మార్కులు గొప్పవా? లేక విద్యనా?విద్యార్థులారా మీకు ఓ లేఖ

Naren Yellavula
Acha Telugu Muchatlu
7 min readApr 28, 2019

--

Photo by Aaron Burden on Unsplash

ముందుగా నా గురించి ఒక రెండు మాటలు. నా పేరు నరేన్. నేను వ్రుత్తి రీత్యా ఒక సాఫ్ట్ వేర్ ఇంజినీర్ను. ప్రస్తుతం దక్షిణ జర్మనీలోని బవేరియాలో నివాసముంటున్నాను. ఏంతో మంది తెలుగు విధ్యార్థులు, ఈ రెండు మూడు సంవత్సరాలనుండి మార్కుల కారణంగా రాలిపోవడం నన్ను ఎంతగానో కలిచివేసింది. ఆత్మహత్య చేసుకోవాలి అన్న ఆలోచనలు ఉన్న విధ్యార్థులకి నా ఈ లేఖ ఒక విరుగుడులా పనిచేస్తుందని నమ్ముతున్నాను.

తెలుగు రాష్ట్రాలల్లో విద్యా ప్రమణాలు నానాటికి దిగజారుతున్నాయి అని నేను సహా ఎవరైనా అంటే మేధావులు, సిల్లబస్ తయారు చేసే పెద్దలు కొట్టిపారెయ్యవచ్చు. కాని విద్య మాటున మన విధ్యార్థులకి, భావి సమాజానికి మనం చేస్తున్న చేటుని గుర్తించకపొతే జరిగే అపారమైన నష్టానికి మనమే బాధ్యులమవుతాం అని చెప్పడనికే ఈ వ్యాసం.

విద్య అనేది సమాజాన్ని నిర్నించడానికి ఉపయోగపడాలి అని ఎందరో మహానుభావులు ఉద్ఘాటించిన మాట మనందరికి తెలిసిందే. అయితే విద్య అనేది వ్యక్తిగత అభివ్రుద్ధికా లేక సమాజ వికాసానికా అనే ప్రశ్న మనం వేసుకోవాలి. ప్రాచీన కాలంలో మానవులు గుంపులుగా వెటాడేవారు, కలసికట్టుగా పని చెసేవారు. వారే చివరకు ఒక సమాజంగా ఏర్పడ్డారు. నేటి ఆధునిక కాలంలో, ముఖ్యంగా భారత దేశంలో, మన చదువులు అన్నీ ఒక వ్యక్తి అభివ్రుద్ధిని ద్రుష్టిలో పెట్టుకొని రూపకల్పన చేసినవి. మార్కులు దానికి గీటురాయి.

మార్కులు అనే వ్యక్తిత్వ గణాంకాల సముద్రంలో కొట్టుకుపోయే విద్యార్థులారా! ఎందుకు మీరు వాటిని పట్టించుకోవద్దో మనం చూద్దాం.

ప్రపంచం ఎలా నడుస్తుంది?

ఈ ప్రపంచంలో ఎంతో మంది ప్రజలు ఎన్నో రకాల ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. దాదాపు తొంబై శాతం పనుల్లో జన సమూహాలె కలిసి పనిచేస్తాయి తప్ప ఒక్కరు కాదు. ఉదాహరణకు ఒక సాఫ్ట్ వేర్ కంపనీని తీసుకోండి. ఒక ప్రాజెక్ట్ పై ఎంతో మంది పనిచేస్తూ ఉంటారు. ఒక ఉపగ్రహాన్ని కక్ష్యలోకి పంపాలన్నా ఒక సమూహం అవసరం, ఒక శస్త్ర చికిత్స చెయాలన్నా కూడా ఒక టీం కావాలి. ఒక్కడి వల్ల ఎమీ అవ్వదు, సమూహం, సమాజం అవసరం.

