6. కుంబ్లే ఆవు

Aditya
Kauphy
Published in
4 min readJun 20, 2020

చిన్నప్పుడు బిగ్ ఫన్ అనే బబ్బులుగమ్ము వాడు ప్రతీ బబ్బులుగమ్ము కవర్ లోపల ఒక చిన్న పోస్టర్ పెట్టి దానిమీద స్కోరు వేసేవాడు. ఆ రన్స్ కలక్ట్ చేసి ఏదో ఓ గిఫ్టుకి ఎక్స్చేంజి చేసుకోవచ్చు. వాడు మంచి ఆఫర్లు పెట్టేప్పుడు అలాగ ఆవులలాగ నవులుతూనే ఉండేవాళ్ళం!

ఓసారి వాడొక ఆఫర్ పెట్టాడు. వంద రన్స్ కి బౌలింగ్ బ్యాటింగ్ చార్టులు, ఐదొందల రన్స్ కి కొత్త బ్యాట్, అలాగ. మాకీ వార్త తెలిసినప్పటికి మరో మూడురోజులే ఉంది ఆఫర్ అయిపోడానికి. స్కూలు ఎదురుకుండా హుస్సేన్ కొట్టుండేది. అక్కడికి వెళ్ళి వాడిని బ్రతిమాలి అప్పుగా ఓ పది బబ్బులుగమ్ములు తీసుకుని ఇంటివరకూ నమిలాము. మొత్తం కలిపి పదహారు రన్స్ మాత్రమే వచ్చాయి. ఇంట్లో కిడ్డీ బ్యాంకులు పగలకొట్టి, అమ్మలని అడుక్కుని మూడురోజులు దవడలు వాచిపోయేలాగ నమిలీనమిలీ మొత్తానికి వంద రన్స్ సంపాదించాం. హుస్సేన్ మా రన్స్ తీసుకుని సేల్స్ వాడు వచ్చినప్పుడు వాడికిచ్చాడు. ఓ వారం రోజుల తరువాత మాకు థలథలలాడే బౌలింగు చార్టు ఇచ్చాడాయన. ఆ బౌలింగ్ చార్ట్ చూడంగానే మాలో దెబ్బతిన్న పులి నిద్రలేచింది!

సారీ! మీకు ఫ్లాష్ బ్యాక్ చెప్పలేదు కదూ……. (రింగులు తిప్పుతూ….)

క్రికెట్ అంటే అందరిలాగే మాకూ పిచ్చి. ఒకటే బ్యాటుండేది, రన్నర్ కి తాడిమట్ట. అప్పుడప్పుడూ అభయ్ చిన్నప్పటి ప్లాస్టిక్ బ్యాటొకటి తెచ్చేవాడు. ఒంగొని దాన్ని క్రీస్ లో పెట్టి పరిగెత్తేవాళ్ళం. ఆడుతున్నప్పుడు వాకింగుచేసే ఆంటీలకీ తగలకూడదు, ప్రపంచశాంతి కోసం స్టేజీదగ్గర కూర్చుని చర్చిస్తున్న అంకుల్లకీ తగలకూడదు! ఆంటీలైతే తిట్టి బాలిచ్చేస్తారు. అంకుల్లు బాల్ పట్టుకుని క్లాసు పీకుతారు. ఓ ఇద్దరు తాతగార్లుండేవారు. వాళ్ళకి తగిలితే అంతే సంగతులు!! అహ నా పెళ్ళంట సినిమాలో నూతన్ ప్రసాద్ లాగ మూడు తరాల కథ చెప్పేవారు! ఒక్కోసారి బాలు రేపుతీసుకోవచ్చులే అని ఆటకట్టేసి వెళ్ళిపోయేవాళ్ళం! ఇంకేంటి మాకు క్రికెట్టొచ్చేది? ఈ కంగాళీలు లేకపోతే గంగూళీలు అయిపోయేవాళ్ళం!

మా కాలనీ పేరు ఓజీ నగర్. ఆ పేరెందుకొచ్చిందో మరో కథలో చెప్పుకుందాం. మాకు రెండు సందులవతల గాంధీనగర్ ఉంది. వాళ్ళ పార్కులో స్టేజీలవీ లేవు. మొత్తమంతా క్రికెట్ గ్రౌండే! మధ్యలో ఒక పిచ్ లాంటిది కూడా తయ్యారుచేసుకున్నారు. మాలాగ గోడమీద గీతలు, నాలుగు ఇటుకలు, తుప్పుపట్టిన ఇనప కుర్చీ లాంటివి కాకుండా నిజంగా ఇటు మూడు, అటు మూడు వికెట్లుండేవి! బెయిల్స్ కూడాను!! బ్యాట్స్మాన్ కి, రన్నర్ కి ఇద్దరికీ బ్యాటులు ఉండేవి. వాళ్ళు మాతో నమీబియా టూరెళ్ళిన ఆస్ట్రేలియాలా ప్రవర్తించేవాళ్ళు!

