2. ఓం నమో భగవతే రుద్రాయ

Aditya
Kauphy
Published in
4 min readApr 25, 2020

ఎండాకాలం వస్తే కాలనీ సందడి భలే ఉంటుంది. ఇంట్లోకన్నా పిల్లలందరూ బయటే ఉంటారుగామరి. పిల్లలేకాదు, కుర్రాల్లు పిట్టగోడమీదే వేళ్ళాడతారు. పెద్దవాళ్ళు వాకింగులు టాకింగులు అంటూ పార్కు కమ్యూనిటీ హాలులో సగం రోజు గడిపేస్తారు. రిటైరుడు ఏఈ శోభన్ బాబు గారు ఇన్ఫ్లుయెన్సుతో అక్కడికి ఓ కరంటు కనెక్షన్ తెప్పించారు కొన్నేళ్ళకిందట. ఓ రెండు సీలింగు ఫ్యాన్లూ, రెండు పెడస్టల్ ఫ్యాన్లూ రియలెస్టేటు మోహన్ చేత ‘స్పాన్సర్’ చేయించారు — ఆయన కంపెనీ పేరు రాసే అనుకోండి. మామూలురోజుల్లో పిల్లలు ఐదున్నరయ్యేసరికి ఇంటికి రాకపోతే బాల్కనీలలోకి, అరుగులమీదకి వచ్చి పెద్ద అరుపులు అరిచే తల్లులందరూ ఎనిమదయినా ఏం పర్లేదు ఈ చుట్టుపక్కలే ఎక్కడో ఉండుంటారని హాయిగా అరుగు బాతాఖానీ కొట్టుకుంటూ ఉండిపోతారు. రెండునెళ్ళ సెలవలు — అందరికీను.

పార్కు వెనకవైపు గోడ అవతల హెచ్చైజీ ఇల్లు సుదర్శనంకుల్ ది. వాళ్ళబ్బాయి ఇంగ్లాండొ ఫిన్లాండో ఎక్కడో ఆన్సైటులో ఉన్నాడు కొన్నాళ్ళుగా. ఈ సంవత్సరం అంకుల్, ఆంటిని అక్కడికి రమ్మని టికెట్లు తీసాడు. తిరగడానికి కాదులెండి. ఆరోనెల కడుపుతో ఉంది కోడలుమరి. ఆల్రెడీ ఇంట్లో నాలుగేళ్ళ పిల్లోడున్నాడు. తప్పదుగా! కొరియర్ కంపెనీలో పచ్చడ్లు ప్యాకింగు చేయించేసుకుని, మూన్నెళ్ళకి సరిపడా మందులు పట్టేసుకుని, బొంతల కుట్టడానికి పాత చీరలు పట్టుకుని రెడీ అయ్యి ఫ్లైటెక్కేశారు ఇద్దరూను.

ఇంతకీ మనకి ఇందులో ఇంట్రెస్టేమిటంటే ఆ ఇంటి లోపల గోడకానుకుని ఆసియాఖండంలోకల్లా గొప్ప మామిడిచెట్టు ఉంది. అది బంగినపల్లని కొందరూ, కాదు ఆల్ఫన్సోనో లంఘడానో కొబ్బరిమామిడీ అని మరికొందరూ ప్రతీఏడాదీ ఆర్గ్యూచేసుకోవడం ఆనవాయుతీ. ఏదయితేనేం ప్రతీ సంవత్సరం మే నెలలో పండేది, ప్రతీ ఇంటికి ప్రసాదంగా రెండో మూడో సాంక్షన్ అయ్యేవి. ఆ కోటాకోసం సంవత్సరమంతా అంకుల్ కి గుడ్మార్నింగూ గుడీవినింగూ చెప్పేవాళ్ళం. మరేపండు టేస్టూ దానికి సాటిలేదు. ఎందరో ట్రై చేశారు. కలకత్తనుంచీ అని, అలమండనుంచీ అని, సింగపూరునుంచీకూడాను. ఏ డబ్బాకొన్నా, ఎంతపోసినా ఆ టేస్టు నభూతో నభవిష్యత్!