మరి అటువంటప్పుడు మన విద్యా వ్యవస్థ దాన్ని ఎందుకు పట్టించుకోదు? ఒక తరగతిలో మార్కుల పేరిట ప్రతి విధ్యార్థిని విడదీయాలి అని ప్రయత్నిస్తారు తప్ప కలసికట్టుగా పని చెయ్యాలి అని బోధించరు. కలసికట్టుగ పనిచెయ్యడానికి మార్కులు ఉండకూడదా? పిల్లలు పెరిగి పెద్దవారు అయిన తర్వాత నిజ జీవితంలో వారు ఒక సమూహంలో ఎలా చక్కగా అమరగలరో ఏ పాఠమూ నేర్పకపొతే వారు పెద్దయ్యాక పనిని సమర్ధంగా చెయ్యగలరా?

స్కాండనేవియన్ ఇంకా నార్డిక్ దేశాలైన ఫిన్లాండ్, డెన్మార్క్, స్వీడెన్, మరియు నార్వే దేశాలు యావత్ ప్రపంచానికి విద్యా రంగంలో దిక్సూచిలా నిలుస్తున్నాయి. కారణం? అక్కడ టీం వర్క్ కి ప్రాధాన్యత చాలా ఎక్కువ. వ్యక్తిగత మార్కులకి అంత పట్టింపు ఉండదు. నేను నివసించే జర్మనీలో కూడా రాత పరీక్షలతో పాటు ప్రాక్టికల్ పరీక్షలకు సమాన లేదా అంత కంటే ఎక్కువ ప్రధాన్యం ఉంటుంది. నేను ఉండే ఊరి పేరు అన్స్ బాక్. నేను రైలులో ప్రయాణించే సమయంలో ప్రతీ ఊరిలో ఒక విశాలమైన పుట్ బాల్ మైదానం కనిపిస్తుంది. ఆటలకు, శారీరక ధ్రుడత్వానికి ఇక్కడి విద్యా వ్యవస్థ తగినంత చోటు కల్పిస్తుంది. బవేరియన్ విద్యా వ్యవస్త కోసం క్రింద ఇవ్వబడిన లింక్ ను చూడండి.

పైన చెప్పిన దేశాలు అన్నీ పిల్లలను ఒక సమాజంలో, సమూహంలో సులభంగా ఇమడగల వ్యక్తులుగా తీర్చిదిద్దుతున్నాయి. కాని మన దేశంలో, రాష్ట్రంలో ఆ పరిస్థితి ఉందా?

మార్కులు బంగారు భవిష్యత్తుకు సంజీవనా?

నా ఎంసెట్ ర్యాంకు 99,125. నా ఇంటర్ మార్కులు 882, ఐ.ఐ.టి రాలేదు. మా నాన్న ఎన్నో చీవాట్లు పెట్టాడు, చుట్టాలంతా పెదవి విరిచారు కానీ నేను అధైర్యపడలేదు, ఎందుకంటే నాకు తెలుసు, జీవితంలో ఎది ముఖ్యమో. నాకు కంప్యూటర్లంటే ఇష్టం. ఆందుకే, ఒక సాధారణ ఇంజనీరింగ్ కళాశాలలో కంప్యూటర్ సైన్స్ చదివాను. నాకు తెలుసు, నాకంటూ ఒక రోజు వస్తుందని, అప్పుడు అందర్ని(తల్లిదండ్రులతో సహా) చూసి నవ్వుకుంటానని. నేను చేసిందల్లా నా సొంతంగా నేను ఆలోచించడమే. ఇవ్వాళ నేను, నా కన్నా ఎక్కువ మార్కులు వచ్చిన వారికన్నా మంచి స్థాయిలో ఉన్నాను(ఆర్ధికంగా, సంతోషంగా కూడా). ర్యాంకులు కేవలం సమాజం గీసిన గీత దాటడానికి తప్ప పళ్ళు రాలగొట్టుకొవడానికి కూడా పనికిరావు అని నా అభిప్రాయం.

లక్ష కోట్ల విలువ గల ఆపిల్ సంస్థని స్తాపించిన స్టీవ్ జాబ్స్ కాలేజి లో ఫెయిల్ అయ్యాడని ఎంత మందికి తెలుసు. ఇటువంటి ఎన్నో ఉదాహరణలు మన కళ్ళ ముందు ఉన్నా, మార్కులను సంజీవని అనుకోవడం విధ్యార్థులుగా మిమ్మల్ని మీరు మోసం చేసుకోవడమే. మార్కులు రాలేదని ప్రాణాలు తీసుకోకండి. ఎందుకంటే, అవి మీ ప్రాణంలో 0.000000001% విలువ కూడా ఉండవు.

