Aditya
Kauphy
Published in
3 min readMay 9, 2020

--

4. గులేబకావళి పూలు

ఎనిమిదో క్లాసులో షాజు అని ఓ ఫ్రెండుండేవాడు. మళయాళి. పూర్తి పేరు షాజు జోస్ అబ్రహం కైపన్ప్లాకల్. ఆ స్పెలింగు నేర్చుకోడానికే మాకు సగం సంవత్సరం పట్టింది. క్లాసుకి కొత్త టీచర్ వస్తే భలే ఉండేది అటెండన్సప్పుడు! వాళ్ళ నాన్నగారు ఫెడరల్ బ్యాంకు ఆఫీసర్. ట్రాన్స్ఫర్ మీద ఇక్కడికొచ్చారు.

మేమందరం పగలూ రాత్రీ క్రికెట్టాడుతూంటే వాడు ఫుట్బాల్ పట్టుకుని పార్కుకొచ్చేవాడు. మొదట్లో నవ్వేవాళ్ళం — ఫుట్బాలేంటిరా అని. లగాన్ సినిమాలో పల్లెటూరోళ్ళలాగ రూల్సన్నీ నేర్చుకుని ఆడేమనుకోండి....

అయితే ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది షాజు వాళ్ళ అమ్మగారి గురించి. లైఫ్ లో మొదటిసారి , ‘పద్ధతి’ అనే పదానికి అర్ధం ఆవిడ దగ్గర చూశాం. అంటే మేము కూడా కొద్దోగొప్పో నీటుగానే ఉండేవాళ్ళమనుకోండి, కానీ ఆవిడ భయంకరం! షాజు గాడు ఎప్పుడూ ఇస్తిరీ చేసిన బట్టలు మాత్రమే వేసుకొచ్చేవాడు. కనీసం ఆడుకోడానికి కూడా ఇస్తిరీ లేని బట్టలలో వాడిని మేమెప్పుడూ చూడలేదు. షూస్ లేకుండా ఇంటి బయటకు వచ్చేవాడే కాదు. స్కూలు యూనీఫార్మ్ మెడ దగ్గర పైబటన్ ఎప్పుడూ పెట్టుకునే వచ్చేవాడు. ఎంత ఎండాకాలం అయినా, క్లాసులో ఫ్యాన్ తిరగకపోయినా ఆ గుండీ మాత్రం తీసేవాడుకాదు. బ్రేకు పీరియడ్ లో మేము చొక్కాలు చింపేసుకుని, జుట్టు రేపేసుకుని మట్టిలో దొర్లుతున్నాకూడా వాడు నీటుగా టక్కుతోనే ఉండేవాడు!

వాళ్ళ ఇల్లుకూడా ఓ హోటల్ లాగ మైంటైన్ చేసేవారు ఆంటి. అంటే మనింటికి బాగా డబ్బున్న చుట్టాలొచ్చినప్పుడు అమ్మ ఇళ్ళంతా మనచేత దులిపించి, లోపలినుంచీ మంచి ఇస్తిరీ దుప్పట్లుతీసి పరిచి, పెళ్ళికి గిఫ్టొచ్చిన కాస్ట్లీ కప్పులసెట్టు తీసి, ర్యాకులో మంచి పుస్తకాలు మాత్రమే కనబడేలా సర్ది…. వాళ్ళిల్లు ఎప్పుడూ అలానే ఉండేది! ఇల్లు చిన్నదే, లోపల మాత్రం కార్పెట్టు, ఛాండెలియరు, అద్భుతమయిన పుస్తకాల ర్యాకు, పింగానీ కప్పులు, డిమ్ము లైటింగు, తెల్ల టేబుల్ క్లాతు, కప్పుల కింద కోస్టర్లు, ఏది తెచ్చినా కింద ట్రే కంపల్సరీ, బయట మొక్కలు, మొత్తం గోడంతా పాకేసిన మనీప్లాంటు, ఆవిడే గీసి ఫ్రేము కట్టించిన బొమ్మలు, క్రాఫ్టులు, గ్లాసు పెయింటింగులు…. ఒక మూల జెరుసలేంలో జీసస్ పుట్టిన దృశ్యం మొత్తం పర్మనెంటుగా ఇంట్లో కట్టేసారు — మట్టి, కాటన్, గడ్డీ, లైట్లు వాడి. (రాత్రంతా అందులో లైటు వెలుగుతూనే ఉంటుందట!)

అవకాశం వస్తే వాడి ఇంట్లోకి వెళ్ళడానికి చూసేవాళ్ళం — కొత్తగా ఏమి పెట్టారో అని! ఆడుకునేటప్పుడు మంచినీళ్ళు కావాలని దూరమయినా అక్కడికి వెళ్ళి అడిగేవాళ్ళం. గ్రౌండు పక్కనున్న అనిల్ గాడి ఇంటికెళ్తే ఉత్తి నీళ్ళొచ్చేవి, నాలుగు తిట్లుకూడా పడేవి “ఇంకా ఎంతసేపురా” అని! అదే షాజు వాళ్ళింట్లోంచైతే నీళ్ళడిగితే రస్నా వచ్చేది మరి! అదీ కాక ఒక ప్లేటులో పసుపు రంగులో ప్రపంచంలోకళ్ళా గొప్ప చిప్స్ వచ్చేవి! అసలు అరటికాయతో చిప్స్ చెయ్యొచ్చని ఐడియా వచ్చినవాడికి నోబుల్ బహుమతి ఇవ్వాలి వెంటనే. ఆ ఉప్పుడు టేస్టు నాలుకమీద ఉన్నంతసేపూ మైమరుపే! ఎక్కడయిపోతాయో అని మెల్లగా చప్పరించి తినేవాళ్ళం. కానీ పక్కోడు మనకన్నా ఎక్కడ లాగించేస్తాడా అని అదో టెన్షను!

