Sree Harsha
Rythu Swarajyam
Published in
5 min readSep 13, 2021

--

గ్రామీణ ప్రజల ప్రతి ధ్వని “కిసాన్ మిత్ర హెల్ప్ లైన్”
కన్నెగంటి రవి , రైతు స్వరాజ్య వేదిక మరియు కిసాన్ మిత్ర టీం
— — — — — — — — — — — — — — — — — — — — — — — -

మల్లన్న .. వికారాబాద్ జిల్లాలో ఒక సన్నకారు రైతు. తనకున్న కొద్ది పొలంలో చెరుకు తోట వేసుకున్నాడు . తోటకు డ్రిప్ సౌకర్యం ఏర్పాటు చేయాలనుకున్నాడు . కానీ భూమి రికార్డులు సరిగా లేకపోవడంతో ఉద్యాన శాఖ సబ్సిడీ పథకం , బ్యాంకులు రుణం మంజూరు చేయలేదు . తన భూమి రికార్డులు సరి చేసుకోవడానికి మండల కార్యాలయం చుట్టూ తిరిగి తిరిగి అలసి పోయాడు . తోట ఎండిపోతున్న దశలో , ఒక రోజు కిసాన్ మిత్ర హెల్ప్ లైన్ కు ఫోన్ చేసి , తన రెవెన్యూ సమస్య పరిష్కారం కావడం లేదనీ, తనకు భవిష్యత్తు కనిపించడం లేదనీ , అందుకే ఆత్మహత్య చేసుకోవడానికి పొలం దగ్గరకు వెళుతున్నానని చెప్పాడు . వెంటనే కిసాన్ మిత్ర కౌన్సిలర్లు పూర్తి వివరాలను అతని నుండి తీసుకుంటూ చాలా సేపు ధైర్యం చెప్పారు . ఒక్క గంటలోనే కిసాన్ మిత్ర ఫీల్డ్ కో ఆర్డినేటర్లు మల్లన్న దగ్గరకు చేరుకున్నారు. అతనికి నచ్చ చెప్పి, వెంటనే జిల్లా అధికారులను కల్పించి, రెండు రోజుల్లో తన సమస్యను పరిష్కరించారు. ఒక ఆత్మహత్య ఆగింది . ఒక రైతు ప్రాణం నిలిచింది . గత 4 ఏళ్లలో ఇలాంటి అనేక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ కిసాన్ మిత్ర హెల్ప్ లైన్ రాష్ట్రంలో రైతుల ఆదరాభిమానాలను పొందింది.
2017 ఫిబ్రవరి లో రైతు స్వరాజ్య వేదిక బృందం వికారాబాద్ జిల్లా కలెక్టర్ గారిని కలసి జిల్లా వ్యవసాయ రంగ సమస్యలపై చర్చించింది . ప్రజలు తమ సమస్యలు చెప్పుకోవడానికి వీలుగా ఒక హెల్ప్ లైన్ లాంటిది అవసరమనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఈ చర్చల క్రమంలోనే “కిసాన్ మిత్ర హెల్ప్ లైన్” ఉనికి లోకి వచ్చింది. 2017 ఏప్రిల్ 14 న డాక్టర్ అంబేడ్కర్ జయంతి రోజున 1800 120 3244 టోల్ ఫ్రీ నంబర్ తో వికారాబాద్ జిల్లాలో హెల్ప్ లైన్ ప్రారంభం అయింది. జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో, జిల్లా వ్యవసాయ శాఖ నోడల్ ఏజెన్సీ గా, సుస్థిర వ్యవసాయ కేంద్రం భాగస్వామ్యం తో, క్షేత్ర స్థాయిలో రైతు స్వరాజ్య వేదిక వంటి ప్రజా సంఘాల తోడ్పాటుతో మొదలైన ఈ హెల్ప్ లైన్ తర్వాత కాలంలో ఆదిలాబాద్ , మంచిర్యాల, కడప జిల్లాలకు విస్తరించింది.
