తెలుగు భాష వెలుగులు జిలుగుల బ్లాగులో

Sunday, April 17, 2016

జలమూల మిదం జగత్

అనబడే

“గంగే లేని గంగ నన్ను చూసి వెక్కిరించింది లింగా !

###################

“గంగ ఉదకము తెచ్చి నీకు లింగ పూజలు చేద మంటే గంగ లోని చేప కప్పా యెంగిలంటున్నాయి లింగా!” ఇది తత్వం.అనుభవమయితే కానీ తత్వం బోధ పడదు అని సామెత. దీన్లో అనుభవమవడానికి యేముందండీ! “ఈ నీళ్ళు మేము తాగేశాము, తాగి పుక్కిలించి ఉమ్మేశాము” అని చేపలు, కప్పలు ఘోషిస్తున్నాయన్న మాట. చూశారా, అదే తత్వమంటే. “బాబూ! ఓ మనీషీ! నువ్వేమో చాల భాగ్యవంతుడి ననీ, తెలివి నాకే ఉందనీ మురిసిపోకు. మేము యెంగిలి చేసిన నీళ్ళు తాగుతున్నావా, నాయనా! నువ్వు మా కంటే పేదవాడివే కదా!” అని “యెంగిలితాళి” చేస్తున్నాయండీ గంగలోని చేపలూ, కప్పలూనూ!

నీరే లేని మీరు ఈ తత్వం పాడుకోవడం ఏం బాలేదని, పాత వాసనల నుంచి మాకు స్వేఛ్ఛ కావాలని ఈ మధ్యనే ప్రధమ ప్రధాన మంత్రి గారి విశ్వ విద్యాలయంలో చదువు కొనని (వీరు చదువు కొనరండీ, పన్ను కట్టే వారి కన్ను పొడిచి వారి సొమ్ముతో విశ్వ విద్యాలయాల్ని అతిధి గృహాలుగా మారుస్తుంటారు), చదువుకోని యెడమ చేతి వాటం వారు కుడి చేతులు లేపి అరిచారు. అదో కధ! తరువాయి భాగంలో చర్చించుకుందాం!

“అసలు నాకు తెలీకడుగుతాను. భారత దేశము మూడు వైపులా నీరు, ఒక వైపు భూమి ఉన్న ప్రదెశం కదా, నీరు లేక ప్రజలు “దాహమో, ధర్మరాజా” అని అరవడమేమిటో, ఈ చేతకాని ప్రభుత్వం రెండేళ్ళల్లో మూడు సముద్రాల్లోనుంచీ నీరు తరలించ లేకపొవడం మన దౌర్భాగ్యం కాదా” అని సీతారం యేచూరి గారు వాకృచ్చారు. “దాహమో రామచంద్రా” అని వారిని పిలవలేదని వారి ఆక్రొశం అయి వుండ వచ్చు. అయితే ఇలాటి విషయాలేమి తలకెక్కని, చదువుకోని విద్యార్ధులు “దాహం నుంచీ ఆజాదీ “ అని పాడటం మొదలు పెట్టారు. మనిషి పోయాడు, పరామర్శించమంటే విమర్శించడం భారత కమ్యూనిస్టులకి వెన్నతో పెట్టిన విద్య.

“యేమిటోయ్! రాంబ్రహ్మం! డబ్బు నీళ్ళ లాగా ఖర్చు పెడుతున్నావట. మీ నాన్నగారు ఒకటే బాధపడుతున్నారు” అని ఓ పరబ్రహ్మం గారు రాంబ్రహ్మాన్ని హెచ్చరిస్తే, “ అబ్బే! నీళ్ళెక్కడున్నాయండీ? ఖర్చు చెయ్యడానికి. మా నాన్న గారి చాదస్తం గాని. ఇలాంటి సామెతలనుంచి మనకి ‘ఆజాదీ” కావాలి. కుక్కని తంతే డబ్బులు రాలతాయి. ఏది తన్ని చూడండి నీళ్ళు రాలతాయేమో.” అని తత్వం చెప్పి, ఎర్ర జెండా, ఎర్ర జెండా, ఎర్రెర్రెర్రెర్రెర్ర జెండా” అని పాడుకుంటూ పోతుంటే “వీడికి వేపకాయంత వెర్రి ఉందనుకుంటా” అని పరంబ్రహ్మం గారు వాపోయారట.

