తెలుగు భాష వెలుగులు జిలుగుల బ్లాగులో

Monday, April 18, 2016

స-బే శాండ్ విచ్‌లు (ఇసుక మోహినులు )

పని లేని బుర్రలూ- దయ్యాల కార్ఖానాలూ

#####################

సబ్ వే స్టేషన్

  • మధ్యలో పదార్థం నింపిన రెండు ముక్కలు

చూశారా! సబ్ వే ఇసుక మోహినిని. (శాండ్ విచ్). రెండు రొట్టె (అదేనండీ బ్రెడ్డు ముక్కలు) ముక్కల మధ్య రక రకాల పదార్ధాలు నింపి మనకిస్తే దాన్ని కొరుక్కుని తినడం మన పని. చూశారా ఆ రొట్టె ముక్కలు ఎంత పెద్దవిగా ఉన్నాయో. మరి వాటి మధ్య పదార్ధాల పరిస్థితి ఊహించండి. దాన్లో పుర చేతి వాటం గాళ్ళకి (లెఫ్టి స్టులకి) అత్యంత ప్రీతి పాత్రమైన ఆవు మాంసం కూడా పెడతారండోయ్!. మనం సబ్ వేకి వెళ్ళి మనకి ఫలానా లాంటి రొట్టె ముక్కలో ఫలానా పదార్ధాలను పెట్టి శాండ్ విచ్ చెయ్యమంటే వాడేదో పెట్టి, ఏదో ద్రవాలు పోసి, పళ్ళెంలో పెట్టి ఇస్తాడన్న మాట.

అసలు విషయం అది కాదు. ఆ రెండు పెద్ద రొట్టె ముక్కలూనూ ధనవంతులైతే ఆ మధ్య ఉన్న పదార్ధాలు పేద వాళ్ళు. “నీ ఆసా, అడియాసా, చెయి జారే మణి పూస, బతుకంతా అమవాసా, లంబడోళ్ళ రాందాసా” అని శాండ్ విచ్అయిన, అవుతున్న, అవబోయే పేద వాళ్ళు ఘోషిస్తూనే ఉన్నారు. పంటి బిగువుతో కాలం గడుపుతునే ఉన్నారు. డబ్బున్న వాళ్ళు పంటి బలమంతా ఉపయోగించి కొరుక్కు తింటూనే ఉన్నారు, పేద శాండ్ విచ్‌లని.

ఈ సబ్ వేలు ప్రపంచ మంతా ఉన్నాయి. ఈ మధ్యనే మన దేశం కూడా వచ్చాయనుకుంటా. అయినా మన దేశంలో సబ్ వేలు లేకపోతే కదా? మీరు (దౌర్) భాగ్యనగరంలో ఎన్నొ యేండ్లనుంచీ ఉండి ఉంటే మీకు రెండు సబ్ వేలు ఉండీ ఉండనట్టు ఉన్నట్టు తెలుస్తుంది. ఒకటి చార్మీనార్ చౌరస్తా ఉరఫ్ ఆర్ టీ సీ క్రాస్ రోడ్స్ అనే ప్రాంతంలో ఉంటుంది.

(ఇక్కడో చిన్న పిట్ట కధ చెప్తాను. అసలు ఈ నాలుగు రోడ్ల కూడలికి ఈ పేరు ఎందుకొచ్చిందో తెలుసా. అరె బై! చార్మీనారు గాడేడో పాత బస్తీల ఉంది కదా గీడ చౌరాస్తాకి గీ పేరు పెట్టిండ్రేందా అని శాన సమ్మత్సరాలు పరేషాన్ అయ్యెటోడ్ని. గప్పుడో దినం చార్మీనారు సిగరెట్టు తాగుదమని ముచ్చటేసి తాగుతుంటే గప్పుడు తట్టింది. అరె! చార్మీనారు కార్ఖానా గీడ్నే ఉంది కదా (వి ఎస్ టి) గందుకని గీ పేరు పెట్టిన్రు అని. మనమసలే సెకులరు కదా. పాత బస్తిల ఉంటే, కొత్త బస్తిల ఉండాల్నా అద్దా? చెప్పున్రి. గట్లనే రోడ్డు రవాణా (రావణ) సంస్థ కార్యాలయాలున్నై. గందుకే అర్ టీ సీ క్రాస్ రోడ్డు అని పేరు.)

