Sree Harsha
RythuSwarajyaVedika
2 min readJan 20, 2017

--

ఎన్ని కష్టాలు వచ్చిన ధైర్యంగా ఎదుర్కొంటు ముందుకుసాగటం మంజులను చూసి నేర్చుకోవాలనిపిస్తుంది.

కొంత చదువుకున్న వారు,మాట్లాడగలిగిన వారు ,తిరగగలిగిన వారికికూడా ప్రభుత్వ పధకాలు అందనంత ఎత్తుకు వెళ్లిపోయాయనటానికి ఇదో ఉదాహరణ,వ్యవసాయ సంక్షోభం కారణంగా ధనుష్(ప్రస్తుతం 14 నెలలు) వాళ్ళ అమ్మ కడుపులో ఉండగానే తండ్రిని కోల్పోయాడు . ధనుష్ తండ్రి శ్రీధర్ యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం గంధమల్ల గ్రమానికి చెందిన చిన్నకారు రైతు. ఒక ఎకరా 20 గుంటల భూమి. అందులో రెండు బోర్లు వేసాడు,ఒకటి ఫెయిల్ అయ్యిది ఒకదానిలో కొద్దిగా నీళ్లు పడ్డాయి. మోటార్ బిగించుకున్నాడు,కరెంట్ కనెక్షన్ తీసుకున్నాడు. వరి పంట వేసాడు,వరుసగా 3 సంవత్సరాలు వరి పంట నష్ట పోయాడు.భార్య మంజుల బంగారం అమ్మి వ్యవసాయం లో పెట్టుబడి పెట్టాడు. మనం బ్రతకటానికే కదా అని మంజుల ఏ మాత్రం అభ్యంతరం చెప్పకుండా బంగారం ఇచ్చేసింది. మళ్ళి పంట పోయింది. ఇక పంటలు సరిగా పండటం లేదనిఒక లక్ష 50 వేల పెట్టుబడితో రెండు ఆవులు ఒక గేదెను తీసుకున్నాడు . ఒక ఆవు ప్రమాద వశాత్తు బావిలో పడి చనిపోయింది. ఒక ఆవు అనారోగ్యం తో చనిపోయింది.ఇక ఏది కలిసి రాకపోవటం తో సోదరుడితో కలిసి కొంత బ్యాంకు లోన్ మరియు మిగిలినది ఫైనాన్స్ లో వడ్డీకి తీసుకుని ట్రాక్టర్ తెచ్చుకున్నాడు.ట్రాక్టర్ మీద వచ్చే కొంత ఆదాయం ఫైనాన్స్ వారి వడ్డీలకే సరిపోయింది.అప్పటికే పంటల గురించి చేసిన అప్పుల వాళ్ళ వత్తిడి మరింత ఎక్కువ అయ్యింది.ట్రాక్టర్ కంతులు(INSTALLMENTS) కట్టలేకపోవటం తో ఫైనాన్స్ వాళ్ళు ట్రాక్టర్ తీసుకెళ్లారు. ఇక ఈ అప్పుల భాద భరించలేక శ్రీధర్ 2015 గణతంత్ర దినోత్సవం నాడు(26–1–2015) పురుగుల మందు తాగి ఆత్మ హత్య చేసుకున్నాడు. పోలీస్ వాళ్ళు దీనిని రైతు ఆత్మ హత్యగా FIR నమోదు చేశారు.
ఇది గతం, ఇక ప్రస్తుత పరిస్థికి వస్తే 23 సంవత్సరాలకే భర్తను కోల్పోయిన మంజుల పిల్లలను(ధనుష్,శివ చరణ్) బతికించుకోవటానికి ధైర్యంగా ఉండాలని నిర్ణయించుకుంది. రెవిన్యూ కార్యాలయానికి వెళ్ళింది . తన భర్త రైతు ఆత్మ హత్యకు సంభందించిన ఎక్స్ గ్రేషియా గురించి సమాచారం తెలుసుకుంది . దీనిని 194 జి. ఓ. ప్రకారం రైతు ఆత్మ హత్యగా గుర్తించాల్సిన రెవిన్యూ వారు దీనిని రైతు ఆత్మ హత్యగా కాకుండా ట్రాక్టర్ కంతుల(INSTALLMENTS) గురించి అన్న తమ్ముల మధ్య జరిగిన పంచాయితీ కారణంగా శ్రీధర్ ఆత్మ హత్య చేసుకున్నాడని నివేదిక ఇచ్చేసారు.ఈ విషయం తెలుసుకున్న మంజుల తన భర్తది రైతు ఆత్మ హత్యేనని వాదించిన ఫలితం లేకపోయింది. ఇక కనీసం ముఖ్యమంత్రి సహాయనిధి నుండి అయిన ఆర్థిక సహాయం పొందాలని హైదరాబాద్ లో సెక్రటేరియట్ కు వెళ్ళింది,పని కాలేదు CM క్యాంపు ఆఫీస్ కు వెళ్ళింది, జగదేవపూర్ మండలం లోని CM ఫామ్ హౌస్ కూడా వెళ్ళింది కానీ కలవలేక పోయింది.జాతీయ కుటుంబ ప్రయోజన పధకం(NFBS) క్రింద వచ్చే 20 వేల రూపాయల గురించి దరఖాస్తు చేసుకుంది. బడ్జెట్ లేదని ప్రభుత్వ అధికారుల నుండి సమాధానం. కనీసం పిల్లల ఆహార భద్రత కోసం35 కిలోల బియ్యం వచ్చే AAY(అంత్యోదయ అన్న యోజన)కార్డు కోసం దరఖాస్తు చేసింది. ఆ కార్డు వచ్చేసరికి చాల సమయం పడుతుందని అధికారుల సమాధానం.ఈ సమస్యలకు తోడుపెద్ద కొడుకు శివ చరణ్ కు గుండెకు సంభందించిన అనారోగ్యం. ఉన్న భూమి కాస్త ట్రాక్టర్ కంతుల కింద పోయింది. (కుటుంబ సభ్యులే ట్రాక్టర్ కంతుల కోసం 70 వేలకు భూమి తీసేసుకున్నారు). ఇన్ని కష్టాలను దిగమింగుకుని మంజుల రోజు భువనగిరి కి వెళ్లి ఒక టీ-షర్ట్స్ కంపినీలో పని చేస్తూ పిల్లల్ని పోషించుకుంటుంది.మంజుల ఏ రోజు అధైర్య పడలేదు.చదువు కనీసం కొన్ని సమస్యలకైనా పరిస్కారం చూపుతుందనుకుంది. ప్రస్తుతం ఓపెన్ యూనివర్సిటీ లో డిగ్రీ రెండవ సంవత్సరం చదువుతుంది.కుట్టు మిషన్ నేర్చుకుంది. ఆ పని కూడా చేసుకుంటుంది. ఈ కుటుంబానికి ప్రభుత్వం నుండి రావలసిన అన్ని పథకాలు వచ్చేవరకు స్థానిక పిలుపు సంస్థ -రైతు స్వరాజ్య వేదిక అండగా ఉంటాయి. ఈ సమాచారం అందించిన మిత్రుడు ఇస్తారికి ప్రత్యేక ధన్యవాదాలు

--

--