3. సైజ్ జీరో

Aditya
Kauphy
Published in
3 min readMay 2, 2020

రమణారావు అంకుల్ భార్య పేరు సత్యవతి గారు. ఉత్తిగా సత్యవతి అని ఎవరూ పిలవడం మేమెప్పుడూ వినలేదు. ఎప్పుడూ సత్యవతిగారే. అంకుల్ కూడా ఇంట్లో అలానే పిలుస్తారేమోనని మా డౌటు. ఆవిడ మా కాలనీకి ఎలక్షన్ లేని లీడర్. గూర్ఖా దగ్గరనుంచీ కూరలవాళ్ళ దాకా, పనిమనుషుల దగ్గర్నుంచీ మునిసిపాలిటీ వాళ్ళదాకా, ఎవరయినా కాలనీలో ఏ పనికయినా సత్యవతిగారిని కలవాల్సిందే. ఆవిడ కూడా గొప్ప ఎఫీషియెంటు. ఒక్కరోజు చెత్తబండి రాకపోతే సానిటరీ ఇన్స్పెక్టర్ కి చచ్చేచావు! పార్కులో గడ్డెక్కువయినా భూమిలో నీరుతక్కువయినా ఆవిడే ఇంచార్జు. గత ముప్పయ్యేళ్ళుగా కాలనీకి బాసు.

కాలనీలో ఆడవాళ్ళది ఒక సూపర్ గ్రూపుంది. దానికీ సత్యవతిగారే లీడరు. మా అమ్మలందరూ అందులో సభ్యులే. ఉద్యోగాలుచేసే సుశీలా టీచర్, బ్యాంకు క్యాషియర్ నళిని గారు కూడా మార్నింగ్ వాకులు, శెలవురోజు ప్రోగ్రాములు మిస్సవ్వకూడదని రూలు. కాలనీలో పని జరగాలంటే వీళ్ళవళ్ళే జరిగేది. అంకుల్లందరూ మాలాంటోళ్ళే. ఎప్పుడు తిండిపెడతారా అని ఎదురుచూస్తూ ఎక్కడెక్కడి వార్తలో చూసుకుంటూ ఉండేవాళ్ళు ఉద్యోగాలనుంచీ వచ్చాక. ఆరున్నరయితే ఇంకా ఆంటీ ఇంటికి రాలేదు, వంటెప్పుడు మొదలెడతారు, మనకెప్పుడు పెడతారు అని గేటు వైపు మాటిమాటికీ చూస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళ గురించి వేరే కధ ఉంది లెండి.

సత్యవతిగారి గ్రూపులో ఓ పది-పన్నెండు సభ్యురాల్లుండేవారు. రోజూ వాకింగుకి వెళ్ళేవాళ్ళు, మధ్యాహ్నాలు తోటపని చేశేవాళ్ళు, డాబాలమీద కూరలు, పూలు పండించేవాళ్ళు, కలిసి షాపింగులకెళ్ళేవాళ్ళు, ఇంటికొచ్చిన చీరల పండాలని మొత్తం మూడు సంచులు టీవీయస్-50 మీదనుంచీ తెచ్చి ఒక్కొక్క చీరా పూర్తిగా తీసి చూపించేదాకా వదిలేవాళ్ళుకాదు, ఒక చీటీ వేసుకునేవాళ్ళు, నెలకొకింట్లో కిట్టీ పెట్టుకునేవాళ్ళు, గొప్ప సందడుండేది. వాళ్ళళ్ళో దాదాపు అందరూ అరముప్పైలు దాటినవాళ్ళే. కొందరు నలభైలు యాభైలు కూడా ఉండేవాళ్ళు కానీ బాల్యవివాహం అని దబాయించేవాళ్ళని ఓరోజు మా అమ్మ ఇంట్లో చెప్తూంటే విన్నాను.

