5. నంది పాడ్యమి

Aditya
Kauphy
Published in
4 min readMay 30, 2020

కొన్నాళ్ళకి మా కాలనీకి బబ్లూ వచ్చాడు.

మా కాలనీ జీవితం రెండు భాగాలుగా చేస్తే బిబి, ఆబి అని విడగొట్టుకోవచ్చు. బిఫోర్ బబ్లూ, ఆఫ్టర్ బబ్లూ.
లేడీసందరికీ సత్యవతిగారు ఎలాగో మాకు బబ్లూ గాడు అలాగ. అప్పటినుంచీ మేము చేసిన రచ్చకి ఒక క్లాసుండేది. ‘అబ్బ, వీళ్ళేంటిరా ఇంత పద్ధతిగా అల్లరి చేస్తున్నారు’ అనిపించేంత!
బబ్లూ ఇంట్లో వాళ్ళ అమ్మ, నాన్నగారు, బామ్మ ఉండేవారు. గాడ్జిల్లా అనే నల్ల కుక్క కూడా ఉండేది.

మా కాలనీలో ముఖ్యమయిన పండుగ వినాయక చవితి. స్టేజీ మీద బొమ్మ పెట్టేవాళ్ళం. సత్యవతిగారి ఆర్గనైజేషన్ మొత్తం. కల్చరల్ ప్రోగ్రాములు, పాటలు, డాన్సులు (మావే), ఆటలు, లైటింగు, పార్కు మొత్తం ఒక పరస వాతావరణం వచ్చేసేది ఆ ఐదురోజులు.

ఓ సంవత్సరం బబ్లూకి ఓ ప్రశ్నొచ్చింది. ఎన్నో సంవత్సరాలుగా వినాయక చవితి జరుపుకుంటున్నారు కదా, అది ఎవరు మొదలుపెట్టారా అని! వాళ్ల బామ్మ ని అడిగాడు, ఆవిడ “శివుడు మొదలు పెట్టాడు” అంది. నాన్నని అడిగాడు, ఆయన “ఋషులు మొదలెట్టారు” అని చెప్పారు. వీళ్ళలో ఎవరు కరెక్ట్ అని అమ్మని అడిగితే “వ్రత కథ సరిగ్గా వినమన్నాను అందుకే” అనో మొట్టికాయేసింది.
ఫైనల్ గా వాడు తెలుసుకున్న విషయం ఏంటంటే, ఎవరికీ తెలియదు అని.
ఐతే వాడికి ఒక ఆలోచన వచ్చింది. మనం కూడా ఒక పండగ కనిపెట్టి దానిని బాగా జరిపితే పాపులర్ అయిపోతాము కదా! ముఖ్యంగా ఓ రెండురోజులు స్కూల్ కి వెళ్ళక్కర్లేదు కదా!

మమ్మల్నందరినీ కూర్చోబెట్టాడు మరుసటి రోజు. ఐడియా మాకూ బ్రహ్మాండంగా నచ్చింది! మన సొంత పండుగ, మనమే కనిబెడుతున్నాం! ఐతే ఎప్పుడు చెయ్యాలి, ఎవరికి చెయ్యాలి? ప్రతీ వారం ఏదోటి చేస్తూనే ఉంటారుగా మనోళ్ళు. మనోజుని ఏ రోజు ఖాళీగా ఉంటుందో చెప్పు పంచాంగంచూసి అనడిగాము. వాడి జ్ఞానంతో “ఒరేయ్ పాడ్యమి ఏ పండుగలు ఉండవురా” అన్నాడు. ఎండాకాలంలో చెయ్యలేము. మిగిలనిది దీపావళికి సంక్రాంతికి మధ్య రెండు నెలలు. క్రిస్ట్మస్ లోపే అయిపోవాలి. ఫిక్స్ ఐతే!

ఓ నాలుగురోజులు ప్లాన్ చేసి ఒక ఉదయం వాళ్ళ అమ్మని, నాన్నని లేపి చెప్పాడు, “నాన్నగారు, నాకు నిన్న రాత్రి నిద్రలో నంది వచ్చింది. అది చాలా బాధ పడింది. ఇన్ని యుగాల నుంచి శివుడిని లోకాలన్నీ తిప్పుతున్నాను కదా, నాకు ఒక్క పండగ కూడా లేదా అని కంట తడి పెట్టుకుంది”! బామ్మ గబగబావచ్చి వాళ్ల నాన్నతో అంది “ఒరేయ్ నానీ, నేను చెప్పాను కదా, చిన్నప్పుడు వీడు పుట్టిన నక్షత్రం ఎంతో దివ్యమైనది అని! చూశావా, వీడికి నంది కలలోకి వచ్చిందట!! తరచూ మీ నాన్నగారికి కూడా నంది కలలోకి వచ్చేది రాఆఆఆ!” అని బబ్లూ గాడి ప్లాన్ ని పాస్ చేసేసింది.

