ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జీవిత భీమా శాఖ జాలగూడునుండి సమాచారాన్ని దొంగిలించడం ఎలా?
ఈరోజు నాకన్ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జీవిత భీమా శాఖ జాలగూడుపై, అందునా భీమా సంఖ్య ద్వారా వెతుకు పేజీపై పడింది. రాష్ట్ర ప్రజల సమాచారం ఎన్ని రకాలుగా బయటకు పోగలదో తెలియచేయడం నా ఉద్దేశం, అంతే కానీ ఇలా సమాచారాన్ని దొంగిలించమని కాదని నా మనవి.
ఈ పేజీ ద్వారా సమాచారాన్ని పొందాలంటే భీమాదారుని పేరులో కొంతభాగం, వారి తండ్రి పేరులో కొంతభాగం ఊహించాలి. (తండ్రి పేరే ఎందుకు వాడారో తెలియదు). ఆ తరువాత పుట్టినతేదీగా ఏదో ఒక తేదీ ఇచ్చి ప్రయత్నించాలి. అది ఏమీ చూపించకపోతే తేదీని, పేర్లను మార్చి ప్రయత్నించాలి. నేను ఎలా ప్రయత్నించానో చూడండి.
మొదట భీమాదారుని పేరు “కుమార్”తో, వారి తండ్రి పేరు “కుమార్”తో ప్రయత్నించాను. ఏదో ఒక తేదీని ఎంచుకున్నాను. ఆ తేదీలో ఏమీ రాకపోతే తేదీని మార్చుకుంటూ పోయాను. ఒక తేదీలో ఒకరిని చూపించింది.
అది చూపించిన భీమా సంఖ్య ద్వారా “భీమా వివరాలు” పేజీకి వెళ్లి ఆ వివరాలు తెలుసుకున్నాను.
తరువాత భీమాదారుని పేరు “రాజు”తో, వారి తండ్రి పేరు “రాజు”తో ప్రయత్నించాను. ఇద్దరిని చూపించింది.
ఇంతకుముందులానే అది చూపించిన భీమా సంఖ్య ద్వారా “భీమా వివరాలు” పేజీకి వెళ్లి వివరాలు తెలుసుకున్నాను.
“Loan Details” లంకె ద్వారా ఆ వ్యక్తియొక్క సంబంధిత అప్పుల వివరాలు తెలుసుకున్నాను.
ఈసారి భీమాదారుని పేరు “a”తో, వారి తండ్రి పేరు “a”తో ప్రయత్నించాను. పలువురిని చూపించింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జాలగూడులు అవసరానికి మించి రాష్ట్ర పౌరుల సమాచారాన్ని బయటపెడుతున్న ఈ తరుణంలో మనకు ఒకరి గురించి పూర్తి సమాచారం కావాలంటే మనం చేయాల్సిందల్లా ఆ వ్యక్తి గురించి కొంచెం తెలుసుకుంటే మిగతాది ప్రభుత్వమే వారు తయారుచేయించిన జాలగూడులద్వారా మనకు బహిర్గతపరుస్తుందన్నమాట.
రూపుదిద్దుకుంటున్న భారత గోప్యతా చట్టం ముందు ఇలాంటివి నిలబడవని, ప్రభుత్వం వద్ద ఉన్న పౌరుల సమాచారం యొక్క భద్రత, గోప్యత కూడా ప్రభుత్వ బాధ్యతయే అని సాంకేతికత గురించి గొప్పలు పోయే మన ప్రభుత్వాలు తెలుసుకుంటాయని ఆశిద్దాం.