ఈ ఏడాది ఊరెళ్ళడంతో ఆంటీ మావయ్య ఒకాయన్ని ఇంటికాపు పెట్టి వెళ్ళారు. ఆయన స్వచ్చమయిన తెల్లపంచతో పెద్దమీసాలుపెట్టుకుని భలే ఉండేవారు. విజయనగరం దగ్గరేదో అగ్రహారమంటాయనది. ఉదయాన్నే లేచి పార్కు చుట్టుపక్కలున్న పూలు కోసుకొని మంచి గొంతుతో గట్టిగా రోజూ చాలాసేపు పూజచేసేవారు. మేము పార్కుచుట్టూ సైకిల్ తొక్కుకుంటుంటే రౌండు రౌండుకీ అష్టోత్తరాలు సహస్రాలూ వినబడేవి. తాతగారికి బయట స్నానం చెయ్యడం అలవాటు. ఊర్లో ఇంట్లో బావో తొట్టో ఉండుంటుంది. ఇక్కడలాంటి అవకాశం లేదుకాబట్టీ గార్డెన్ పైపు దగ్గరో బక్కెట్టుపెట్టుకుని అక్కడ స్నానం చేశేవారు. ఆ స్నానంచేస్తున్నంతసేపూ రుద్రం గట్టిగా చదివేవారు. ఆ రుద్రం అయ్యేవరకు స్నానం అవ్వదు.

ఇదంతా మేము మా డిటెక్షన్ తెలివితేటలతో తెలుసుకోవడానికి కారణం ఆసియాలో బెస్టు మామిడికాయలు.

అంకుల్ ఇల్లు పార్కు వెనకుండడంతో అటుపక్క పెద్దగా ఎవరూ వెళ్ళే పనుండదు. అందుకు ఇంటిగోడకి ఇవతలిపక్క ప్రతీ సమ్మర్లో కంచె కట్టించేవారు సుదర్శనం గారు. ఈ ఏడాదికూడా ఫారెనెళ్ళే ముందే కట్టించేసారు. గోడ ఎడ్జిదగ్గర కాలవ పారడానికి మాత్రమే అందులో గ్యాపుండేది. మిగితాదంతా ముళ్ళు. దాదాపు అందరమూ ఆ ముళ్ళకి చొక్కాలు చింపుక్కున్నవాళ్ళమే. ఈ సంవత్సరం మాత్రం పెద్ద స్కెచ్చేసి మేలో వచ్చే రెండుపళ్ళ ప్రసాదంకాదు ఓ డజను కాయలు కోసేసి ఉప్పు కారం నంచుకుని తినేయాలని నలుగురం నిశ్చయించుకున్నాము. అయితే తాతగారు రోజంతా తోటలో ఏదో పని చేస్తూనే ఉండేవారు. పూజకూడా వరండాలోనే చేసుకునేవారు. పడుకోవడం కూడా అక్కడే. ఒక్క స్నానం చేసినప్పుడుమాత్రమే ఓ పదిహేనిరవై నిమిషాలు సేఫు అని డిసైడయ్యాము.