ఎవరైనా ఒక అరటి తొక్క కోసం ప్రపంచంలోని అడవులన్నింటినీ నిప్పు పెట్టి తగలేస్తారా?

నిజమైన విద్య మీకు సంతోషాన్ని కలిగించాలి. అటువంటి విద్యను వెతకండి. శారీరకంగా, మానసికంగా మిమ్మల్ని ధ్రుడంగా చేసే ఆటలను ఆడండి, పుస్తకాలను చదవండి. ప్రశ్నించుకోండి మిమ్మల్ని ముందు!

మీ తల్లిదండ్రులు సామాన్య కుటుంబం నుండి వచ్చి ఉండొచ్చు. వారు మిమ్మల్ని ఒక గొప్ప స్థాయిలో చుడాలని ఆశ పడుతూ ఉండొచ్చు. అంత మాత్రాన వారు వారి అభిప్రాయలను మీ మీద రుద్దుతామంటే నిర్దాక్షిణ్యంగా ఖండించండి. మీకు నచ్చిన రంగాన్నే, పనినే ఎంచుకోండి.

విద్య దేశాన్ని నిర్మించేదిలా ఉండాలి, భావి పౌరులను చిదిమేసేదిగా కాదు!

తల్లిదండ్రుల అమాయకత్వమా లేక విద్యా వ్యవస్థ చేతకానితనమా?

గత పది సంవత్సరాలనుండి ఎన్నో కుటుంబాలు దిగువ మధ్య తరగతి ఇంకా పేదరికం నుండి మధ్య తరగతికి లాగబడ్డాయి. ఆ కుటుంబాలలోని తల్లిదండ్రులు, వాళ్ళ పిల్లలకి మంచి విద్యని అందించాలి అని ఆశ పడ్డారు. కొన్ని కార్పొరేట్ సంస్థలు డబ్బులు సంపాదించడానికి కొత్త మార్గాన్ని కనుకున్నాయి. తల్లిదండ్రులకి, మార్కులు ర్యాంకులతోనే వారి పిల్లల భవిష్యత్తు అని విషపు ప్రచారం చేసాయి. పేపర్లు, టి.వి ల నిండా ప్రకటనలతో హిట్లర్ కాలంలో ఉన్న గోబెల్స్ ని మించి ప్రచారం చెయ్యడంలో ఫలానా కాలేజీలు సఫలీక్రుతం అయ్యాయి. ఎంతగా అంటే చివరాఖరికి, ఆ ప్రచారమే నిజం అని ప్రజలు నమ్మేంతగా. ఇంటర్మీడియట్ విద్య కేవలం ఐ.ఐ.టి లో లేదా మరో ప్రవేశ పరీక్షలో గీత దాటదానికి మాత్రమే అనే సత్యాన్ని విద్యార్థులకు, తల్లిదండ్రులకు తెలియకుండా జాగ్రత్తపడింది కార్పొరేట్ విద్యా రంగం.

ఈ జాడ్యమే నేటి పిల్లల అత్మహత్యలకు కారణం. కార్పొరేట్ కళాశాలలు ఇంటర్మీడియట్ విద్యను వారి అభివ్రుద్ధి కోసం వాడుకుంటున్నాయి. ఆయా కళాశాలల అధిపతులు వేల కోట్లకు పడగలెత్తి ఎన్నికలలో పోటీ చేసి మంత్రులవుతున్నారు. విద్య అనేది ఒకరి కంటే, ఒకరిని తొక్కేసి కాదని, సమిష్టిగా, ఐకమత్యంతోనే మెరుగైన సమాజం నిర్మితం అవుతుంది అని విధ్యార్థులకి చెప్పడంలో భారత దేశ విద్యా వ్యవస్థ దారుణంగా విఫలం అయింది.