సత్యవతిగారి ఈంట్లో పైన పోర్షన్లో ఒక మెడికల్ రిప్రజెంటేటివ్ కుర్రాడు అద్దెకుండేవాడు. టిప్పుటాపుగా తయ్యారయ్యి బైకుమీద రోజూ ఉదయాన్నే బయటకెళ్ళిపోయేవాడు, రాత్రి ఎనిమిది తరువాత వచ్చేవాడు. మాకు మంచి ఫ్రెండు. హాల్స్ బిల్లలు దబ్బాడుండేవి ఆయనదగ్గరెప్పుడూను. మేమెప్పుడు ఎదురొచ్చినా మాకు ఓ గుప్పెడు ఇచ్చి వెళ్ళిపోయేవాడు. ఎవరిదయినా పుట్టినరోజు అని తెలిస్తే డెయిరీనో మంచి పెన్నో స్క్రిబులింగ్ ప్యాడో గిఫ్టు ప్యాకింగులో ఇచ్చేవాడు. ఇంట్లో ఎప్పుడూ ఇవి ఎందుకు ఉండేవా అని మాకు అప్పట్లో పెద్ద డౌటుండేది. ఓరోజు ఆయనకి పెళ్ళయ్యింది. అన్నవరంలో చేసుకుని వాళ్ళావిడని తీసుకుని కాలనీకి వచ్చాడు. సత్యవతి గారు, మిగితా బృందం దిష్టి తీసి గుమ్మడికాయ కొట్టి లోపలికి తీసుకెళ్ళారు. మేమందరం పార్కు గోడమీంచీ చూశాం. ఓ రెండుమూడు వారాలయ్యాక కొత్త పెళ్ళికూతురుని కూడా గ్రూపులో కలిపేసుకున్నారు సత్యవతిగారు. వాకింగులలో తెగ ఇకఇకలు పకపకలు ఉండేవి. వాళ్ళు బాతాఖాని కొట్టుకునే చోట మేముంటే “అటువైపు వెళ్ళి ఆడుకోండి” అనేవారు మమ్మల్ని. రిప్రజెంటేటివ్ కూడా ఐదూ ఆరు అయ్యెసరికీ ఇంటికి వచ్చేసేవాడు. మాతో మామూలుగా కన్నా ఎక్కువ నవ్వుతూ మాట్లాడేవాడు, ఓ కొత్త బైకు కూడా కొనుక్కున్నాడు …

వాకింగుకి కాలనీ ఆంటీలందరూ చీరలే కట్టుకొచ్చేవాళ్ళు. అప్పుడప్పుడూ ఎవరయినా పంజాబీ డ్రెస్సులు వేసుకునేవాళ్ళు. అయితే కొత్తమ్మాయి డ్రెస్సులే వేసుకునేది. అప్పుడప్పుడూ ట్రాక్ ప్యాంటులు కూడా వేసుకునేది. ఓసారి టీషర్టు వేసుకొచ్చింది కూడాను. “చిన్నపిల్ల కదా పర్లేదులే” అని మా నాన్నన్నారు అమ్మతో. నడుస్తున్నప్పుడు అందరు ఆంటీల మధ్యలో నిజంగానే చిన్నపిల్లలానే ఉండేది ఆవిడ.

ఈ విషయం ఆంటీలు కొందరికి నచ్చలేదు. సత్యవతిగారి ఇంట్లో ఓ మీటింగు పెట్టి ఏదోటి చెయ్యాలని తీర్మానించుకున్నారు. మరుసటిరోజు ఇంట్లో అలార్ము నాలుగున్నరకి మోగింది. ఏంటా అని లేచి చూస్తే మా అమ్మ గబగబ లేచి, “నువ్వు పడుకో పర్లేదు” అని స్పీడుగా తయ్యారయ్యి తలుపు బయిటనుంచీ గొళ్ళెంవేసుకుని వెళ్ళిపోయింది. మరుసటిరోజూ అంతే. ఇలా కాదని నేనూ ఓరోజు లేచి ఐదునిమిషాల తరువాత వెనక తలుపులోంచీ వెళ్ళి డాబా ఎక్కాను. పక్కడాబా మీద అనీల్ గాడు కూడా కనబడ్డాడు. వాడింట్లో కూడా ఇదే పరిస్థితి. పార్కులో కమ్యూనిటీ హాలు, ఓ స్టేజీ ఉండేవి. ఆ స్టేజీ మీద ఆంటీలందరూ కనబడ్డారు. ఒకాయన తెల్ల కుర్తా వేసుకుని ప్రాణాయామం చేయిస్తున్నారు వాళ్ళచేత. ఐదున్నరకి ఆసనాలు వేయించడం మొదలెట్టారు. ఆంటీలు అందరూ డ్రెస్సులే వేసుకొచ్చారు. ఎప్పుడూ మేము సత్యవతిగారిని, మరికొందరిని అలా చూడలేదు. మాకు స్కూల్లో నేర్పిన ఆసనాలు కొన్ని వేయించాక మాష్టారో క్లిష్టమయిన ఆసనం వెయ్యమన్నారు. మా అమ్మల పాట్లుచూసి నేనూ అనిల్ గాడు ఒకరి మొహాలు ఒకరం చూసుకున్నాం నవ్వు ఆపుకుంటూ!