మ్యాచీలు టీవీలో చూసినప్పుడు ‘అరెరె, వాడు లెఫ్ట్ హ్యాండ్ కాకుండా రైట్ హ్యాండుతో విసిరుంటే రన్నవుటయ్యుండేది, అరౌండ్ ద వికెట్ బౌలింగేస్తే బాగుండేద’ని మరుసటిరోజు స్కూళ్ళో మంజ్రేకర్ కామెంట్రీలాగ చెప్పుకునేవాళ్ళం.
ఆ గాంధీనగర్ బ్యాచిదీ మాస్కూలే. ఓరోజు మా ఈ అనాలిసిస్ విని ‘ఇంత క్రికెట్ వచ్చు కదా మీకు, మాతో ఆడండి సండే’ అన్నారు.
జీవితంలో మొదటిసారి మమ్మల్ని మ్యాచి ఆడడానికి పిలిచారెవరైనా! ఆరోజు మాకుఅవధుల్లేని ఆనందం!! సై అన్నాం. ‘మీ గ్రౌండుకి సండే ఏడింటికొచ్చేస్తాం’ అని.

మరుసటిరోజు రెండో శనివారం. శెలవు. ఉదయం ఐదుగంటలకి వాకింగ్ ఆంటీలతోపాటు మేమూ పార్కులోకెళ్ళిపోయాం ప్రాక్టీసుకి. నేనూ, బబ్లూ, అభయ్, అనిల్, మనోజ్, షాజు, ఒక చెక్క బ్యాటు, ఒక ప్లాస్టిక్ బ్యాటు, ఒక టెన్నిస్ బాలు, ఒక కుర్చీ.
మూడుగంటలు ప్రాక్టీసు చేశాక బెంచిమీద కూర్చుని స్ట్రాటెజీ వెయ్యడం మొదలెట్టాం. ఎవరు ఓపెనింగెళ్ళాలి, ఎవరు బౌలరు, కీపింగెవరు అని. మాకర్ధమయిన విషయమేంటంటే ఎవరూ స్పిన్నర్లు లేరు మా టీములో. అనిల్ గాడి నాన్నగారు ఒకప్పటి క్రికెట్ ప్లేయర్ అని చెప్పాడు వాడు.

‘డాడీని అడిగి మంచి స్పిన్నులు నేర్చుకొస్తా సాయంత్రం’ అన్నాడు.

నాలుగింటికి మళ్ళీ అందరం కలిసాం. ముందుగా మాకు స్పిన్ అంటే ఏంటని వాళ్ళ నాన్నగారు చెప్పిన క్లాసంతా వినిపించాడు అనిల్! ఆఫ్ స్పిన్ అంటే వేళ్ళెలా ఉండాలి, లెగ్ స్పిన్ అంటే ఏంటి, గూగ్లీ ఎలా వెయ్యాలి, అన్నీ థియరీ చెప్పాడు. మీరటు నించోండి అని వాడు వెన్నక్కెళ్ళి స్పిన్నుతో విసిరాడు. లగాన్ సినిమాలో కచరా లాగ ఇటుపడి నిజంగానే అటువెళ్ళింది! అయితే విసిరితే సరిపోదు కదా.. బౌలింగ్ చెయ్యాలి.. డాడీ నేర్పిన స్పిన్నులతో అనిల్ బౌలింగందుకున్నాడు. వాడు పాల్ ఆడంస్ లాగ ఇటుతిరిగి అటుతిరిగి బుర్రవంచి ఎక్కడికేస్తున్నాడో చూడకుండా వేశాడు బాలు. అది ఆపక్కన వాకింగ్ చేస్తున్న సత్యవతి గారికి తగిలింది!

ఆవిడ మమ్మల్ని తిట్టేలోపే బబ్లూవెళ్ళి ‘ఆంటీ రేపు మాకు గాంధీనగర్ టీం తో మ్యాచ్. ఆశీర్వదించండి’ అన్నాడు.

‘ఆల్ ద బెస్ట్! గెలవాలి రేపు’ అని ఆవిడ తిట్టడం మరచిపోయారు.

‘ఒరేయ్ ఏంటీ బౌలింగు? విక్కెట్టెక్కడుంది, నువ్వెక్కడికేశావు’??

‘సారీ, డాడీ చెప్పిన స్పిన్ కదా, కొంచం ప్రాక్టీసు చెయ్యాలి, అలవాటయిపోతుందిలే’ అన్నాడు.

పాలు పొయ్యడానికి ఆవునుతోలుకొచ్చిన సత్తి గోడమీంచీ చూస్తున్నాడు మా ప్రాక్టీసుని. లగాన్ సినిమాలోలా ఫీలయిపోయాము మేము. కచరా లా స్పిన్నువెయ్యడానికి అనిల్ ఉన్నాడు. వేరే ఏరియానుంచీ సర్దార్జీ లాగ సత్తి వచ్చాడు, ఛలే ఛలో!