ఒక ఇంటర్ కళాశాల స్థాపనకు బోర్డ్ నుండి కచ్చితమైన మార్గదర్శకాలు ఉన్నయి. అయినా వాటిని చాలావరకు కళాశాలలు పాటించట్లేదు. ఇంటర్మీడియట్ బోర్డ్, నిభందనలను ఉల్లంఘించిన కాలేజీలపై చర్యలు తీసుకోదు. క్రింద, నేను ఆ మార్గదర్శకాలను జత చేస్తున్నాను.

అన్ని అనుమతించబడిన ఇంటర్మీడియట్ కళాశాలలు విద్యార్థుల క్రీడల కోసం ఒక ఎకరం మైదానాన్ని నిజంగా కలిగి ఉన్నాయా? గుండె మీద చెయ్యి వేసుకొని చెప్పండి. చెప్పలేరు. ఎందుకంటే అవి ఊహల్లో తప్ప నిజంగా లేవు. ఇంటర్మీడియట్ సిల్లబస్ లో తప్పనిసరిగా ‘ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్’ అనే పాఠ్యాంశం ఉంది. నేను చదివే రోజుల్లో అది ఉందని కూడా మాకు ఎవరూ చెప్పలేదు, బోధించడం మాట దేవుడెరుగు. కంటితుడుపు కోసం మరొక పాఠ్యాంశాన్ని చేర్చారు, అది ‘ఎన్విరాన్మెంటల్ స్టడీస్’. దీన్నీ పెద్దగా ఎవ్వరూ పట్టించుకోరు. అంటే సమాజానికి అవసరమైన ఏవీ విధ్యార్థులకి పనికిరావు. అటువంటి వెన్నెముక లేని చదువులు చదివినవారు రేపు దేశాభివ్రుద్ధికి, సమాజానికి పనికిరాకుండా పోవడనికే అవకాశం ఎక్కువ!

తెలిసీ తెలియని వయసులో ఉన్న విద్యార్థులని ప్రేమగా దగ్గరికి తీసుకోవాల్సిన తల్లిదండ్రులు వారిని దూరంగా ఎక్కడో హాస్టల్లలో పెట్టి చదివిస్తున్నారు. అంటే మీ తరపున చదివించడానికి ఇంకెవరికో డబ్బులు ఇచ్చి ఆ సౌకర్యం కొనుక్కుంటున్నారు. ఆ డబ్బులు తీసుకున్న కాలేజీలు రోజుకి 15 గంటలు మార్కుల కోసం పిల్లలని తోమే పనిలో ఉంటాయి. కనీసం అన్నం తిన్నావా? అని అడిగేవారు ఒక్కరూ ఉండరు. మీ పిల్లలు అయినంత మాత్రాన వారి మానవ హక్కులను హరించే హక్కు కన్నవారుగా మీకు కూడా లేదు.

జర్మనీ లాంటి అభివ్రుద్ధి చెందిన దేశంలో అలా గనక ఎవరైనా చేస్తే తల్లిదండ్రులైనా సరే జైలుకి వెల్లవలసి ఉంటుంది. ఇకపోతే తమాషా ఏంటంటే ఇక్కడి జైల్లల్లో రెండు సంవత్సరాలు శిక్ష పడిన ఖైదీలు కూడా మన తెలుగు రాష్త్రాలల్లో, హాస్టల్లలో చదివే ఇంటర్మీడియట్ విధ్యార్థులకన్నా గౌరవంగా బ్రతుకుతున్నారు. అంటే మన పిల్లల్ని అంత హీనంగానా మనం చూస్తున్నాం?

ఇంత పెద్ద ఎత్తున మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుంటే, ప్రభుత్వం, కోర్టులు చుస్తూ ఊరుకోవడం విడ్డూరం కాకపొతే మరేమిటి? తల్లిదండ్రులూ మారండి! మార్కులు సర్వస్వం కాదు! మార్కుల మాటున కొంత మంది కార్పోరేట్ పెద్దలు ఆడుతున్న నాటకమే ఇదంతా అని గుర్తించండి.

నేటి తరం పిల్లలు మరీ సున్నితంగా తయారు అవడానికి కారణం ఎవరు?

