ChangingSociety

మెదడు — మనస్సు, అనుభవాలు — అనుభూతులు, సత్యం — నమ్మకం.

మెదడు-మనస్సు , అనుభవాలు-అనుభూతులు

అనుభవాల సారమే ‘మెదడు’ అందించే ‘బుద్ధి’ , అనుభూతుల సారమే ‘మనసు’ అందించే ‘స్పందన’. మనిషి కాలక్రమంలో తెలుసుకొన్నదాన్ని తన విచక్షణ కొద్దీ అన్వయించుకొంటూ ముందుకు సాగటమే జీవితం. అందులో అనుభవాలు , అనుభూతుల పాత్ర. చాలా ముఖ్యం. ఇక్కడ అనుభవం , అనుభూతి అనే పదాలకు అర్ధం సూక్ష్మంగా చెప్పాలంటే, మల్లెను చూసినా, మనవడిని చూసినా కలిగేది అనుభూతి అయితే మోసపోవటం, చేయి కాలటం అనేది అనుభవం. భౌతిక అవసరాలకు తోడు మానసిక అనందం పొందగలిగిప్పుడే మనిషికి ప్రశాంతత లభిస్తంది. ఇక మనసు, అనుభూతి అనే పదాల సృష్టే హేతువాదానికి విరుద్ధమైతే శాస్త్ర సాంకేతిక ఆవిష్కారాలతోనే మన భాషను , సాహిత్యాన్ని, సంస్కృతిని పునర్నిర్మించుకోవలసి ఉంటుంది.

మెదడు పనిచేసే తీరులో వెయ్యో వంతు కూడా ఇంకా అర్ధం చేసుకోని నేటి శాస్త్ర పరిజ్ఞానం భవిష్యత్ లో మరింత అభివృద్ధి చెంది. దాన్ని పరిశీలించి, విశ్లేషించగలిగి ఆ పనితీరుల మధ్య ఉండే శక్తి , అంతరాలను కాచి వడపోసినపుడు అనుభవాలని, అనుభూతులను, మెదడును, మనసును విడి విడి పదాలుగా గుర్తించవచ్చేమో. అలాగే కొన్ని మెదడులు మాత్రం అసాధారణం గా పనిచేయగలవని తెలుసుకొంటే ఆ రోజున వాటిని ‘అతీంద్రియ’ శక్తి గల మెదడు (మనిషి) గా గుర్తించవచ్చేమో. దీని ఉద్దేశం బాబాలను, మోసగాళ్ళను , మంత్రగాళ్ళను సమర్ధించమని కాదు. సైన్స్ కి అందనిది ఎంతో ఉంది, మరి భవిష్యత్ లో ఆధునిక శాస్త్రాలు పురోగతి చెందినపుడు ఇప్ఫుడు చేస్తున్న వాదనలకు చోటెక్కడ?

. సత్యం, నమ్మకం

ఇకపోతే సత్యం, నమ్మకం. సత్యం అనేది నిత్యం కాదు. మనం చూస్తున్న సూర్య, చంద్రులు కూడా ఆది, అంతం కలవారే అని సైన్స్ నిరూపించింది. పైన చెప్పినట్లు, అది మనం తీసుకునే కాలప్రమాణం బట్టి ఆ కాల వ్యవధిలో స్థిరంగా, కాలపరిణామంలో కొద్ది తేడాలతో గానీ పూర్తిగా కానీ మారుతూ ఉంటుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే, నమ్మకం అనేది అనుభవాల పాఠశాలలో పెద్దలు చెప్పింది. ఏ మనిషీ తన అన్ని ప్రశ్నలకు సమాధానాలను స్వంత అనుభవాల ద్వారా తెలుసుకోలేడు. అందువల్ల విద్య ద్వారా, విషయపరిజ్ఞానం గల వారి సాంగత్యం ద్వారా సమాధానాలు తెలుసుకొని తన తార్కిక చింతనతో కొన్నింటిని మాత్రమే నమ్మకాలుగా ఏర్పరుచుకొంటాడు. అందువల్ల, నమ్మకం అనేది మనిషి శోధించి, సాధించిన విజ్ఞాన, సాంకేతికల ఆధారంగా అయి ఉండవచ్చు లేదా ఆటవిక న్యాయం నుండీ నాగరికతను అలవర్చుకొని. ఏర్పాటు చేసుకున్న కట్టుబాట్లు నుండీ ఏర్పడింది కావచ్చు. సత్యం కంటే నమ్మకం అనేది సమాజం పై ఎక్కువ ప్రభావాన్ని చూపుతుంది