నవంబర్లో ఒక సాయంత్రం పిల్లలందరం కలిసి చందా డబ్బాలు పట్టుకుని బయలుదేరాం కాలనీ లో, వానర సేన లంక మీద పడ్డట్టు. ఒక్కొక్క ఇంటి వాళ్ళకీ టెన్షన్! ‘ఇప్పుడే కదా దసరా అయ్యింది, చందాల వాళ్లు ఏమైనా వదిలితే దీపావళి కి కల్చేసామాయే, ఇప్పుడు ఈ కొత్త కలక్షన్ ఏంటిరా భగవంతుడా’ అని!
మన కాలనీ లో ప్రపంచం లోనే మొదటి సారి గా నంది పాడ్యమి జరుపుకుంటున్నాము, మీ వొంతు చందా ఇవ్వండి అని పాంప్లేట్లు లాగ మేమే రంగురంగు కాగితాలమీద రాసేశాం! ఒక్కొక్కళ్ళ మొహాలూ చూడాలి! నంది పాడ్యమి ఏమిటి, చందా ఏమిటి! పిల్లలు ఇలా రామదండు లాగా బయలుదేరడమేమిటి!
అందరినీ పట్టుకుని పీడించి ఓ మోస్తరు కలక్షన్ చేశాం.

అక్కడ వచ్చింది చిక్కు. గణపతి, దుర్గ బొమ్మలు చేసిన బెంగాళీ వాడు “నాకు నంది బొమ్మ నహీ ఆతా” అన్నాడు! మరెలా అంటే “ముఝే బొమ్మ దిఖాయేగా మే బనాయేగా” అన్నాడు. అనిల్ గాడి ఇంట్లో పాత చందన బ్రదర్స్ క్యాలెండర్ ఒకదాంట్లో పెద్ద నంది బొమ్మ కనబడింది. అది చింపుకొచ్చాం. అందులో నవ్వుతున్న నందిని చూపించి, “ఇదిగో, ఇప్పుడు చెయ్యి” అన్నాడు బబ్లూ. గోడకి అంటించాడు బెంగాళి.

మన గుడి పంతులు ప్రసాదు గారిని “నంది పూజ మీకొచ్చా?” అనడిగితే ఆయన గాబరా పడిపోయి “నాకు రాదు బబోయి” అన్నారు. మరేంచెయ్యాలని అడిగితే “పక్క కాలనీలో అయ్యప్ప దేవాలయం ఉంది కదా, అందులో మలయాళం పంతులు గారొకాయనుంటారు, ఆయన్నడగండి” అన్నారు. ఆయనకూడా “అంబలం పూజయితే చేస్తానుగానీ నంది పూజేమిటి? నేనెప్పుడూ వినలేదు” అన్నారు. బామ్మ అందరినీ భీబత్సమైన తిట్లు తిట్టింది “షోడశోపచార పూజ చేసెయ్యడమే, నందికేశునోము లోవి కొన్ని వాడేస్తాం! అష్టోత్తరం శివుడిది చదివినా పర్లేదు… మిడిమిడి జ్ఞానం గాళ్ళందరూ పంతుళ్ళయిపోయారు, ఇందులో కష్టమేముంది..” అని!

అయితే మన పంతులుగారి కొడుకు మనోజ్ ఓ ఐడియా ఇచ్చాడు. “మా నాన్నగారు చెయ్యనన్నా మా బాబాయొకాయనున్నారు. చిన్నప్పుడు ఇష్టంలేకపోయినా మా తాతగారు బలవంతంగా స్మార్తం నేర్పించారు. ఏదో సాఫ్ట్వేర్ ఉద్యోగాలని ట్రై చేస్తున్నాడిప్పుడు ఖాళీనే” అన్నాడు. అంతే! “వామ్మో వార్నాయనో” అని విలపిస్తున్నా వినకుండా బామ్మ గారి అజమాయిషీలో పిల్లలు అందరం కలిసి బాబాయిని ఎత్తుకొచ్చాం! “ఎలాగో ఉద్యోగం లేదు కదా రా, నంది పూజ చేస్తే బిల్ గేట్స్ ఉద్యోగం వస్తుంది అని కేనోపనిషత్ లో ఉంది” అని బబ్లూ వాళ్ళ బామ్మ బాబాయిని కన్విన్స్ చేసేసింది. “ఎలాగో ఎవరూ ఇంతకుముందు ఇది చెయ్యలేదు కదా, ఆ పేటెంటు నీదే” అంది! మరేమి మాట్లాడతాడు?