నేడు పేపర్లో వచ్చే వార్తలు చూస్తూ ఉంటే చాలా బాధ కలుగుతోంది. ‘ మొబైల్ కొనివ్వలేదని విద్యార్థి ఆత్మహత్య ‘, ‘ మార్కులు రాలేదని అత్మహత్య ‘, ‘ ఎవరో మందలించారని ప్రాణ త్యాగం’. ఇవన్నీ ఒకప్పుడూ ఉన్నాయి. కాని నేడు ఉన్నంత మోతాదులో ఎప్పుడూ లేవు. కారణం, విద్యార్థులు/పిల్లలు మరీ సున్నితంగా తయారవ్వడమే. ప్రధాన కారణం, వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపే ఏ విద్య వారికి అందించకపోవడమే. పెద్దలు పిల్లలని చదువుల పేరిట వదిలించుకోవడానికి హాస్టల్ల వైపు చూస్తున్నారు. వారికి చదువుకి సంబంధించిన పుస్తకాలే తప్ప నవలలో, కథల పుస్తకాలు చదివే అలవాటు చెయ్యడంలేదు. ఆన్నింటినీ మించి ఆటలు ఆడమని పిల్లల్ని ప్రోత్సహించే తల్లిదండ్రులు ఎంతమంది? పిల్లలు పుస్తకాలు చదవకుండా, ఆడుకోకుండా ఇంకేం చెయ్యాలి.

నేటి బాల్యం సెల్ ఫోన్ కోరల్లో చిక్కుకోవడానికి తల్లిదండ్రులదే పూర్తి భాద్యత. ఆడుకొవడానికి సరిపడా మైదానాలు లేనప్పుడు మీ ఎం.ఎల్.ఏ నో లేకపొతే నగర మేయర్నో వాటిని నిర్మించమని ఎందుకు అడగరు? పిల్లలని బయటకు ఎందుకు పంపరు? ఎందుకంటే మీకు ఆటలంటే చిన్న చూపు కాబట్టి.

ఆటలు కేవలం శారీరక ధ్రుడత్వం కోసమే కాదు, అవి ఒక మనిషిలో సమిష్టిగా పనిచేయగలిగే నైపుణ్యాన్ని పెంచుతాయి. వారిని ఒత్తిడి నుండి దూరం చేసి స్వాంతన కలిగిస్తాయి. నలుగురితో కలిసే అవకాశాన్ని కలిగిస్తాయి. గెలుపు గొప్పదే, కాని ఒక ఓటమి నుంచి మనం మరింత నెర్చుకోవచ్చు అనే భావాన్ని విద్యార్థులకు ఆటలు నేర్పుతాయి.

మీ పిల్లలకు సంగీతం నేర్పండి. వారు ఇంకో ఎ.ఆర్. రెహమాన్ కాకపోవచ్చు. కాని, శబ్ద తరంగాల సాధన వలన వారి వినికిడి శక్తి పెరుగుతుంది. డ్రాయింగ్ నేర్పించండి. భవిష్యత్తులో ఆర్కిటక్చర్ అంటే ఇష్టం కలిగి దేశంలోనే పేరు మోసిన ఆర్కిటెక్ట్ అవొచ్చు. దేశానికి ఇంజనీర్లు, డాక్టర్లతో పాటు ఇటువంటి ఎన్నో సేవలు అందించే వ్యక్తులు అవసరం. నా ఉద్దేశం రోజూవారీ చదువులతో పాటు మరేదైనా పిల్లలకు నేర్పమని. అప్పుడు వారు జీవితాన్ని మూసగా కాకుండా వేరొక కోణంలో ఆలోచిస్తారు. మరింత పరిణితి చెంది సున్నితత్వం నుండి బయటపడే అవకాశం వారికి కలుగుతుంది.

