వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేస్తున్న ప్రబుత్వం

Naveen
RythuSwarajyaVedika
2 min readJan 29, 2017

ఎకరాకు 25 వేల నుండి 35 వేలు కౌలుకే పోతే ఇక ఆ రైతుకు గిట్టుబాటు కావాలంటే ఎంత పంట పండాలి . ఆంధ్ర ప్రదేశ్ లో రైతులు ఎదుర్కుంటున్న ప్రధాన సమస్య “కౌలు”.26–1–2017 నాడు ప్రకాశం జిల్లాలో రైతు ఆత్మ హత్య కుటుంబాలను కలవటానికి అలాగే కౌలు రైతుల సమస్యల గురించి తెలుసుకోవటానికి వెళ్ళాము. జిల్లా లో మానవ హక్కుల వేదిక తో కలిసి పర్చూరు, కారంచేడు మండలాలలో ఆత్మ హత్య చేసుకున్న 5 రైతు కుటుంబాలను కలిశాము.ఐదు మంది రైతులు కూడా భూమిలేక ఇతరుల భూమి సాగుచేస్తున్న కౌలు రైతులు.కౌలు రేట్లు ఎంత భారీ స్థాయిలో ఉన్నాయంటే మేము కలిసిన కుటుంబాలలో తక్కువ కౌలు ఎకరా 25 వేలు. ఎక్కువ కౌలు 35 వేలు. వరి పండే పొలాలు 16 బస్తాల వడ్లు(ధాన్యం)కౌలు గా ఇవ్వాలి. 25 వేల నుండి 35 వేల రూపాయలు కౌలు చెల్లించిన రైతులు పొగాకు,మిర్చి,పత్తి సాగు చేస్తున్నారు. రాష్ట్రము లో పొగాకు పండించటం లో మొదటి స్థానం లో ఉన్న ప్రకాశం జిల్లా లో దిగబడి లేక ధర లేక తీవ్ర సమస్యలు ఎదుర్కొన్నారు.

ఐదు కుటుంబాలలో ఒక్క కుటుంబానికి కూడా 62 జి. ఓ. ప్రకారం ఎక్స్ గ్రేషియా అందలేదు. ఎక్స్ గ్రేషియా రాకపోవటానికి అధికారులు చెపుతున్న కారణం వింటే ఆశ్చర్యపోవలసిందే. ఈ ”ఆత్మ హత్య చేసుకున్న రైతులను రైతులు గా గుర్తించటానికి వారి వద్ద కౌలు రైతు గుర్తింపు కార్డు లేకపోవటం” అని. వాస్తవానికి వీరంతా గత 20 నుండి 25 సంవత్సరాలు గా కౌలుకు చేస్తునట్టు గ్రామస్థులను ఎవ్వరిని అడిగిన చేప్తారు.ఈ కౌలు రైతులందరికీ 2011 కౌలు రైతుల చట్టం ప్రకారం గుర్తింపు కార్డులు ఇవ్వవలసిన అధికారులు కార్డులు ఇవ్వకపోగా రైతు ఆత్మ హత్య జరిగినప్పుడు అదే గుర్తింపు కార్డు లేదనే సాకుతో ఎక్స్ గ్రేషియా కు నిరాకరించటం బాధాకరమైన విషయం. రైతు ఆత్మ హత్య జరిగినప్పుడు కొంత హడావిడి జరుగుతుంది కానీ తర్వాత ఆ కుటుంబం గురించి పట్టించుకుంటలేరు అనటానికి చిరుమల ఏలియా ఆత్మ హత్య ఒక ఉదాహరణ. కారంచేడు మండలానికి చెందిన ఏలీయా(46) గత 22 సంవత్సరాలుగా కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. ఎకరా 35 వేల కౌలు లాగా 4 ఎకరాలు వ్యవసాయం చేస్తాడు. 2015 లో పత్తి , పొగాకు పంటలు సాగు చేసిన ఏలీయా భూడిద తెగులు కారణంగా పొగాకు దిగుబడి రాలేదు.వర్షాలు రాని కారణంగా పత్తి ఎకరాకు 2 క్వింటాళ్లు మాత్రమే వచ్చింది. 4 లక్షల అప్పు అయ్యింది. 4 రోజులుగా ఏలీయా కనిపించకుండా పోయాడు అని అందరు అనుకున్నారు.4 రోజుల తర్వాత ఒక రోజు పత్తి చేనులో శవమై కనిపించాడు.పురుగులమందు తాగి ఆత్మ హత్య చేసుకున్నట్లు PMR లో తేలింది. ప్రతి పక్షం, అధికార పక్షం అందరూ వచ్చి వెళ్లారు. న్యూస్ లో చాలా హైలైట్ అయ్యింది. ఇది జరిగింది 8–10–2015 నాడు జరిగింది.కుటుంబ సభ్యులు చాలసార్లు అధికారులను కలిశారు. ఇప్పుడు ,అప్పుడు అన్న అధికారులు చివరికి రిజెక్ట్ అయ్యిందని తెలిపారు,కారణం కౌలు రైతు కార్డు లేకపోవటం. ఇక ఆశ వదులుకున్న ఏలీయా కొడుకు నరేంద్ర బాబు ఉపాధి కోసం చిన్న పత్తి కంపినీలో చేరాడు. ఇప్పుడు గ్రామంలోకి వెళ్లి ఎవ్వరిని అడిగినా ఏలీయా కౌలు రైతు అని చెప్తారు. రెండు సంవత్సరాలు గడుస్తున్నా భాదిత కుటుంబాలకు కనీసం పెన్షన్ రావటం లేదు. ఒక్క కుటుంబానికి కూడాఆహార భద్రత క్రింద ఇవ్వవలసిన AAY కార్డు ఇవ్వలేదు.భర్త ఆత్మ హత్య చేసుకున్న తర్వాత కూడా అప్పుల వాళ్లు తమను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారని ఒక మహిళ చాల సేపు ఏడుపుఆపుకోలేక పోయింది . భాదితులందరు కలిసి గ్రీవెన్స్ లో కలెక్టర్ ను కలిసి న్యాయం చేయమని అడుగుతామన్నారు. వారిని మానవ హక్కుల వేదిక జిల్లా నాయకులు వేణు గోపాల్ గారు సమన్వయం చేస్తానన్నారు. జిల్లాలో 77 మంది రైతులు ఆత్మ హత్య చేసుకుంటే(2–6–2014 నుండి) కేవలం 6 మందికి మాత్రమే ఎక్స్ గ్రేషియా అందింది.

--

--