అసలు కధలో కొస్తే ఇక్కడ ఒక సబ్ వే ఉంది, మీరెప్పుడైనా చూశారా? నేను చూశాను. ఒక్కసారి ఈ సబ్ వేలో రోడ్డు ఇటు నుంచి అటు క్రాస్ కూడా చేశాను. శాండ్ విచ్ అంటే ఆ రోజే తెలిసింది. సగం దూరం వచ్చాక భయమేసింది. చిమ్మ చీకటి. (ఆ ఫొటోలో చూశారా ఎలా వెలిగి పోతోందో, అది అమెరికా). ఇద్దరు, ముగ్గురు తాగు బోతు వాళ్ళు, అడుక్కు తినే వాళ్ళు. ఇంతకీ ఎంత దూరమో తెలుసా. సంధ్యా టాకీసు మూల నుంచి ఇటు వైపో ఇరానీ కఫె ఉండేది అక్కడకి. అది కట్టడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందో గుర్తు లేదు కాని, రెండేళ్ళల్లో మూసేశారు, ప్రాణాలకే ప్రమాదంగా మారిందని తెలిశాక.

ఇంకోటి కోటీలో ఉండేది. ఇది పూర్తయ్యిందని నాకు తెలీదు. మధ్యలోనే ఆపేశారేమో. ఇప్పుడక్కడ పాత పుస్తకాల దుకాణాలకి ఇచ్చారు. ఇదెందుకు చెప్పాల్సొచ్చిందంటే, మన వాళ్ళు పన్ను సొమ్ముని శాండ్ విచ్ చేసి ఎలా తింటారో ఉదాహరణకి.

అసలు నాకో అనుమానం. సబ్ వే శాండ్ విచ్ పెట్టిన వ్యక్తి భాగ్యనగరం వచ్చి చార్మీనారు చౌరాస్తాలో సబ్ వే దాటాలని ప్రయత్నించి ఉంటాడు. నాలానే మధ్యలో కొచ్చాక ఆంగ్లంలో “అయ్యో! శాండ్ విచ్ ఐ పొయ్యానే సబ్ వేలో” అనుకుని ఉంటాడు అంతే ఆ ఆలోచన అతని అదృష్టాన్ని మార్చేసింది. మరి ఈ ఆలోచన నాకెందుకు రాలేదో. వస్తే అతని కధ బ్లాగు వ్రాయ గలిగి ఉండే వాణ్ణి కాదు కదా. రాని ఆలోచన నా అదృష్టాన్ని మార్చలేదు.

######################################

ఇదేమిటి? మనం స బే శాండ్ విచ్‌ల గురించి మాట్లాడుకుంటూ సబ్ వేలో ఇరుక్కు పోయినట్టున్నామే! ఏమైనా ఆత్రేయ గారు అదృష్టవంతులండీ! లేపొతే, ఇప్పుడు

“సరి కారులో షికారుకెళ్ళే…”అనిన్నూ, “బేసి కారులో షికారుకెళ్ళే’’’”” అనిన్నూ రెండు పాటలు వ్రాయవలసి వచ్చేది.

ఇప్పుడు స బే తెలిసుంటుంది కదా! ఈ శాండ్ విచ్‌లు యేమిటండీ మధ్యలో?

చలువ రాతి మేడ లోన కులుకుతావే కుర్ర దానా

మేడ కట్టిన చలువ రాయి యెలా వచ్చెనో చెప్పగలవా

పరుగు తీసే పట్న వాసులు మెట్రొ రైలులో మగ్గి పోతే

వారి వంటీ చెమట చలువతోటీ తీర్చినారూ తెలుసుకో!