ఈ మధ్య చదువుల కారణంగా ఆత్మహత్యలు చేసుకుంటున్నవారిలోఅమ్మాయిలే ఎక్కువ. ఇది ఎంతో అందోళన కలిగించే విషయం. ప్రస్తుతం భారత దేశ పురుష:మహిళా నిష్పత్తి ఆరోగ్యకరంగా లేదు. మితి మీరిన పొటీ తత్వం వారి ప్రాణాల్ని పొట్టన పెట్టుకుంటుంది. హాస్టల్ అపార్ట్మెంట్ పై నుండి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డ సంఘటనలను చూసైనా తల్లిదండ్రులు పిల్లలపై ఒత్తిడి చెయ్యడం మానుకోవాలి. పిల్లలు ఒత్తిడికి గురవుతున్నారా లేదా అని పెద్దలే కనిపెట్టుకుని ఉండాలి. ఎందుకంటే, పిల్లలు ఎక్కువ సమయం గడిపే కాలేజీలో అధ్యాపకులు, వారి పని వారు చేసుకొని వెల్లిపోతారు. ఏలాగూ ఆటలు లేవు, చదువులే కాబట్టి పెద్దగా మిత్రులతో మనసు విప్పి చెప్పుకునే చొరవా ఉండదు. కాబట్టి తల్లిదండ్రులూ! మీరే వారి స్నేహితులు!గుర్తుంచుకోండి.

ప్రభుత్వాల తీరు మారాలి

విద్యా వ్యవస్తలోని చట్టాల అమలులో ప్రభుత్వాలు కఠినంగా లేవు అనేది అక్షర సత్యం. ఇంటర్ బోర్డే కఠినంగా ఉంటే కార్పోరేటు సంస్థల గుత్తాదిపథ్యం సాగేది కాదు. పాలించే వారు బాధ్యతగా, ప్రజల పట్ల జవబుదారీతనంతో ఉంటే ప్రజాస్వమ్యానికి మంచిది. లేదంటే అంతర్యుద్దమో, మరేదో రావచ్చు.

మార్కుల బదులు గ్రేడ్ల విధానం ప్రవేశపెట్టాలి, అది విద్యార్థులకి కొంత ఉపశమనం ఇస్తుంది. అలాగే లోపభూయిష్టమైన ఇంటర్మీడియట్ లాంటి విద్యా బోర్డులను రద్దు చెయ్యడమే మేలు. ప్రాక్టికల్ పరీక్షలకు, టీం యాక్టివిటీకి అన్ని తరగతుల సిల్లబస్ లలో ప్రాధాన్యత పెరగాలి, వాటిని నిక్కచ్చిగా అమలు చేసేలా చూడాలి.

చివరి మాటలు

నా ప్రియమైన విధ్యార్థులారా!, తల్లిదండ్రులు ఎప్పుడూ మీ మంచి కోసమే ఆలోచిస్తారు. కొన్ని సార్లు చెప్పుడు మాటలు విని, కార్పొరేట్ విద్యా వ్యవస్త మాయలో పడి, వారు కొన్ని పొరపాట్లు చెయ్యొచ్చు. దానికే, మీ విలువైన ప్రాణాలను తీసుకోవాలన్న ఆలోచనకి రాకండి. అది మీకు, మీ అమ్మా నాన్నలకి పెద్ద శిక్ష అవుతుంది. సమస్య ఉంటే ధైర్యంగా మాట్లాడండి. మంచి రోజులు వస్తాయి. మార్కులకి, మనం అంతిమంగా చేసే పనికి ఏ మాత్రం సంబంధం ఉందదు అనడానికి నేనే ఒక ఉదాహరణ. మీకొసం మీరు బ్రతకండి! ఇంకొకరిని సంత్రుప్తి పరచడానికి కాదు.

ఏంతో బాధ కొద్దీ ఈ లేఖని రాస్తున్నాను. తమ్ముళ్ళూ, చెల్లెళ్ళూ! ఏ బాధ ఉన్నా నాతో మాట్లాడండి (naren.yellavula@gmail.com). ఈ లేఖని మరింత మందికి చేరువ చెయ్యండి. తొందర పడకండి, మంచి రోజులు వస్తాయి!

ఇట్లు,
నరేన్ యల్లావుల
ఫిలిప్ జోర్న్ స్త్రాస్సె, 5
91522, అన్స్ బాక్.

మరికొన్ని:

జర్మనీ యొక్క విద్యా వ్యవస్థ కోసం, క్రింద చూడండి

--

--