కిసాన్ మిత్ర హెల్ప్ లైన్ ప్రాధాన్యత దృష్ట్యా తెలంగాణ లో ఆదిలాబాద్ , వికారాబాద్ జిల్లాలతో పాటు వరంగల్, యాదాద్రి భువనగిరి , జనగాం, సిద్దిపేట , నల్గొండ జిల్లాలకు , ఆంధ్ర ప్రదేశ్ లో గుంటూర్, విశాఖపట్నం , అనంతపురం జిల్లాలకు కిసాన్ మిత్ర హెల్ప్ లైన్ సేవలను విస్తరించాలని ప్రస్తుతం ఆలోచనలు జరుగుతున్నాయి. ఇకపై ఆదిలాబాద్ ,వికారాబాద్ జిల్లాలలో హెల్ప్ లైన్ 1800 120 3244 నంబర్ కొనసాగించడం తో పాటు , కొత్త జిల్లాలకు 9490 900 800 ఫోన్ నంబర్ తో కిసాన్ మిత్ర హెల్ప్ లైన్ సేవలు అందిస్తుంది. ఆయా జిల్లాల రైతులు , గ్రామీణ ప్రజలు ఈ ఫోన్ నంబర్లకు నిర్ధిష్ట సమయంలో ఫోన్ చేసి తమ సమస్యలు చెప్పుకోవచ్చు.
ప్రతి రోజూ ఉదయం 9 గంటల నుండీ సాయంత్రం 7 గంటల వరకూ హెల్ప్ లైన్ కు వచ్చే ఫోన్స్ ను అందుకోవడానికి కౌన్సిలర్లు అందుబాటులో ఉంటారు . ఆదివారం మాత్రం ఉదయం 9 గంటల నుండీ సాయంత్రం 5 గంటల వరకూ హెల్ప్ లైన్ పని చేస్తుంది. తక్షణం స్పందించాల్సిన సమస్యలపై వేగంగా కదిలి వెళ్ళేందుకు ఫీల్డ్ కొ ఆర్డినేటర్స్ ఉంటారు. ప్రతి సమస్యకూ పరిష్కారం వెతికేందుకు కౌన్సిలర్లు , ఫీల్డ్ కొ ఆర్డినేటర్లు గొప్ప నిబద్ధతతో ,నిరంతరం పని చేస్తున్నారు. ఒక్కోసారి క్రింది స్థాయి అధికారులు పూర్తి స్థాయిలో సహకరించకపోయినా , ఓపికగా , పై స్థాయిలో కూడా ఆ సమస్యలను చర్చిస్తూ , రైతులకు, గ్రామీణ ప్రజలకు న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు.
2021 ఆగస్ట్ 26 నాటికి హెల్ప్ లైన్ కు మొత్తం 13307 కేసులు వచ్చాయి . ఆదిలాబాద్ నుండీ 4616 కేసులు , వికారాబాద్ నుండీ 6722 కేసులు , మంచిర్యాల నుండీ 1518 కేసులు వచ్చాయి. ఈ కేసులలో 9764 కేసులు పరిష్కారం అయ్యాయి. ఇంకా 3543 కేసులు పెండింగ్ లో ఉన్నాయి.
మొదటి మూడు సంవత్సరాల పాటు ఆయా జిల్లాల కలెక్టర్స్ ఫండ్ సహకారంతో కిసాన్ మిత్ర నడిచినప్పటికీ , తర్వాత కాలంలో వివిధ సంస్థల సహకారంతో కిసాన్ మిత్ర కొనసాగింది. కిసాన్ మిత్ర హెల్ప్ లైన్ వల్ల రైతులకు ప్రయోజనం జరుగుతుందనీ, అధికారులకు కూడా క్షేత్ర స్థాయి సమస్యలు అర్థం అవుతున్నాయనే భావన జిల్లాల అధికారులకు ఉంది
అందుకే కిసాన్ మిత్ర హెల్ప్ లైన్ ను రైతుల గొంతుగా నిరంతరాయంగా కొనసాగించేందుకు, విస్తరించేందుకు చర్చలు సాగుతున్నాయి . తెలంగాణా, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలలో కిసాన్ మిత్ర హెల్ప్ లైన్ ను ఇకపై రూరల్ డెవలప్ మెంట్ సర్వీస్ సొసైటీ (RDSS) సంస్థ నిర్వహించనుంది . గత 4 సంవత్సరాల కిసాన్ మిత్ర అనుభవాలను , రైతులకు కలిగిన ప్రయోజనాలను పరిశీలిస్తున్న కొన్ని సంస్థలు ఇప్పటి నుండీ కిసాన్ మిత్ర నిర్వహణకు ఆర్ధిక సహకారం అందించేందుకు ముందుకు వస్తున్నాయి.