అర్ధమయింది కదండీ సరి-బేసి అని బోసి బుర్ర (బుర్రలో యేమీ లేని వాడని తెలుసుకోవాలి) వాడొకడు కొన్న కార్లను, ఉన్న కార్లను బయటికి తీయకుండా చేసి పై పెచ్చు, “కాలుష్యం తగ్గ లేదు గాని, కావల్సినంత ప్రచారం వచ్చింది” అని కులుకుతుంటే రైళ్ళల్లో ఐదు వేల మంది ఎక్కాల్సింది పది వేల మంది ఎక్కి, ఆటో కోసం నలభై రెండు డిగ్రీల మండుటెండలో మాడి పోయీ, ఆటోల వాళ్ళు వందకి రెండు వందలు కలిపి వాయిస్తుంటే అయ్యగారు, “అగ్రహారం పోతే పోయింది, యాక్టంతా తెలిసింది” అని కులికినట్టు, కాలుష్యం తగ్గలేదు కాని రోడ్లు ఖాళీగా ఉన్నాయి అని ట్వీట్ల మీద ట్వీట్లు ,”తోట గల వాడికీ, తీటగలవాడికీ, ట్వీట్లు చేసే వాడికీ” తీరికే లేదన్నట్లు చేస్తూ ఉంటే, అర్ధమయ్యింది కదండీ “ఇసుక మోహినులు” (అదేనండీ శాండ్ విచ్‌లు) ఎవరో. ఇంకెవరండీ, లక్షలు పెట్టి కార్లు కొనుక్కొని, వేలల్లో రవాణా పన్ను కట్టే నిర్భాగ్య ఢిల్లీ వాసులు.

పోనీ అదయినా పూర్తిగా చేశాడా. లేదు మళ్ళీ సరి పక్షంలో నడపండి, బేసి పక్షంలో నడపొద్దు అని ఇంకో తిరకాసు. అందుకే పని లేని బుర్ర, దయ్యాల కార్ఖానా అన్నారు. యీయనగారు నాకు ఏ శాఖా అక్కరలేదు అన్నప్పుడే డిల్లీ వాసులు ఇలాంటి ప్రమాదాన్ని ఊహించి ఉండాల్సింది. ఎంత తెలివి కల వాళ్ళ కైనా కష్టాలు తప్పవని గురజాడ అప్పారావు గారు కన్యాశుల్కంలో కరటక శాస్త్రి గారి నోటి ద్వార చెప్పిస్తారు, ప్రమాదా ధీమతి (అనుకుంటా). వచ్చిన పెను ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి ఎత్తుకు పై ఎత్తు వెయ్యాలని పంచతంత్రంలో కరటకుడో, దమనకుడో చెప్తారండీ.

అందుకే నాకో శ్రేష్టమైన ఆలోచన వచ్చింది. సరి సంఖ్య కార్లున్న వాళ్ళు సరి సంవత్సరంలోనూ, బేసి సంఖ్య కార్లున్న వాళ్ళు బేసి సంవత్సరంలోనూ మాత్రమే ఆఫీసులకొస్తామని జంతర్ మంతర్లో ధర్నా చెయ్యాలి. దీంతో సదరు నక్క వినయాల నాయకుడి రాజ్యంలో ఉన్న పని చేసే వాళ్ళంతా పని మానేస్తారు.

సఫాయి కార్మికులకు కార్లుండవు కాని వారికి జీతాలివ్వ వలసిన వాళ్ళకుంటాయి కదా. వాళ్ళు ఆఫీసులకు రాక పోతే జీతాలెవరిస్తారు. అందు చేత వాళ్ళు కూడా ధర్నా చేస్తారు. చెత్త పేరుకు పోతుంది. కాలుష్యం పెరుగుతుంది. చెత్త రోడ్ల పక్క పేరుకు పోవడంతో రోడ్ల నిడివి తగ్గుతుంది. ఉన్న కాసిని కార్లు వెళ్ళడానికి చోటుండదు. మళ్ళీ పురాణం మొదటికొస్తుంది. ఆలోచన లేకుండా కేవలం ప్రచారం కోసమే యేదో చేస్తున్నట్టుగా కనపడుతూ, విడుదలైన ప్రతి సినిమా చూస్తూ వాటికి వ్యాఖ్యానాలు వ్రాస్తూ నాలుగు వందల శాతం జీతాలు పెంచుకొని దేశం మీద పడి దోచుకొనే దౌర్భాగ్యులకి ఇలాటి శాస్తే సమమండీ. కాదంటారా?