మరుసటిరోజు మ్యాచికి వెళ్ళాం. టీములా ఉండాలని వైట్ బట్టలు, స్కూల్ ఫ్రైడే షూసు, టోపీలు, ఆర్భాటానికేం లోటులేదు మాకు. టీముకి ఆరుగురు. సింగిల్ బ్యాటింగు లేదు. అవి రూల్స్. గాంధీనగర్ టీం అయితే పేర్లతో చొక్కాలుకూడా వేయించుకున్నారు! గ్రౌండులోకి వెళ్ళంగానే మనోజు వక్రతుండ మహాకాయ చదివాడు. గ్రౌండుకు దండంపెట్టుకుని లోపకికెళ్ళాం.

ఓ గంటన్నర తరువాత బయటకొచ్చి వెనక్కి తిరగకుండా మా పార్కుకెళ్ళిపోయాం.

‘వాళ్ళది హోం పిచ్ ఎడ్వాంటేజి రా’…
‘కొత్త బాలు కదా, స్పిన్ను తిరగలేదు’…
‘వాళ్ళ బ్యాటులు బరువుగా ఉన్నాయి’…
‘పిచ్ మీద పరుగెత్తడం అలవాటులేదు కదా’….

ఫ్లాష్ బ్యాక్ సమాప్తం. దెబ్బతిన్న పులి లేచిన సమయం……..

బ్యాగులు ఇంట్లో పడేసి ఆ బౌలింగ్ చార్టు పట్టుకుని పార్కుకి వెళ్ళిపోయాం. చార్టులో పేస్ బౌలింగ్ ఎలా వెయ్యాలి, సీం పొజీషన్ అంటే ఏంటి, రకరకాల స్పిన్నులకి బాల్ పట్టుకునే టెక్నిక్లు, అబ్బో… శ్రీనాథ్ కూడా ఈ చార్టు చూశే బౌలింగ్ నేర్చుకున్నాడని క్రింద ఆయన బొమ్మ కూడా వేశారు!
గత సారి ఆడినప్పుడు డాడి చెప్పిన స్పిన్నులు అని అనిల్ వేసిన బౌలింగుని వాళ్ళు మామూలుగా కొట్టలేదు! ఈసారి వాళ్ళని కుదేలు చెయ్యాలని ఫిక్సయ్యి చార్టుని జాగ్రత్తగా పిట్టగోడమీద పరచి ఎగిరిపోకుండా రాళ్ళు పెట్టాం. అప్పుడే సత్తి వచ్చాడు ఆవుతో. ఒరేయ్, చార్టు ఎగిరిపోకుండా చూడు అని వాడికి చెప్పి ఒక్కొక్క స్పిన్ను చూసి తలాఓఓవరూ అందరం బౌలింగ్ వేస్తున్నాం.

ఓ గంటయ్యేసరికీ అందరం అక్రంలు యూనిస్లు ఖాన్లు అయిపోయాం.

‘రేపు స్కూళ్ళో గాంధీనగర్ గాళ్ళని మనం చేద్దామురా ఛాలెంజ్! వాళ్ళకి మతి పోవాలి’ అనుకుంటూ రివిజన్ కోసం మళ్ళీ చార్టు చూద్దామని గోడదగ్గరకు వెళ్ళాం.

చార్టు లేదు.

ఎక్కడికిపోయిందా అని వెతికాం. రెండు వైపులా కింద లేదు. సత్తి ఎదురింట్లో పాలుపోసి వస్తున్నాడు.

‘సత్తీ, మా చార్టేది’ అనడిగాం.

‘ఐదు నిముషాల క్రితం గోడమీదే ఉందే… ఇప్పుడే పాలు తీసి ఆవుని కట్టి ఇంట్లో పొయ్యడానికెళ్ళాను’ అన్నాడు.

చార్టెక్కడికి పోతుంది ఐదునిముషాలలో అని ఆవువైపు చూశాం. చిన్న కాగితం ముక్క మిగిలింగి దాని నోట్లో. మావైపు చూసి తీరికగా నములుతోంది……

కొన్నాళ్ళకి సత్తిని క్షమించేసాం. మా క్రికెట్టూ పెద్దగా బాగుపడలేదు, మేమా గాంధీనగర్ వాళ్ళని ఛాలెంజూ చెయ్యలేదు. షాజు దగ్గర ఫుట్బాల్ ఉండేసరికి అసలు గేమే మార్చేశాం కొన్నాళ్ళు.
బౌలింగ్ పూర్తిగా జీర్ణించేసుకుంది కాబట్టి ఆరోజు నుంచీ ఆవు పేరు మాత్రం కుంబ్లే ఆవు అయిపోయింది. సత్తీవాళ్ళ ఇంట్లోకూడా ‘కుంబ్లేకి గడ్డేశారా’ అనే అడిగేవారంట.

మిగితా కధలు..https://medium.com/kauphy

--

--

Aditya
Kauphy
Editor for

Coffee drinker, Semi retired, Sits on the beach thinking about the mountains. Have too many half-written drafts on my blog 🤦🏻‍♂️