అసలు జలానికీ, ధనానికీ లింకు అప్పటినుంచే ప్రారంభమయ్యిందండీ. ఇంకా వెనక్కి పోతే భాగవతంలో యశోద దగ్గరకి బలరాముడొచ్చి,

“అమ్మా! తమ్ముడు నీరు త్రావెను చూడమ్మా అని రామన్న తెలుపగా అన్నా అని చెవి నులిమి యశోద ఏదన్నా నీ నోరు చూపమనగా చూపితివట నీ నోటను బాపురే వేల బోర్లు, వేనవేల మోటార్లు, లెక్కకు రాని టాంకర్లు, కార్ల నిండా కాసులే కాసులు ఆ రూపము గనిన యశోద దాహము నశియించి జన్మ ధన్యత గాంచెన్”

అప్పుడు మొదలైన నీళ్ళ మాఫియా మూడు బోర్లు, ఆరు టాంకర్లూగా వెలుగుతోంది. అది మన సౌభాగ్యమో లేక దౌర్భాగ్యమో తెలీదు కాని, “యీ ప్రైవేటు టాంకర్లు ఉండ బట్టి సరి పోయింది కానీ లేపోతే దాహంతో చచ్చి పోయే వాళ్ళం, స్నానాలు లేక వాసనతో కుళ్ళి పొయే వాళ్ళం” అని మనమంతా ప్రైవేటు టాంకరు దేవుళ్ళ స్త్రోత్ర పాఠాలు చదువుతూనే ఉంటాం. అంతే కానీ అది అక్రమమనీ, వాళ్ళు భూగర్భ జలాల్ని అడ్డ దిడ్డంగా తోడేసి మన జన్మ హక్కయిన నీళ్ళని మనకే, మన డబ్బులకి అమ్ముతున్నారనీ ఒక్క సారీ తిట్టుకోం కదా? “అబ్బే! ప్రభుత్వం యేం చేస్తుందండీ అంతా దగుల్బాచీ గాళ్ళు” అని తిట్టడం చూశాం కానీ ఈ నీళ్ళ దొంగలు అంత కంటే పెద్ద దగుల్బాచీ గాళ్ళని ఎప్పుడూ తిట్టుకోడం చూళ్ళేదు కదా? దీన్నే ఇంగ్లీషులో “స్టాక్ హోం సిండ్రోం” (Stockholm Syndrome) అంటారు. అంటే మనకి అన్యాయం చేసే వాళ్ళ మీద అన్యాయం చెయ్యంగా, చెయ్యంగా అమితమైన ప్రేమ పుట్టడం. దొంగ పోటు కంటే లింగ పోటు ఎక్కువైంది అంటే దాదాపు ఇలాంటిదే.

###########################

అసలు కరువెందుకొస్తుండీ. నేను కాలిఫొర్నియాలో ఉన్నప్పుడు ఇక్కడ వానలు లేక తీవ్ర నీటి కరువొచ్చింది.ప్రభుత్వం నీళ్ళు పంపడం ఆపలేదు. అయితే ప్రజలకి అవగాహన కల్పించారు. ప్రసార సాధనాల ద్వారా “నీటి వాడకం తగ్గించుకొండి” అని ప్రచారం చేశారు. నీరు వాడి కార్లు కడుగ వద్దు అనేది ఒక సందేశం. ఎవరన్నా అలా కడిగితే వారికి ఎక్కువ మొత్తంలో జరిమానా వగైరా శిక్షలు విధించారు. ప్రతి గ్యాస్ స్టేషన్లో కార్లు కడిగే ఏర్పాట్లు చేశారు.

మనం చూడండి. భాగ్య నగరానికి మంచి నీరు అందించే హుస్సేన్ సాగరాన్ని రసాయన సాగరంగా మార్చాం. ఎన్నో జిల్లాలకి తాగు, సాగు నీరందించే మూసీ నదిని మురికి నదిగా మార్చాం. చెరువుల్లో, కాలవల్లో, నదుల్లో పూడిక తీసే సంగతి మర్చి పొయ్యాం. నీళ్ళు లేక పోయినా కొత్త కా లువలు తవ్వాం. వూళ్ళల్లో బావులు తవ్వడం పాత కధ.

నీరు లేదా? ఉన్నది. లేకపొతే టాంకర్ల వాళ్ళు నీళ్ళు ఎలా ఇస్తున్నారు. తొలకరి వచ్చే వరకు ఓపిక పడితే మళ్ళీ చూసుకుందాం అనే తత్వం అలవాటు చేసుకున్నాం. “ఎవరికి వారే యమునా తీరే” అవునండీ యమునలో మాత్రం నీళ్ళేవీ? అందుకే తీరం మీదే పాడుకోనక్కర లేదు, యమునా నదిలోపలే పాడుకోవచ్చు.