మాలో సన్నంగా ఉండేది టింకు. పార్కులో ఉన్న చెట్లన్నీ ఎక్కించేశం వాడిచేత ప్రాక్టీసుకి. ఓ అశోకా చెట్టుంటే అది కూడా ఎక్కించాం. మధ్యలో కాకొకటి గూడు కట్టుకుంది. దాని దగ్గరకెళ్ళేసరికి గుండుమీద గుచ్చేసింది పాపం వాడికి. లక్కీగా పెద్ద రక్తమేం రాలేదులెండి. మిగితా ముగ్గురం ఒక్కో డ్యూటీ వేసుకున్నాం. అనిల్ గాడు పార్కుగోడమీదనుంచీ తాతగారిని చూసి మాకు పొజీషన్ చెప్పాలి. అభయ్ గాడు సైకిలేసుకుని గేటు దగ్గరే తిరుగుతూ ఎవరొచ్చినా సిగ్నల్ ఇవ్వాలి. నేనేమో టింకుగాడికి గైడెన్సు కిందనుంచీ ఎలాఎక్కాలి, పళ్ళెలాకొయ్యాలి అని. ఒక గెస్టునికూడా తెచ్చుకున్నాం. మా గణపతి టెంపుల్ పూజారి ప్రసాదుగారి కొడుకు మనోజుని. వాడు మాకన్నా ఏడాది చిన్న. కానీ వాడికప్పుడే జూనియర్ పంతులుగా ట్రయినింగ్ ఇచ్చేస్తున్నారు వాళ్ళ నాన్నగారు. రుద్రం ఎప్పుడయిపోతోందే చెప్పే డ్యూటీ వాడిది.

సాయంత్రం ఐదయ్యింది. తుండుగుడ్డ తెచ్చుకుని తాతయ్య స్నానానికి బయలుదేరారు. గేటుదగ్గరనుంచీ అభయ్ సిగ్నల్ ఇచ్చాడు, ఆపరేషన్ మొదలు అని. గోడమీద అనిల్ కన్ఫర్మ్ చేశాడు, “కనబడుతున్నారు, బకెట్లో నీళ్ళు నింపుతున్నారు, ఓవర్” అని. మొదటి మగ్గు నెత్తిమీంచీ పోసుకోంగానే టింకుని కంచెపక్కన కాలవలోంచీ లోపలికి తోసేశాం. చేతిమీద ఓ రెండు గీతలతో తప్పించుకుని అటుపక్కకెళ్ళిపోయాడు. వెంటనే గోడెక్కి చెట్టెక్కడం మొదలెట్టాదు.

ఓం నమో భగవతే రుద్రాయ….

మొదటి కొమ్మ మీదనుంచీ సౌండుచెయ్యకుండా పాక్కుంటూ చెట్టు మధ్యకి చేరాడు.

నమో హిరణ్య బాహవే…

మూడోకొమ్మ పట్టుకుని పళ్ళున్నచోటకి చేరిపోయాడు. మామీదమాకు భలే గర్వమేసింది. భలే ట్రెయినింగ్ ఇచ్చామురా అని. గేటు దగ్గర, గోడమీద మన వేగులు అన్నీ క్లియర్గా ఉన్నాయని సంకేతమిచ్చారు.
ఆ పైన ఒక బ్రహ్మాండమయిన పచ్చరంగులో ఆరుకాయలు గుత్తు చూపించాను టింకుకి. మనోజుని అడిగాము — “ఎంతవరకు వచ్చారాయన” అని.

శంకరాయచ మయస్కరాయచ నమఃశివాయచ శివతరాయచ….

సగంపైన అయిపోయింది తొందరపడండన్నాడు. చిన్న ఈళవేసి “తొందరగారా” అని టింకూకి చెప్పాం, వాడు పాక్కుంటూ ఆ ఆరుకాయలున్న కొమ్మని విరిచేసాడు, కానీ వాడి ఊపుడులో బరువుకి అది ముల్లమధ్యకి పడిపోయింది. అయ్యో అని బుర్రపట్టుకున్నాం అందరం!

ద్రాపే అంధసస్పతే…

“తొందరగా! అయిపోవచ్చింది” అన్నాడు మనోజు. వెనక్కి తిరుగుతూ పక్కనున్న మరో రెండు చిన్న కాయలు కోసుకుని జేబులో కుక్కేసి పాక్కుంటూ దిగడం మొదలెట్టాడు.

