7. కొట్టి లేపాలి!

Aditya
Kauphy
Published in
4 min readSep 10, 2020

బబ్లూ గుర్తున్నాడా? అదే మన నంది పాడ్యమి కథలో వచ్చాడు, వాడే. వాళ్ళ బామ్మగారు కూడా గుర్తుండే ఉంటారుగా? మేము ఏడో క్లాసుకి వచ్చినప్పుడు వాళ్ళ బామ్మ బబ్లూకి పూజా విధి, ఓ నాలుగు స్తోత్రాలు, భగవద్గీత శ్లోకాలు నేర్పించాలని సంకల్పించింది.

ఓ ఆరు నెలలు వాడికి స్కూలవ్వంగానే బామ్మగారు ట్యూషన్ లాగ బెత్తం పుచ్చుకుని మరీ నేర్పించారు. వాడికీ బానే నోటికొచ్చేసాయి శ్లోకాలు. ఆ సంవత్సరం స్కూలులో శ్లోకాల కాంపిటిషన్ లో ప్రైజు కూడా వచ్చింది వాడికి! వాళ్ళ బామ్మగారు ఆ విషయం ఇద్దరికే చెప్పారు — అడిగిన వాళ్ళకి, అడగని వాళ్ళకి.
“ఏమిటి మీ వాడికి లింగాష్టకం కూడా రాదా?? మా బబ్లూకయితే కాలభైరవాష్టకం కూడా నోటికొచ్చు”.

బామ్మగారి చిన్న కొడుకు వేరే ఊళ్ళో ఉంటారు. వాళ్ళకి మొన్ననే కూతురు పుట్టిందంట. సహాయానికని ఓ నాలుగునెళ్ళు బామ్మగారు అక్కడికి వెళ్ళారు. వెళ్తూ బబ్లూకి రూలు పెట్టారు — “రోజూ నేను నేర్పించినట్టుగా పూజ చెయ్యాలి. మీ అమ్మని ఫోనులో అడుగుతాను”.

ఆ సంవత్సరం హాఫ్ యియర్లీ పరీక్షలలో ఎప్పుడూ ఫస్టొచ్చే అనిల్ కన్నా బబ్లూకి ఓవరాల్ గా మూడు మార్కులు ఎక్కువొచ్చేశాయి. మరిహ బబ్లూ ఆనందానికి హద్దులు లేవు. వాడికో కుక్కుంది, గాడ్జిల్లా దాని పేరు. ఆ కుక్కకి ట్రెయినింగ్ ఇచ్చి మరి ఊల పెట్టడం చిన్నప్పుడే నేర్పేశాడు వాడు. దాన్ని పట్టుకుని కాలనీ లో అన్ని సందులలోనీ తిరిగాడు సైకిల్ బెల్లు మ్రోగించుకుంటూ. పక్కనే గాడ్జిల్లా కూడా “ఔ……” అని అరుపులు పెడుతూ. ఎవరయినా బయటకొచ్చి ఎందుకురా గోల చేస్తున్నావు అనడిగితే “నాకు పరీక్షలలో ఫస్టొచ్చింది” అని మరో నాలుగిళ్ళకి వినబడేలా చెప్పడం మొదలెట్టాడు. మేమందరం ఎలానో ఎప్పుడూ ఫస్టు రాలేదు కాబట్టీ మాకు పర్లేదు. అనిల్ గాడికి మాత్రం ఇంట్లో వాయగొట్టేశారు. ఫస్టు రాకపోవడం కన్నా ఎప్పుడూ అల్లరిచేస్తూ తిరిగే బబ్లూకి ఫస్టొచ్చిందని వాళ్ళ బాధ.

ఓ రోజు వాకింగులో వాళ్ళమ్మగారొచ్చి బబ్లూ వాళ్ళ అమ్మని అడిగారు, “మీ వాడు ఈసారి అదరగొట్టేశాడుగా! బాగా కష్టపడ్డాడా” అని. “ఏమీ లేదండీ, మామూలు గానే చదివాడు, దేవుడి అనుగ్రహం అంతే” అన్నారు. అదేంటని అడిగితే బామ్మగారు బబ్లూకి పూజలు చెయ్యడం నేర్పడం, వాడు రోజూ ఆవిడ చెప్పినట్టు పూజ చేసి స్కూలుకెళ్ళడం గురించి చెప్పారు వాళ్ళమ్మ. అంతే! ఆవిడ మా అమ్మలందరికీ ఈ విషయం చెప్పేశారు.

మా అమ్మ రాత్రి భోజనం చేస్తున్నప్పుడు మా నాన్నకి చెప్పింది “ఇదుగో ఏదొ గుడుగుడుగుడు శాంతిః అని హడావుడిగా విభూతీ రాసుకుని ఆఫీసుకు పరుగెత్తడం కాదు. బబ్లూకి పరిక్షలలో ఫస్టొచ్చింది. ఫైనల్ ఎగ్జాంస్ లో మనవాడికి కూడా రావాలి. వాడికి వాళ్ళ బామ్మ నేర్పినట్టు మీరు వీడికి నేర్పండి” అంది. తింటున్న ముద్ద గొంతులో ఆగిపోయింది నాన్నకి.

