర్చారు. సింగపూర్ తెలుగు సమాజాన్ని వ్యవస్థాపించారు, సింగపూర్ జాతీయ ఆర్ఖైవ్స్ కి ఎన్నో విషయాలను సమకూర్చారు¹². ఆయన కృషి వల్లనే సింగపూర్లో తెలుగు వారి చరిత్ర చెప్పగలుగుతున్నాము.

1951లో పోలీసులు ఇంగ్లీషు, చైనీస్, మలైలతో పాటు, ఫ్రెంచి, డచ్, హిందుస్తానీ, పంజాబీ, తమిళ్, తెలుగు, జేపనీస్, సీయమీస్, జావనీస్, బర్మీస్ లలో ఏ ఒక్క భాషలో అయినా మాట్లాడగలిగి ఉండాలని నియమం ఉండేది¹³. అలాగే, 1950లలో, 1960లలో తెలుగు ఉపాధ్యాయుల నియామకం అయ్యేది. అందుకు పరీక్షలు కూడా జరిపేవారు¹⁴.

1960ల తరువాత తెలుగు వాడుక క్రమేణా తగ్గుతూ వచ్చింది. 1980లలో కల్లా 5000 మంది తెలుగు వాళ్ళు ఉండే వాళ్ళు. అప్పట్లో, కళాత్మక సంబంధాలు మినహా రాకపోకలు తగ్గడంతో తెలుగు వాడుక తగ్గుతూ వచ్చింది.. ఆ తరువాత, 1990ల నుంచి తెలుగు ప్రాంతాల నుంచి వలస వాసులు పెరుగుతూ వచ్చారు.

సమాప్తి

ఆధునిక సింగపూర్ స్థాపనతోనే తెలుగు విరివిగా మాట్లాడటం, క్రీ.శ.1819లో నవ్య నగర, ఆ క్రీ.శ.1965 తరువాత, నవ్య దేశ నిర్మాణంలోనూ ఎనలేని కృషి చేసి, ఫలితాలను సాధించారు. క్రీ.శ.1830లలో వాడుకలో ఉన్న మిగతా భాషలతో కూడి తెలుగుని కూడా ప్రచార మాధ్యమాలలో వాడేవారు. 1950ల వరకూ తెలుగు భాష తెలియడం ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలను మెరుగు పరిచేది. తెలుగు ప్రపంచీకరణ నేడు కాదు, రెండు వందల యేళ్ళ క్రిందటే జరిగిందని మనకు స్పష్టంగా తెలుస్తోంది. అందుకే, చైనాటౌన్ నడుమ అతి పురాతనమైన మారియమ్మన్ కోవెలలో వెలసినది ఇద్దరు దేవతలు: మహమ్మారి నుంచి కాపాడే మరియమ్మ, ఆవిడ ఎదురుగా సజీవ దేవతా మూర్తి అయిన తెలుగు తల్లి.

గ్రంథ పట్టిక (Bibliography)

  1. పోతన భాగవతం, 7వ స్కంధం, 8వ ఘట్టం, పద్యం 7–272 స్ఫూర్తితో. పోతనవారి మూల పద్యం ఇక్కడ తిలకించగలరు: http://telugubhagavatam.org/?tebha&Skanda=7&Ghatta=8
  2. పోతన భాగవతం, 7వ స్కంధం, 8వ ఘట్టం, పద్యం 7–275 స్ఫూర్తితో. పోతనవారి మూల పద్యం ఇక్కడ తిలకించగలరు: http://telugubhagavatam.org/?tebha&Skanda=7&Ghatta=8
  3. John N. Miksic (15 November 2013) Singapore and the Silk Road of the Sea, 1300–1800. NUS Press. pp. 155–156. ISBN 978–9971695743.
  4. Lily Zubaidah Rahim, Lily Zubaidah Rahim (9 November 2010). Singapore in the Malay World: Building and Breaching Regional Bridges. Taylor & Francis. p. 24. ISBN 9781134013975.
  5. Bernard, F. J. (15 November 1884). “An Anecdotal History of Old Times in Singapore”. The Straits Times. Archived from the original on 30 January 2018. Retrieved 22 November 2020
  6. “Plan of the town of Singapore” and “Plan of the British settlement of Singapore” published 1828 in “Journal of an embassy from the Governor-General of India to the courts of Siam and Cochin-China” by John Crawfurd. Archived from the original on 31 August 2014. Retrieved 22 November 2020.
  7. John N. Miksic (2013). Singapore and the Silk Road of the Sea, 1300–1800. NUS Press. p. 147. ISBN 978–9971–69–574–3.
  8. RAJAN, Soundara, Communities of Singapore (Part 2), Accession Number 000845/23, Reel 3, Singapore National Archives
  9. [Plural societies] “compris[e] two or more elements or social orders which live side by side, yet without mingling, in one political unit.”. Furnivall, J. S. Netherlands India. Cambridge: The University Press, 1939, p. 446
  10. Jane Beamish; Jane Ferguson (1 December 1985). A History of Singapore Architecture: The Making of a City. Graham Brash (Pte.) Ltd. pp. 53–55. ISBN 978–9971947972.
  11. “Sri Mariamman Temple, Singapore,” Wikipedia, last modified November 30, 2020, https://en.wikipedia.org/wiki/Sri_Mariamman_Temple,_Singapore
  12. “A Sign of Progress”, Straits Times, 9 June 1919, Page 8. http://eresources.nlb.gov.sg/newspapers/Digitised/Article/straitstimes19190609-1.2.22. మూల వ్యాఖ్య:
  13. “That meeting spent a goodly part of its time in discussing whether or not another term than Eurasian should be adopted — Singaporean, for example. If the If the new association wishes to bring ridicule upon itself it has only to go to work in this way. Anything so futile as the suggestion to adopt the name Singaporean […] can hardly be conceived”.
  14. RAJAN, Soundara. Communities of Singapore (Part 2), Accession Number 000845. https://www.nas.gov.sg/archivesonline/oral_history_interviews/interview/000845
  15. Bonus Examinations in Chinese for Police Constables. Singapore National Archives. Microfilm number: SCA 0006 https://www.nas.gov.sg/archivesonline/government_records/record-details/94663f57-9c43-11e9-9972-001a4a5ba61b
  16. PREPARATORY EXAMINATION FOR TAMIL/TELUGU TEACHERS 1959. Singapore National Archives. Microfilm number: ME 3680 https://www.nas.gov.sg/archivesonline/government_records/record-details/990c75c7-1159-11e3-83d5-0050568939ad

7వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సులో ఇచ్చిన ప్రసంగం.

--

--

Responses (1)