త్ర్యంబకం యహామహేసుగంధిం…

“అయిపోయింది, తొందరగా” అని మా చిన్నపంతులు చెప్పేసరికీ గాబరాకి రెండో కొమ్మమీదనుంచీ దూకేసాడు. మాకు ఆ సౌండు ఏదో దీపావళికి లక్ష్మీ బాంబు పేలినట్టు వినిపించింది! అనిల్ గాడు వెంటనే తాతగారివైపు చూశాడు. కానీ బక్కెట్టెత్తి నెత్తిమీదనుంచీ నీళ్ళుపోసుకుంటున్నారాయాన “శంభో శంకర” అని. ఊపిరి పీల్చుకున్నాం. గభేలున గోడెక్కేసి ముల్లకంచెకి అటువయిపు దూకూశాడు టింకు. “వచ్చేయి, వచ్చేయి” అని ముగ్గురం పిలిచాం, “తాతగారొచ్చేస్తారు” అని. వరండాకి మామిడిచెట్టు పక్కనుంచే రావాలి మరి. కానీ మా టింకూగాడేం ఆశామాషీవాడు కాదు! ఎలాగోలా ముళ్ళమధ్యలోంచీ ఆరుకాయలున్న కొమ్మని పట్టుకుని కాలవ సందులోకి పడేశాడు. అది నేను తీసేసి అభయ్ సైకిల్ ముందున్న బుట్టలో పెట్టేశాను. దానిమీద గుడ్డకూడా కప్పేసాం. ప్లానింగలాంటిది మరి! పాక్కుంటూ మరో రెండు గీతలు గీకించుకుని టింకు బయటపడ్డాడు. “పద, పద పార్కులోకి వెళ్ళిపోదాం” అని సైలెంటుగా మేము పరిగెడుతుంటే,

ఓం నమో భగవతే రుద్రాయ …

అని మళ్ళీ వినిపించింది! అందరం స్లోమోషన్ లో మనోజు వైపు తిరిగాము. వాడొకసారి ఆలోచించి “ఒరేయి, ఇవాళ మాసశివరాత్రి, సోమవారం, అందుకని మరో సారి చదువుతున్నట్టున్నారు” అన్నాడు. టింకు వాడిని కొట్టినంతపనిచేశాడు! “ముందు చెప్పొద్దా పెద్ద పంతులన్నావు…”
“నాకెలా తెలుస్తుందిరా” అని కంట్లో నీళ్ళు పెట్టేసుకున్నాడు మనోజ్. “సర్లే పదండ”ని పార్కులోకెళ్ళి పంపుదగ్గర కడిగేసుకుని తలో కాయ తీసాం. ఇంట్లోంచీ అందరం ఉప్పు కారం పొట్లం కట్టుకొచ్చాం ముందే. అది తీసి ఎక్కడ అయిపోతాయో అని చిన్న చిన్న ముక్కలు కొరుక్కుంటూ తినేశాం. తిన్నంతసేపూ రుద్రం వినబడుతూనే ఉంది. మూడుసార్లు చదివారంట తాతగారు, మనోజ్ చెప్పాడు. ఎక్కువ కష్టపడినందుకు టింకుగాడికి ఒక కాయ ఎక్స్ట్రా.
ఆ సంవత్సరం మరో రెండుమూడుసార్లు ఇలా సెట్ చేశాం. మాకు కోటాకింద తలా ఒకటో రెండూ పళ్ళుమాత్రమే వచ్చాయాసంవత్సరం.
ఆ తరువాత చాలారోజులు మాకు ఎక్కడ రుద్రం వినబడినా ఆ మామిడిపళ్ళే గుర్తొచ్చేవి.

ఆ టేస్టలాంటిది మరి!😍🥭

మిగితా కధలు..https://medium.com/kauphy

--

--

Aditya
Kauphy
Editor for

Coffee drinker, Semi retired, Sits on the beach thinking about the mountains. Have too many half-written drafts on my blog 🤦🏻‍♂️