అందరిల్లళ్ళోనూ ఇదే కథ. నాన్నల దగ్గరా, అమ్మల దగ్గరా ఎందుకని మేమే ఓ మాటనేసుకుని ఇంట్లో చెప్పేశాం — “బబ్లూ చేసిన పూజ మాత్రమే వర్కవుట్ అవుతుంది పరీక్షలకి. మీరు చెప్పేవి దేవుడికి నచ్చకపోతేనో? మంచిమనసుతో బబ్లూ మాకందరికీ వాడి స్పెషల్ పూజ నేర్పుతానన్నాడు. ప్రసాదం కోసం రోజుకో రకం స్వీటు పట్టుకువెళ్తే చాలంట”. ఆ రోజు నుంచీ పదిహేను రోజులు ప్రోగ్రాము. ఒక రోజు సున్నుండలు, ఒక రోజు హల్వా, మరో రోజు బాదం పాలు, అన్నీ దేవుడికే!

బబ్లూ మాకు లిస్టు రాసిచ్చాడు. ముందు ఆసనం వేసుకోవాలి. తరువాత దేవుడి గూడు తలుపు తియ్యాలి, అలా… వాళ్ళ గూటిలో శ్రీరామ పట్టాభిషేకం పటం ఉంది. తలుపు తియ్యంగానే ముందు ఆ ఫొటోని జాగ్రత్తగా పట్టుకుని రెండు సార్లు ఠకీ ఠకీ మని కింద కొట్టేవాడు. అదేంటి అని అడిగితే “బామ్మ ఇలానే చెప్పింది, ముందు ఫొటో రెండు సార్లు కొడితే దేవుడు నిద్ర లేస్తాడు, మన పూజ వింటాడు. ఈ కిటుకు తెలుసు కాబట్టే నాకు ఫస్టొచ్చింది, నీకు మూడు మార్కులు తక్కొవొచ్చాయి” అని అనిల్ వైపు చూసి రాజనాల నవ్వోటి నవ్వాడు.పూజావిధి బబ్లూకి నేర్పినప్పుడు వాళ్ళ బామ్మగారు ఓ పుస్తకంలో అన్నీ రాసిచ్చారు. జ్వరం తరువాత స్కూలుకి వెళితే నోట్సులు హడావుడిగా కాపీ చేసుకున్నట్టు మేమందరం కొత్త పుస్తకాలలో పూజా విధి ఎక్కించేసుకున్నాం. బబ్లూ ఊరికే ఉండడు కదా? ప్రతీ స్టెప్పుకీ మాకు ఎక్స్ప్లనేషన్ చెప్పి అది కూడా రాయించాడు. వాడో గొప్ప టీచర్! తివాచీ మూడు సార్లు దులపాలి, అగరొత్తు బూడిద పోవడానికి నాలుగు సార్లు కళ్ళుమూసుకుని ఊదాలి, పటం రెండు సార్లు ఠకీ ఠకీ మని కొట్టాలి, ప్రసాదం నివేదనం అవ్వంగానే ఒక్క గుటకలో లాగించేయాలి…..

పదిహేను రోజుల తరువాత మా అందరికీ థియరీ, ప్రాక్టికల్ పరీక్షలు కూడా నిర్వహించి, మమ్మల్ని పాసు చేశాడు. ఆ ముందురోజే వాళ్ళ బామ్మగారు కూడా ఊరునించీ వచ్చేసి గొప్ప ముచ్చట పడిపోయారు మమ్మల్నందరినీ చూసి.
ఇహ మరుసటి రోజు నుంచీ మేమూ వాడిలాగే పూజ చెయ్యడానికి డిసైడయ్యాం. మా అమ్మానాన్నలకి విపరీతమయిన పుత్రోత్సాహం ఆ రోజు! మా ఇంట్లో సత్యనారాయణ స్వామి పటం ఉంది. పూజప్పుడు దాన్నో రెండు సార్లు ఠకీ ఠకీ కొట్టాను.

“ఏంటిరా అది” అని పరిగెత్తుకొచ్చింది మా అమ్మ గరిట చేతితో పట్టుకుని.

“స్వామివారిని నిద్రలేపుతున్నానమ్మా” అన్నాను. “ఒరేయ్, నిద్ర లేపడం ఏంటి నీ బొంద, ఆయన కుంభకర్ణుడు కాదు; అలా కొట్టేస్తే అద్దం పగిలిపోదూ” అంది!!

“దీనివళ్ళే బబ్లూకి ఫస్టొచ్చింది” అని చెప్పాను.

అనిల్ వాళ్ళ ఇంటి పూజా మందిరంలో హరిద్వార్ నుంచీ తెచ్చిన స్ఫటిక లింగం ఉంది. వాడు దాన్ని ఠకీ ఠకీ మని రెండు సార్లు కొట్టాడు. వాడి అమ్మ నాన్న ఒకేసారి అరచిన అరుపుకి ఏంటని అడగడానికి పైపోర్షన్ వాళ్ళు దిగొచ్చేసారు.