షాజు పుట్టినరోజు క్రిస్ట్మస్ కి మూడురోజుల తరువాత. అయితే చిన్నప్పటినుంచీ రెండూ కలిపేసి ఒకేరోజు జరిపేవారట. ఆ సంవత్సరం పర్టీకి మమ్మల్ని కూడా పిలిచారు. మామూలుగా కాదు, ఓ అందమైన డెకరేషన్లున్న లెటర్ ప్రింటుతీసి ఎన్వలప్ లో పెట్టి మరీ పిలిచాడు! ఆ కవరు చాలారోజులు దాచుకున్నాం. షాజు వాళ్ళింటికని మా అమ్మలు మమ్మల్నందరినీ నీటుగా తయ్యారుచేసి, పాపిడితీసి దువ్వి, షూసేసిమరీ పంపించారు. అందరం తలో పెద్ద గిఫ్టూ ప్యాకింగుచేసి తెచ్చాం. అప్పట్లో ఎవరిది పెద్ద పెట్టైతే వాడిదే గొప్ప గిఫ్టు మరి! మామూలుగానే క్షణక్షణం సినిమాలో ‘ఐబాబోయి గదా ఇది, స్వర్గమేమో కదా ఇది’ అన్నట్టుంటుంది వాళ్ళిళ్ళు. క్రిస్ట్మస్, ఒకే కొడుకు పుట్టినరోజు అనేసరికీ మరీ డెకరేట్ చేసేశారు! సోఫా కవర్లు కూడా కొత్తవేసి, ఎక్కడచూసినా సీరియల్ లైట్లుపెట్టి, ఓ అద్భుతమయిన రెండంతస్థుల కేకు చేయించి, అసలు భీబత్సం! కేకు, కేరళ చిప్సు, సమోసా, కూల్ డ్రింక్సు (రస్నా కాదు, నిజమైనవి), మ్యూజికల్ చెయిర్సు, హౌసీ, గొప్ప సందడయ్యింది!

మూడేసి గ్లాసుల కూల్ డ్రింకులు లాగించేశాం, ట్యాంకు ఫుల్లయిపోయింది. షాజు గాడిని పక్కకి పిలిచి చిటికినవేలు చూపించి ఒరేయ్ ఎక్కడ అని అడిగాడు అభయ్. షాజు తీసుకెళ్ళాడు. వాడో నిమిషం తరువాత వెనక్కొచ్చి ఒరేయ్ బయటకిరండి అని మమ్మల్ని తీసుకెళ్ళి జేబులోంచీ ఓ బ్రౌను రంగు పువ్వు లాంటిది చూపించాడు. “ఇవేవో బాత్రూం లో గిన్నెలో పెట్టారురా, వాసన చూడండి” అన్నడు. భలే వాసన! ఇది పువ్వు లాగ మెత్తగాలేదు, ఈ వాసన ఎప్పుడూ ఏ పువ్వుకి మేము చూడలేదు, అందరం లోపలిదాకా పీల్చుకుని వాసన చూసేశాం! మనోజు వాళ్ళ ఇంట్లో ఓ బామ్మగారున్నారు. ఎప్పుడూ పాత సినిమాలు చూసేవారు. వాడు చెప్పాడు — “అన్నయ్య, గులేబకావళి అని ఒక పువ్వుంది, దాని వాసన ఇలాగే ఉంటుంది” అని. “నువ్వెప్పుడు చూశావురా” అనడిగితే “వాసన చూడలేదు గానీ సినిమాలో చూపించినప్పుడు ఇలాగే ఉందా పువ్వు” అన్నాడు. వెంటనే లోపలికెళ్ళి ముందు నేను తరువాత అనిల్, మనోజ్, మరోసారి అభయ్, అందరం లైనులో బాత్రూంలోకి వెళ్లిపోయాం. తలో పువ్వు జేబులోపెట్టుకొచ్చేసాం, గిన్నె ఖాళీ! పార్టీ అయిపోయింది, ఇంటికెళ్ళిపోయాం, జేబులోంచి జాగ్రత్తగా తీసి స్కూలు బ్యాగులో పెట్టేశానది. ఓ నాల్రోజులు సూపర్ వాసనొచ్చింది బ్యాగంతా, అలా తగ్గిపోయింది. మమ్మల్ని మరుసటిరోజు అదోలా చూశాడు షాజు.

సంక్రాంతి సెలవులలో ఆడుకుంటున్నప్పుడు అభయ్ కి ఐడియా వచ్చి వాళ్ళ ఇంటిదగ్గర సైకిల్ ఆపి “ఒరేయ్ అర్జెంట్, ఒక్కసారి”… అన్నాడు. అలాగే అని లోపలికి తీసుకెళ్ళాడు షాజు. బాత్రూములో ఈ సారి గిన్నెలేదు, పువ్వులు లేవు.

చాలా ఏళ్ళతరువాత తెలిసింది ఇవి టాయిలెట్లలో మంచి వాసన కోసం ఉంచుతారని, వీటి పేరు గులేబకావళి పూలు కాదని, మేము వాళ్ళకి బాత్రూములో వాసనకోసం పెట్టిన పూలు, కలరా ఉండలు పట్టుకుపోయేవాళ్ళ లాగ కనిపించుంటామని 🤭

మిగితా కధలు..https://medium.com/kauphy

--

--

Aditya
Kauphy
Editor for

Coffee drinker, Semi retired, Sits on the beach thinking about the mountains. Have too many half-written drafts on my blog 🤦🏻‍♂️