ఒక వారం అయ్యాక బెంగాళీ దగ్గరనుంచీ ఒక రకంగా చూస్తున్న నంది (లాంటి) బొమ్మని పిల్లలందరం చిన్నారావు ఆటోలో తెచ్చాం. దానికి కూడా కళ్ళకి గుడ్డ కట్టి! మరి పూజ కి ముందు తీయకూడదు కదా! బాబాయి కష్టపడి పంచ కట్టుకుని, (అది జారిపోకుండా లోపల బెల్ట్ పెట్టుకుని) నామాలు పెట్టుకు వచ్చేడు. ఓ మూడురోజులకి సరిపడా ప్రసాదాల లిస్టు, పూజల లిస్టు పట్టుకొచ్చేసారు సత్యవతిగారు. అందరు లేడీసుకి డ్యూటీ వేసేసారు. షాజూ వాళ్ళ అమ్మగారి దగ్గరనుంచీ క్రిస్ట్మస్ లైట్లు పట్టుకొచ్చేసాం నంది స్టేజికోసం. మన మెడికల్ రిప్రజెంటేటివ్ ని పట్టుకుని కాటను థర్మకోలు ఫ్రీగా తెప్పించుకున్నాం. ఒక చిన్న కైలాసం లాగ వాటితో మంచుకొండలు కట్టాం బ్యాక్డ్రాప్ లో. అందరం కలిసి ఓ రోజు స్కూలు ఎగ్గోట్టాం.

ఒహొ! ఏమి పూజలనుకున్నారూ? బాబాయి మంత్రాలు గబ గబా చదివేస్తున్నాడు (మరి …..) నంది పాడ్యమి అన్న విషయం తెలిసేసరికి పక్కన ఉన్న కాలనీ వాళ్ళూ, చుట్టాలూ అందరూ వచ్చేసారు ! కేరళ పంతులు గారు, అయ్యప దీక్షలో ఉన్న ఓ యాభైమంది కలిసొచ్చి ఓ రాత్రంతా కైలాసానికి వినబడేలా భజనలు చేశారు. మూడోరోజు అన్నదానం కూడా సెట్ చేశారు మా పార్కులో. హుండీ నిండింది!

నిమజ్జనానికి మళ్ళీ చిన్నారావు ఆటో, బాబాయి మంత్రాలు (ఇప్పుడు కొంచం గట్టిగా చదివాడు లెండి — అలవాటు అయ్యింది కదా!), వెనకాల బబ్లూ గాడు ‘మాయదారి మైసమ్మ’ పాటలు, డాన్సులు, భలే అయ్యింది! బీచ్ రోడ్డులో జనాలకి అర్ధం అవ్వలేదు. ఇప్పుడేం నిమజ్జనం అని! అదీను బొమ్మచూస్తే గణపతి కాదు, దుర్గమ్మ కాదు. నంది అని గుర్తుపట్టడానికి వాళ్ళకీ కొంచం కష్టమయ్యుంటుంది.

సంవత్సరం తిరిగింది. బాబాయికి నిజంగా అమెరికా లో ఉద్యోగం వచ్చింది, బబ్లూ గాడు అన్ని సబ్జక్టులలో మంచిమార్కులు తెచ్చేసుకున్నాడు. కాలనీ ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న మంచినీటి పైపు ఇంకొకటి బిగించారు, రోడ్లు మరమ్మతు చేశారు. పార్కు గోడలకి మునిసిపాలిటీ వాళ్ళే రంగులేసారు.
“అంతా నంది పాడ్యమి మహిమ” అని బామ్మగారు మొత్తం చాటేసారు. ఈ సారి చందా డబ్బా తియ్యకుండానే అందరూ ముందుకొచ్చారు!

మరుసటి సంవత్సరం బెంగాళీ బొమ్మలో నంది నవ్వింది 😊

మిగితా కధలు..https://medium.com/kauphy

_______________________________

ఈ పేరుతో ఓ కథ పన్నెండేళ్ళ క్రితం గంభోళజంబ అనే నా పాతబ్లాగులో రాసుకున్నాను. దాన్ని రీరైట్ చేసి మన కాలనీలోకి పట్టుకొచ్చాను.

--

--

Aditya
Kauphy
Editor for

Coffee drinker, Semi retired, Sits on the beach thinking about the mountains. Have too many half-written drafts on my blog 🤦🏻‍♂️