“బబ్లూ రెండు సార్లు కొట్టమన్నాడు” అని వాడూ చెప్పాడు. వాళ్ళ అమ్మ వెంటనే వాడిని వెంటపెట్టుకుని మా ఇంటికొచ్చింది. మా అమ్మ కూడా ఇదేం బేతాళ పూజో కనుక్కుందాం పద అని నన్ను పట్టుకుని బబ్లూ ఇంటికి బయలుదేరింది. బామ్మగారు పూలు కోసుకుంటున్నారు. మమ్మల్ని చూసి బబ్లూ, వాళ్ళ అమ్మ గారు కూడా బయటకొచ్చారు.

“ఏంటండి మీ వాళ్ళ పూజ చూసి ఆనందిచారా” అనడిగింది బామ్మ.

“ఆనందించడం ఏంటి, అరిదిపడితేను” అంది మా అమ్మ. “పటాలని రెండు సార్లు నేలకేసి కొట్టడం ఏంటి, ఇదెక్కడి ఆచారం? శోడశోపచారాలలో లేని కొత్త ప్రక్రియ ఇది. పటం పగిలిపోతేనో?”

“మాఇంట్లో అయితే గంగొడ్డున ఎవరో గొప్ప స్వామీజీ ఇచ్చిన స్ఫటిక లింగం ఉంది, దానికేమయినా……” అని లెంపలేసుకుంది అనిల్ వాళ్ళ అమ్మగారు. నేలకేసి కొట్టడం ఏంటి అని అడిగింది బబ్లూని వాళ్ళ అమ్మ.

“అవునమ్మా, బామ్మ పూజ నేర్పినప్పుడు నాకు అలానే నేర్పింది” అన్నాడు బబ్లూ.
అందరం స్లోమోషన్ లో బామ్మ వైపు తిరిగాము.
పటం కింద కొట్టడం ఏంటిరా అనావిడంటే నువ్వలానే నేర్పించావు అన్నాడు బబ్లూ. కొంచం ఆలోచించిందావిడ.

“నీ మొహం, ఓ ముదరాష్టపు బల్లి పిల్లల్ని పెట్టింది దేవుడి గూడు వెనకాతల. అందులో ఓ బల్లిపిల్ల ఎప్పుడూ రాముడు పటం వెనకాలే ఉండేది. త్రేతాయుగం లో వానర మూకలో అదీ ఉంటుంటుంది. నువ్వు భయపడతావని ఠకీ ఠకీ మని రెండు సార్లు కొట్టి అప్పుడు పటాలు తుడవడానికి తీసేదాన్ని. అంతే కానీ పటాలని, విగ్రహాలని, లింగాలనీ విరిగిపోయేలాగ బాదెయ్యమని కాదు” అని వాడికో టెంకిజల్ల కొట్టింది.

అందరం అలాగ బబ్లూ వైపు తిరిగాము. హిహిహి అని చిన్న నవ్వు నవ్వి బుర్ర గోక్కున్నాడు.
“చేస్తే సరిగ్గా చెయ్యండి, లేకపోతే లేదు. బొమ్మలు విరిగిపోతే అరిష్టం” అంది మా అమ్మ ఇంటికెళ్ళాక.

సాయంత్రం పార్కులో బబ్లూ చెప్పాడు “ఈ పెద్దోళ్ళకి తెలీదు. మామూలుగా అందరూ పూజ చేస్తారు. నాకే ఎందుకు ఫస్టొచ్చింది? పాటలతో దేవుడు లేచే కాలం అయిపోయింది. ఇప్పుడిలా పటాన్ని కొట్టి లేపాలి” అన్నాడు.

నిజమే! ఈ లాజిక్కు మా పెద్దోళ్ళు మిస్సయ్యారు.
మరుసటి రోజునుంచీ నేనూ అనిల్ పూజ కంటిన్యూ చేశాం. కానీ బబ్లూ ఫార్ములా ప్రకారం దేవుడిని లేపడానికి చిన్నగా పటాన్ని తట్టేవాళ్ళం ఇంట్లో వాళ్ళకి వినబడకుండా.
ఠకీ ఠకీ కాకుండా టకి టకి అన్నమాట.
ఓ వారానికి పూజలో స్పీడు పెరిగిపోయింది. గుడు గుడు శాంతిః స్థాయికి వచ్చేశాం. మరో వారానికి పూజ ప్రక్రియని అమ్మకి ఔట్ సోర్స్ చేసేశాం.

ప్రసాదం మాత్రం మాకు.

_______________________________

మిగితా కధలు..https://medium.com/kauphy

--

--

Aditya
Kauphy
Editor for

Coffee drinker, Semi retired, Sits on the beach thinking about the mountains. Have too many half-written drafts on my blog 🤦🏻‍♂️