ఈ నమ్మకాలలో తిధి, నక్షత్రాలు, పంచాంగం మొదటి తరగతికి చెందినవి. అవి ఏదో గాలిలో, ఉబుసుపోకకి రాసుకున్న శాస్త్రాలు కావు. అప్పటిరోజుల్లో అందుబాటులో ఉన్న పరికరాలు, శాస్త్ర, సాంకేతికతల ఆధారంగా రూపొందించినవే. అయితే కాలక్రమంలో వాటిని అనేకులు అనేక విధాలుగా అన్వయించటంలో తేడా వచ్చి ఉండవచ్చు. ఆధునిక విజ్ఞానం పెరిగిన తర్వాత వర్తమానకాలంలో వాటి అవసరం లేకపోవచ్చు. వాటిపై నమ్మకం తగ్గటంలో తప్పులేదు. ఇలాంటి పాక్షిక సత్యాలతో ఈ రోజుల్లో కూడా ప్రజల బలహీనతలతో ఆడుకొనేవారి చర్యలను ఖండించటం తప్పు కాదు. కాకపోతే, ఈ సంప్రదాయాలను ఖండించటం కోసం దుర్ముహూర్తంలో కావాలని ఒక పని మొదలు పెట్టాను, మంత్రాలు లేకుండా పెళ్ళి చేసుకొన్నాను, అన్నీ సవ్యంగా ఉన్నాయి అనటమే వింత వాదన.

పెళ్ళి , కుటుంబం, సామాజిక వ్యవస్థ అనేవి రెండో తరగతికి చెందినవి. సమాజంలో కాలానికి సరిపోని మూఢాచారాలు, దురాచారాలను ఖండించటంలో కందుకూరి, రాజా రామమోహన రాయ్ వంటి వారితో మొదలు పెట్టి నేటి వరకు ఎందరో ఆదర్శంగా ఉన్నారు. అది అభిలషణీయం కూడా. ఐతే ఇప్పుడు 21వ శతాబ్దంలో నాగరితకత, వ్యక్తి స్వేచ్ఛల పేరిట. కీలకమైన సామాజిక, వివాహవ్యవస్థల పై దాడి జరుగుతోంది. మరి దీన్ని ఆధునికవాదులు ఖండిస్తారో లేక పెళ్ళి, కుటుంబ వ్యవస్థ అనే వాటిని పురాతన సంప్రదాయాల గాటన కట్టి. కొత్త పోకడలను సమర్థిస్తారో వేచిచూడాల్సి ఉంది.

సమాజానికి, వ్యక్తి పురోగతికి ఆటంకం కలగనంత వరకు, మానసిక తృప్తిని, స్థైర్యాన్ని ఇస్తున్న నమ్మకాన్ని వీడి మరో వాదాన్ని అందిపుచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఆధునిక ప్రజాస్వామ్యాలలో మనుగడ సాగిస్తున్న మనని పూర్వ కాలంలోలాగా ఎవరూ నియంత్రించటం లేదు. సాంకేతికత ప్రతి ముంగిటా తలుపు కొడుతున్న వేళ విజ్ఞానం అనేది ఏ కొందరికో పరిమితం కాలేదు. అందువల్ల అభివృద్ది చెందిన సమాజంలో ఉన్న వారి నమ్మకాలని మార్చాలి అనుకోవటం కంటే సమాచార సాంకేతికతలు అందుబాటులో లేని చోట్ల, మూఢాచారాలతో సమాజం కునారిల్లుతున్న చోట్ల సమయాన్ని వెచ్చించితే ఆ ప్రయత్నం సద్వినియోగం అవుతుంది.