ఇప్పటికే చాలా మందిని సదరు స బే కార్యక్రమం నుంచి మినహాయించారు. ఇప్పుడు కొత్తగా అడ్వొకేట్లు మాకూ మినహాయింపు ఇవ్వాలి అని కోర్టు కెక్కారు. (రోజూ ఎక్కుతూనే ఉంటారు కాని ఇది వేరేగా ఎక్కడం). వీరి విషయం చూడాల్సిందే. ఆటో వాళ్ళతో వాదించీ, లేదా మెట్రోలో కాలో వేలో తొక్కిన వాడితో, లేదా కాలరు చింపిన వాడితో వాదించీ, జీవిత మంతా శీతల యంత్రాల చల్లదనంతో గడిపి శీతల యంత్రాలున్న కార్లల్లో వెళ్ళే వీళ్ళు చెమటలు కక్కుకుంటూ, అందరితోనూ వాదించుకుంటూ వెళ్ళి ఇంకేం వాదిస్తారు చెప్పండి కోర్టుల్లో. ఎలాగైనా వీరికి మినహాయింపు ఇవ్వ వలసిందే. అత్యవసర సర్వీసుల్లో చేర్చి. ఇప్పటికే కేసులు పేరుకు పోయాయి. అత్యవసరంగా వీరికి కొంత ఉపశమనం కల్పించాల్సిందే.

ఇక పోతే డాక్టర్లూ, నర్సులూనూ. వీళ్ళ గుండెలు మండితే గుండె ఆపరేషన్లు ఎవరు చేస్తారు చెప్పండి. వీళ్ళకీ మినహాయింపు ఉండాల్సిందే. అధ్యాపకులు. వీళ్ళే లేకపోతే విద్యార్ధులు వచ్చి ఏం లాభం చెప్పండి. విద్యార్ధులకి మినహాయింపు ఇచ్చి, వారి బోధకులకి ఇవ్వక పోవడ మేమిటండీ చాదస్తుడు కాకపోతే.

ఈ స బే వెనుక పెద్ద కధే ఉందండీ. అది కాంగ్రెస్సు మార్కు రాజకీయం. తమకు వొటేసే తమ కుత్సితత్వాన్ని గమలించ లేని ఒక వర్గం ప్రజలని ఎప్పుడూ కాపు కాసుకోవడం. వాళ్ళే ఆటో డ్రైవర్లు. వాళ్ళకి చూడండి పండగే పండగ. మామూలుగా మన దేశంలో మీటర్లుండవు. ఉన్నా పని చెయ్యవు. వాళ్ళు అడిగిందే బాడుగ. వీళ్ళను కాపాడుకుంటే రేపు పంజాబు ఎన్నికల్లో పనికొస్తుంది. ఇక క్యాబుల వాళ్ళు. వోట్లు రాలవు కాని నోట్లు రాలతాయి, పార్టీ ఫండుకి. ఎంత ఆలోచనండీ.

“సరి బేసైతే పొరపాటు లేదొయ్ పట్టుకోలేరొయ్” అని అన్ని కార్లనీ అన్ని రోజులూ వాడుతూ దూసుకు పొయ్యే వాళ్ళుంటారు. దాన్లో యాభై సాతం ఆ ఆ పా వాళ్ళే వుంటారు. నిజం నిలకడ మీద తెలుస్తుంది.

అదండీ స బే శాండ్ విచ్‌ల కధ.

##########################