ధనమున్న చోట జలముంటుంది. దీన్నే తిప్పి టాంకర్ల వాళ్ళు జలమున్న చోటే ధనమొస్తుంది అని నిరూపించారు. మరి అమీర్ల ఇళ్ళలో పది పడక గదులు, పది పన్నెండు స్నానాల గదులు, ప్రతి స్నానపు గదిలో తొట్టెలు, తొట్టె తొట్టెకీ అందమైన చేతి పంపులూ , అడుగేస్తె ఒక చెయ్యి కడుక్కునే బొచ్చె, (Wash Basin) బొచ్చె పైన పంపూ , పంపు తిప్పితే నీళ్ళే నీళ్ళూ. “నీరు లేవని బాధ పడకోయ్, అమీరు ఇంట్లో చూడవోయ్” (గూర్ఖా రానిస్తే) .

“పూజా పునస్కారం లేక మూల పడున్నాను కానీ నైవేద్యం పెట్టు నా మహిమ చూపిస్తాను” అన్నాట్ట ఓ మూల పడి ఉన్న దేవుడు. “కరువొస్తే గాని ఖాను సాహెబుకిఊపు రాదు” ఇన్నాళ్ళూ ఏం చేస్తున్నాడో (నీటి కరువు రాబోతోందని “వేదన ఘోష” ప్రారంభమయ్యి దాదాపు దశాబ్దం కావొస్తోంది.) ఖాను గారి దృష్టికి మాత్రం రాలేదు. ఉన్నట్టుండి మహారాష్ట్రలో తీవ్ర నీటి ఎద్దడి వచ్చిందని హుటాహుటిన కోటి రూపాయల కారులో వెళ్ళీ అక్కడ ప్రజలకి “నీళ్ళు వృధా చెయ్యకండోయి, వానలొచ్చినప్పుడే పట్టుకొండోయ్, సత్యమేవ జయతే” అని చెప్పి నేను తొట్లో స్నానం చెయ్యాలి అనేసి వెళ్ళి పోయాడు. తన పని తాను చేశాను అన్నట్టుగా. (సత్యమేవ జయతే అంటే సత్యం జయిస్తుంది అని మాత్రమే, నేను సత్యం చెబుతానని కాదు అని గమనించ ప్రార్ధన). ఒక సత్య వాది తాను ఏం చేస్తున్నాడో చెప్పి, తనని అనుకరించమని చెప్తాడు. ఇక్కడ ఖాను తను నీళ్ళు ఆదా చేస్తానని ఎక్కడా చెప్పిన దాఖలాలు లేవు. “మీ ఖర్మ! మీకు నీళ్ళు లేవు. మీరు ఆదా చెయ్యండి., నా దుబార మాత్రం తగ్గదు” అని చెప్పినట్టుగానే ఉంది. దీని మీద నేనొక పద్యం వ్రాశాను. క్రిం.చూ. (క్రింద చూడండి)

అందుకే ఆత్రేయ గారు, “బుగ్గ మీద గులాబి రంగు ఎలా వచ్చెనో చెప్పగలవా, నిన్ను మించిన కన్నెలెందరో మండుటెండలో మాడి పోతే వారి బుగ్గల నిగ్గు నీకు వచ్చి చేరెను తెలుసుకో” అని చెప్పారండి.

ఖాను గారి “కడుగు బొచ్చెల్లో”( Wash Basins) నీటి వెనుక చెమట గాధలున్నాయి కదా. వాటి విషయం వచ్చే బ్లాగులో.

బావులు తవ్వగ చూపడు త్రోవ యేది

కాసు రాల్చ డాయె ఖాను సాబు

మాటల తోనె కట్టె నీటి మూట

కనుల నీరు కార్చె కరువు తీర!

####################################

गङ्गेच यमुने चैव गोदावरी सरस्वति ।

नर्मदा सिन्धु कावेरी जलेऽस्मिन् संनिधिं कुरु ॥

Gangge-Ca Yamune Ca-Iva Godaavarii Sarasvati |

Narmadaa Sindhu Kaaverii Jale[a-A]smin Samnidhim Kuru ||

Meaning:

1: O Holy Rivers Ganga and Yamuna, and also Godavari, Saraswati,

2: Narmada, Sindhu and Kaveri; Please be Present in this Water Near Me (and make it Holy).