ప్రస్తుతం హెల్ప్ లైన్ కు వ్యవసాయ రంగ సమస్యలు ముఖ్యంగా రెవెన్యూ సమస్యలు ,బ్యాంకు రుణాలు , పంటల బీమా ,ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టాలు , విద్యుత్ సమస్యలు , పంటల మార్కెటింగ్ సమస్యలు , రేషన్ కార్డులు ,పెన్షన్ లు, ఉపాధి హామీ వేతనాలు , రైతు బంధు, రైతు బీమా లాంటి సమస్యలపై రైతులు,గ్రామీణ ప్రజలు ఫోన్ చేస్తున్నారు .
మరీ ముఖ్యంగా ధరణి వెబ్ సైట్ వచ్చాక కూడా రెవెన్యూ సమస్యలు వేగంగా పరిష్కారం కావడం లేదనీ, పైగా కొత్త రూపాలలో సమస్యలు ముందుకు వస్తున్నాయనీ కిసాన్ మిత్ర కు వస్తున్న ఫోన్ కాల్స్ చూస్తే అర్థం అవుతుంది. ముఖ్యంగా మ్యూటేషన్ , కొత్త పాస్ బుక్ ల మంజూరు లో జాప్యం, రెవెన్యూ రికార్డులలో తప్పులు లాంటివి ఎక్కువే ఉంటున్నాయి . రైతుకు ఉన్న భూమిలో కొంచెం భూమి వివాదంలో ఉన్నా , లేదా సేకరణకు గురైనా , మొత్తం భూమికే రైతు బంధు రాకపోవడం లాంటి కేసులు వస్తున్నాయి. ప్రభుత్వం చెప్పిన ఋణ మాఫీ సకాలంలో అమలు కాకపోవడం , ఫలితంగా వడ్డీలు పెరిగిపోవడం ,పెండింగ్ రుణాల క్రింద బ్యాంకులు రైతు బంధు డబ్బులను పట్టుకోవడం , భారీ వర్షాలతో పంటలకు నష్టం జరిగినా , ఆ వివరాలను వ్యవసాయ శాఖ అధికారులు సేకరించకపోవడం లాంటి ఫిర్యాదులు కూడా కిసాన్ మిత్ర కు వస్తున్నాయి.
రైతు ఆత్మహత్య బాధిత కుటుంబాలకు జీవనోపాధుల కల్పన, సుస్థిర వ్యవసాయానికి ప్రోత్సాహం లాంటి ప్రత్యేక కార్యక్రమాలను కూడా కిసాన్ మిత్ర సమన్వయం చేస్తున్నది . కిసాన్ మిత్ర కు వస్తున్న ఫోన్ కాల్స్ ఆధారంగా , ముఖ్యమైన సమస్యలను రాష్ట్ర స్థాయిలో అధికారుల ధృష్టికి తీసుకు వచ్చి పాలసీ నిర్ణయాలను తీసుకునేలా కృషి చేస్తున్నది.
కిసాన్ మిత్ర దృష్టికి వచ్చిన వందలాది మంది రైతుల వ్యక్తిగత సమస్యలు అనేకం పరిష్కారం అవడం వల్ల రైతులకు , గ్రామీణ ప్రజలకు కిసాన్ మిత్ర హెల్ప్ లైన్ పై ఈ మూడు జిల్లాలలో గొప్ప విశ్వాసం ఏర్పడింది . జిల్లా స్థాయిలో అధికారులు , జిల్లా స్థాయి సమీక్షలలో , కిసాన్ మిత్ర కు వచ్చిన కేసులను కూడా సమీక్షించి పరిష్కారం కోసం కృషి చేస్తున్నారు. కిసాన్ మిత్ర హెల్ప్ లైన్ కు వస్తున్న సమస్యలను చూస్తుంటే ప్రభుత్వం పరిపాలనా పరంగా ఇంకా చాలా మెరుగుదల సాధించాల్సి ఉందని స్పష్టంగా అర్థం అవుతుంది.