ఆరున్నరవరకూ విపరీతమయిన వాకింగు, యోగా, ఎక్సర్సైజులు చేసేసారు. తువ్వాల్లు, నీళ్ళసీసాలు, మధ్యమధ్యలో పార్కు చుట్టూ జాగింగూ… స్కూల్లో కాలనీ పిల్లలందరం ఆలోచించాం — ఏమయింది మన అమ్మలకి అని. కొన్నాళ్ళు ఇలానే గడిచింది. ఉదయం మాత్రమే కాదు, సాయంత్రం కూడా వాకింగు మొదలెట్టారు కొందరు. ఇంట్లో మా అమ్మ చిన్న గిన్నెలో గోధుమన్నం వండుకోవడం మొదలెట్టింది. అంతే తినేది. కూరలవాడు ఉదయాన్నే కాలనీకి వచ్చినప్పుడు స్పెషల్ గా కవర్లలో కొమ్ముశనగలు, పెశలు లాంటివన్నీ ఇచ్చేవాడు, ఇంట్లో వాటిని మొలకెత్తించి తినేవాళ్ళు ఆంటీలు. కక్కడి దోసకాయలు, క్యారెట్లు, మురీలు స్నాక్స్ అయిపోయాయి. బజ్జీలు, పునుగులు మానేశారు. మా నాన్నలు మరీ ఫ్రస్ట్రేషన్ లోకి వెళ్ళిపోయారు! బిరియానీలు లేవు, స్వీట్లు లేవు, మా నాన్న ఏమయినా అంటే “పొట్ట చూసుకోండి, ఇదంతా మీ మంచికే, మీకోసమే మేమూ త్యాగం చేశాం” అని చెప్పేది మా అమ్మ!

కొన్నాళ్ళ తరువాత సత్యవతి గారి ఇంటిపైన ఉన్న కొత్త పిల్ల వాకింగుకి వెళ్ళడం తగ్గించేసింది. కొంచం బొద్దుగా అయ్యిందేమో అనిపించింది మాకు. ప్యాంటులు టీషర్టులు తగ్గించి డ్రెస్సులే వేసుకునేది. “ఆరో నెల” అని పనిమనిషికి సత్యవతిగారు చెప్పారని మా ఇంట్లో చెప్పింది. కొన్నాళ్ళకి రిప్రజెంటేటివ్ వాళ్ళ ఇంట్లో ఓ ఫంక్షన్ చేశారు. మొత్తం అరేంజుమెంట్లన్నీ కాలనీ ఆంటీలే చేశారు సత్యవతిగారి డైరెక్షన్లో. డెకరేషను, చీరలు, పువ్వులు, టెంటుహౌసు, మొత్తం. చుట్టాలొచ్చి భోజనాలు చేసి చీరలు పువ్వులు ఇచ్చారు అమ్మాయికి. అదయ్యాక వాళ్ళ అమ్మానాన్నా అమ్మాయిని తీసుకెళ్ళిపోయారు.

మళ్ళీ రిప్రజెంటేటివ్ ఉదయాన్నే వెళ్ళి రాత్రికి వచ్చేవాడు.
మరో నాలుగు రోజులకి యోగా, జాగింగూ, సాయంత్రం వాకింగూ ఆగిపోయాయి. అలార్ము ఇంతకుముందు లాగే ఐదుంపావుకి మోగింది. అమ్మ మళ్ళీ మామూలు అన్నానికి మారిపోయింది.

“నువ్విలాగే బాగుంటావు” అన్నారు నాన్న.

“మీకూ పెద్ద పొట్టేం లేదులెండి” అంది అమ్మ.

మిగితా కధలు..https://medium.com/kauphy

--

--

Aditya
Kauphy
Editor for

Coffee drinker, Semi retired, Sits on the beach thinking about the mountains. Have too many half-written drafts on my blog 🤦🏻‍♂️