గ్రామీణ ప్రాంతాల కోసం అనేక పథకాలు ప్రభుత్వం ప్రకటించినా, గ్రామీణ పేదలు, రైతులు ఆచరణలో అనేక ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. సంవత్సరాల పాటు ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. ఒక్కోసారి అవినీతి అధికారుల వేధింపులకు గురవుతున్నారు. కొన్ని సార్లు ఆయా పథకాలకు సరైన మార్గదర్శకాలు లేక, లేదా వాటిపై క్రింది స్థాయి అధికారులకు తగిన శిక్షణ లేక కూడా చాలా సమస్యలు పెండింగ్ లో ఉంటున్నాయి. చాలా సమయాలలో ఆయా స్థాయి అధికారులకు పని ఒత్తిడి ఉండడం కూడా పనుల జాప్యానికి కారణం అవుతున్నది. కానీ కారణాలు ఏమైనా , బాధితులు మాత్రం సాధారణ ప్రజలే.
ఇలాంటి అన్ని సందర్భాలలో కిసాన్ మిత్ర హెల్ప్ లైన్ వేగంగా స్పందించి వివిధ స్థాయి అధికారులతో చర్చిస్తూ, సమస్య పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తున్నది. ప్రజల పట్ల నిబద్ధత కలిగిన అధికారులు కూడా ఈ ప్రయత్నాన్ని స్వాగతిస్తున్నారు. మరిన్ని ప్రజా సమస్యలు తమ దృష్టికి తీసుకురావడమే కాకుండా వాటి పరిష్కారం కోసం కూడా కిసాన్ మిత్ర కార్యకర్తలు తోడ్పడుతున్నారని వారంటున్నారు.
కిసాన్ మిత్ర హెల్ప్ లైన్ తెలుగు రాష్ట్రాలలో రైతుల,ఆదివాసీల, గ్రామీణ ప్రజల సమస్యలను వింటూ , పరిష్కారం కోసం ప్రతిధ్వనిస్తుంది. మొత్తంగా తెలుగు రాష్ట్రాల రైతుల, ఆదివాసీల, గ్రామీణ ప్రజల సమస్యలను లోతుగా అర్థం చేసుకోవడానికి , సమస్యల పరిష్కారం కోసం , విధానాల మార్పు కోసం ప్రభుత్వాలపై ఒత్తిడి చేయడానికి , “ కిసాన్ మిత్ర” ప్రక్రియ తప్పకుండా ఉపయోగ పడుతుందని మా ఆకాంక్ష .
వివిధ జిల్లాలలో వివిధ సామాజిక సంస్థలు , రైతు సహకార సంఘాలు కిసాన్ మిత్ర హెల్ప్ లైన్ గురించి తాము పని చేస్తున్న జిల్లాలలో , అటవీ గ్రామాలలో ప్రచారం నిర్వహిస్తామని, కిసాన్ మిత్ర కు ఫోన్ చేసిన రైతుల,గ్రామీణ ప్రజల సమస్యల పరిష్కారానికి జిల్లా, మండల అధికారులతో మాట్లాడి పరిష్కారానికి కృషి చేస్తామని ముందుకు వస్తున్నాయి. హెల్ప్ లైన్ సేవలను తమ తమ ప్రాంతాలలో రైతులకు అందించడానికి , ఆయా ప్రాంతాల సామాజిక కార్యకర్తలు మరింత మంది ముందుకు రావాల్సి ఉంది.

డియర్ సర్.. ఈ వ్యాసం మీరు తప్పకుండా ప్రచురణకు స్వీకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాను .
కిసాన్ మిత్ర హెల్ప్ లైన్ ఒక ప్రత్యేక ప్రయోగం . ఫలితాలు బాగున్నాయి . కొంచెం రెండు రాష్ట్రాల రైతుల గొంతుగా మార్చాలని మా ప్రయత్నం .

--

--